Specially abled zomato delivery boy viral video: కష్టాలు మనిషికి రాక చెట్లకు వస్తాయా? అంటారు పెద్దలు. కానీ ఆ కష్టాలను చూసి కుంగిపోకుండా, తనకున్న వైకల్యాన్ని అడ్డుకాకుండా చేసుకుని జీవనోపాధి పొందుతున్న ఒక వ్యక్తి కథ ఇప్పుడు ఇంటర్నెట్‌ను కదిలిస్తోంది. ఒక దివ్యాంగ జొమాటో డెలివరీ బాయ్ తన బాధ్యతను అత్యంత సాధారణంగా, చిరునవ్వుతో నిర్వహిస్తున్న తీరు నెటిజన్ల గుండెలను హత్తుకుంటోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వైరల్ వీడియోలో ఏముంది?
వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. శారీరక వైకల్యం ఉన్నప్పటికీ ఆ వ్యక్తి ఎంతో ఆత్మవిశ్వాసంతో తన మూడు చక్రాల వాహనంపై ఆహారాన్ని డెలివరీ చేయడానికి వెళ్తున్నాడు. అతడు నెలకు రూ.10,000 నుండి రూ.12,000 వరకు సంపాదిస్తున్నట్లు పేర్కొన్నాడు. నా భార్య కూడా వికలాంగురాలు. నేను రోజూ పనిచేయడానికి బాధ్యతే కారణమని ఆయన చెప్పుకొచ్చాడు. ఎటువంటి సాకులు చెప్పకుండా, ఎవరిపైనా ఆధారపడకుండా కష్టపడి పని చేస్తున్న అతని తీరు “జీవితం అంటే పోరాటం.. అది సాకులు చెప్పడం కాదు” అనే పాఠాన్ని ఎంతో సరళంగా నేర్పుతోంది.
Also Read: Heartwarming Video -అలల స్పర్శతో చెల్లి కళ్లలో ఆనందం.. వైరల్ అవుతున్న వీడియో..
నెటిజన్స్ ప్రశంసలు
ఈ వీడియో చూసిన నెటిజన్లు సదరు వ్యక్తిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. “మనం చిన్న చిన్న సమస్యలకే బాధపడిపోతుంటాం, కానీ ఈయనను చూస్తే మన సమస్యలు ఎంత చిన్నవో అర్థమవుతోంది” అని ఒక యూజర్ కామెంట్ చేయగా.. “నిజమైన హీరో అంటే ఇతనే” అంటూ మరికొందరు కొనియాడుతున్నారు. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను సాకులుగా మార్చుకోకుండా, ఉన్న వనరులతోనే గౌరవప్రదంగా జీవించడం ఎలాగో ఈ జొమాటో డెలివరీ ఏజెంట్ నిరూపించారు. కష్టపడే తత్వం ఉంటే ఏ అడ్డంకి కూడా మనల్ని ఆపలేదని ఈ వీడియో మనకు గుర్తుచేస్తోంది.

