Farmers Prayer for Rain in Telangana Ghanpur: వర్షాల కోసం ద్వాపరయుగంలో ఇంద్ర, గోవర్ధన పూజలు చేయడం గురించి మనం విన్నాం. అదే విధంగా గ్రామాల్లో వానలు కురువాలని కప్పలకు పెళ్లిళ్లు చేయడం కూడా చూశాం. అయితే జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలంలోని రాఘవపూర్ ప్రజలు మాత్రం వానలు పడాలని వింత పూజలు చేస్తున్నారు. ఇలా చేస్తే వరుణుడు కరుణించి ప్రతి ఏటా వర్షాలు కురిపిస్తాడని వారి నమ్మకం. ఈ సంప్రదాయాన్ని ఎన్నో ఏళ్లు నుంచి అక్కడి ప్రజలు ఆచరిస్తూ వస్తున్నారు. ఇంతకీ వారు చేసే విచిత్ర పూజ ఏంటో తెలుసుకుందాం.
రాఘవపూర్ గ్రామ ప్రజలు వరుణుడి కటాక్షం కోసం పోతురాజు గండి వద్దకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. గ్రామస్తులు అందరూ బియ్యం, బెల్లం, పాలు, కుడుకతో చేసిన వరదపాశంను తీసుకెళ్లి..కొండపూత రాజుకు నైవేద్యంగా సమర్పిస్తారు. తర్వాత ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం కొండ పోతరాజు వద్ద బండపై వరదపాశంను పోస్తారు.
ముందుగా ఈ వరద పాశంను గ్రామంలో పెళ్లికాని యువకులు నాకుతూ మెుక్కులు చెల్లించుకుంటారు. ఆ తర్వాత మగవాళ్లుు, గ్రామ పెద్దలు, రైతులు సైతం ఇదే రీతిలో వరద పాశాన్ని నాకుతూ మెుక్కలు అప్పగిస్తారు. వర్షాలు రాని ప్రతిసారి తాము ఇదే ఆచారాన్ని పాటిస్తున్నామని గ్రామస్థులు చెబుతున్నారు.
మెుక్కులు చెల్లించిన తర్వాత రెండు రోజుల్లో వరుణుడు కరుణించి వర్షాలు కురిపిస్తాడని పల్లెవాసులు అంటున్నారు. వారంతా ఏళ్ల తరబడి ఇదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోకి రుతు పవనాలు ప్రవేశించి నెలరోజులు గడుస్తున్నా భారీగా వర్షాలు పడిందే లేదు. ఈ నేపథ్యంలో ప్రజలు ఇలా చిత్రవిచిత్ర ఆచారాలను పాటిస్తున్నారు.


