Teen reel on railway track train hit: సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం కోసం వికృత చేష్టలకు పాల్పడుతున్నారు కొందరు. రీల్స్ మోజులో పడి ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు. ఇలాంటి పనులు చేయవద్దని పోలీసులు ఎంతగా హెచ్చరిస్తున్నా తీరు మారడం లేదు. తాజాగా ఓ బాలుడు రైలు పట్టాలపై రీల్ చేస్తూ ప్రాణాలు కోల్పోయిన సంఘటన చోటుచేసుకుంది.
ఒడిశాలోని పూరీలో ఓ బాలుడు రీల్స్ మోజులో పడి ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటన చోటుచేసుకుంది. మంగళవారం చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మంగళఘాట్‌కు చెందిన 15 ఏళ్ల విశ్వజీత్ సాహు తన తల్లితో కలిసి దక్షిణకాళి ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం ఇంటికి తిరిగి వెళ్తున్న విశ్వజీత్.. జనక్‌దేవ్ పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఆగాడు.
అక్కడ రైలు పట్టాల వద్ద రీల్ చేసేందుకు యత్నించాడు. తన సెల్‌ఫోన్‌లో రికార్డ్ చేస్తుండగా అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన రైలు సాహును ఢీకొట్టింది. దీంతో బాలుడు అక్కడికక్కడే మరణించాడు. ఈ దృశ్యాలన్నీ బాలుడి ఫోన్‌లో రికార్డయ్యాయి. అయితే వీడియోను పరిశీలించినట్లయితే సాహుతో పాటు మరో వ్యక్తి కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది.
Also Read: https://teluguprabha.net/viral/found-fungus-in-sanitary-pads-viral-video/
సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని.. విశ్వజీత్ సాహు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. రీల్స్ కోసం ప్రాణాలను పణంగా పెట్టడం సరికాదంటూ హితవు పలికారు. ఇప్పటికైనా ఈ ఘటనను చూసి మారాలంటూ సూచిస్తున్నారు.


