College Students Principal Fake News: కాలేజీ బంక్ కొట్టడం కోసం జ్వరం వచ్చిందని అబద్ధం చెప్పడమో, లేక ఇంట్లో ఏదో ఒక సాకు చెప్పి క్లాసులు డుమ్మా కొట్టడమో.. ఇలా విద్యార్థి దశలో కొంతమంది చిలిపి పనులు చేయడం సర్వసాధారణమే.. కానీ ఓ కళాశాలలో మాత్రం పరీక్షలను తప్పించుకోవడం కోసం ఏకంగా ప్రిన్సిపల్ చనిపోయినట్లు ప్రచారం చేశారు కొంతమంది విద్యార్థులు. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.
Also Read: https://teluguprabha.net/viral/women-fight-for-seat-in-lakkavaram-to-bheemavaram-rtc-bus/
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ప్రభుత్వ హోల్కర్ సైన్స్ కాలేజీలో అక్టోబర్ 15, 16 తేదీల్లో సెమిస్టర్ పరీక్షలు జరుగనున్నాయి. ఈ క్రమంలో ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ కాలేదని పరీక్షలని వాయిదా వేయించడానికి ఇద్దరు బీసీఏ మూడో సెమిస్టర్ విద్యార్థులు ఓ ప్లాన్ వేశారు. కళాశాల అధికారిక లెటర్ హెడ్ ఫార్మాట్‌తో ఓ నకిలీ లేఖ రాశారు. ఏకంగా తమ ప్రిన్సిపల్ చనిపోయారని సోషల్ మీడియాలో పుకార్లు పుట్టించడంతో ఈ ఘటన కలకలం సృష్టించింది. కాలేజీ ప్రిన్సిపల్ మరణించారని, అందుకే పరీక్షలు వాయిదా వేయబడ్డాయని సోషల్ మీడియా గ్రూపుల్లో, మెసేజింగ్ యాప్‌లలో మెసేజ్‌లను వ్యాప్తి చేయడం మొదలుపెట్టారు. ‘ప్రిన్సిపల్ డాక్టర్ అనామిక జైన్ ఆకస్మిక మరణం కారణంగా అక్టోబర్ 15, 16 తేదీల్లో జరగాల్సిన కాలేజీ ఆన్‌లైన్ పరీక్షలు, తరగతులు వాయిదా పడ్డాయి.’ అనే సందేశాన్ని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేశారు.
ఈ ఫేక్ న్యూస్ కాసేపట్లోనే కాలేజీ అంతటా వ్యాపించి యాజమాన్యం దృష్టికి చేరింది. మిగిలిన విద్యార్థులు ఆందోళన చెందారు. అయితే ఇక్కడ ప్రిన్సిపల్‌గా ఉన్న వ్యక్తి ఆరోగ్యంగానే ఉన్నారు.. ఆమెకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. దీంతో కాలేజీ యాజమాన్యం వెంటనే స్పందించింది. ప్రిన్సిపల్ డాక్టర్ అనామిక జైన్ మరణించారనే వార్త పూర్తిగా అవాస్తవమని, ఇది పరీక్షలను వాయిదా వేయించేందుకు కొందరు విద్యార్థులు చేసిన పనే అని తెలిపింది. అంతేకాకుండా, పరీక్షలు యథావిధిగా జరుగుతాయని యాజమాన్యం స్పష్టం చేసింది.
Also Read: https://teluguprabha.net/viral/female-passenger-argue-with-driver-in-jaggaiahpet-rtc-bus/
ప్రిన్సిపల్ మృతి చెందారంటూ పుకార్లు వ్యాప్తి చేసిన విద్యార్థులపై పోలీసులకు యాజమాన్యం ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు విద్యార్థులను గుర్తించారు. దీంతో కాలేజీ యాజమాన్యం వారిని 60 రోజుల పాటు సస్పెండ్ చేసింది. ఈ ఘటనతో యువతలో పెరుగుతున్న బాధ్యతారాహిత్యం, పరీక్షలపై వారికి ఉన్న నిర్లక్ష్య వైఖరిని స్పష్టమవుతోంది. విద్యార్థుల తీరుపై విద్యావేత్తలు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


