Country Chicken(Natu Kollu) Found in Farming Fields: లారీలు లేదా కంటైనర్లు రహదారులపై అప్పుడప్పుడూ బోల్తా పడటం చూస్తుంటాం. అలాంటి సమయాల్లో వాహనాల్లోని ఆయిల్ ప్యాకెట్లు, పండ్లు, కూరగాయలు, కోడిగుడ్లు, నీళ్ల డబ్బాలు, కోళ్లు.. ఇలా ఎన్నో రోడ్డుపై పడిపోవడం జరుగుతుంటుంది. ఆ సందర్భాల్లో సమీపంలోని జనం ఎగబడి దొరికింది దొరికినట్లుగా ఇంటికి తీసుకెళ్లి పండుగ చేసుకుంటారు. ఇలాంటివి వార్తల్లో చూసినప్పుడు తెగ నవ్వుకుంటాం.. తాజాగా అలాంటి సంఘటనే ఒకటి చోటుచేసుకుంది. అదేంటంటే..
Also Read: https://teluguprabha.net/telangana-news/mla-komatireddy-rajagopalreddy-conditions-to-liquor-shops/
ఆ ఊరి వాళ్లు పొద్దున్నే లేచి పొలానికి వెళ్లే సరికి ఊహించని దృశ్యం కంటపడింది. పొలం గట్ల వెంబడి ఒకటి కాదు, రెండు కాదు వందలకొద్దీ నాటు కోళ్లు. క్షణాల్లో సమాచారం ఆ నోటా ఈ నోటా పాకి ఊరంతా తెలిసిపోయింది. ఇంకేముంది జనం ఎగబడ్డారు. పత్తి చేల వెంబడి పరుగులు తీసి అందిన కాడికి కోళ్లను పట్టుకున్నారు. కొందరు ఒక దానితో సరిపెట్టుకుంటే మరికొందరు రెండు, మూడు, పదులకొద్దీ కోళ్లను తీసుకెళ్లేందుకు పోటీ పడ్డారు. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగిందంటే..
శనివారం ఉదయం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి- సిద్దిపేట జాతీయ రహదారి వెంబడి సుమారు 1000 కోళ్లను గుర్తు తెలియని వ్యక్తులు వదిలేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న సమీప గ్రామాల ప్రజలు కోళ్ల కోసం పోటీ పడ్డారు. దొరికినకాడికి దొరికినట్టు కోళ్లను సంచులో వేసుకొని మరీ పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read: https://teluguprabha.net/telangana-news/passengers-agitation-at-shamshabad-airport/
అయితే ఈ కోళ్లు అసలు అక్కడికి వచ్చాయి అనే ఆలోచన లేకుండా జనం వాటి కోసం ఎగబడటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ కోళ్లకు వైరస్ రావడం వల్ల వదిలేసి వెళ్లారా..? లేక ప్రమాదవశాత్తు వాహనంలో తీసుకెళ్తుంటే కింద పడిపోయాయా..? అనే దానిపై స్పష్టత లేదు. కాగా, దీనిపై పశు వైద్యాధికారిణి దీపిక స్పందించారు. కోళ్లను ల్యాబ్‌కు పంపించామని ప్రజలెవరూ వాటిని తినొద్దని సూచించారు. రిపోర్ట్స్ వచ్చిన తర్వాత వాటిని తినాలా వద్దా అనేది చెబుతామన్నారు.
ఈ సమాచారం నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఆ ఊరంతా ఈ రోజు నాటుకోడి పులుసు.. నాటుకోడి పలావ్.. నాటుకోడి ఫ్రై..నాటుకోడి పకోడీ.. నాటుకోడి కర్రీ.. అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.


