Doctor Cheated Through Dating App in Hyderabad: హైదరాబాద్‌లో ఓ డాక్టర్ దారుణంగా మోసపోయాడు. మాదాపూర్‌లో డేటింగ్ యాప్ ద్వారా అతడు మోసానికి గురయ్యాడు. గ్రీండర్ యాప్ ద్వారా పరిచయమైన ఓ వ్యక్తి సదరు వైద్యుడుపై అఘాయిత్యం చేయబోయాడు. అతడు ఒప్పుకోకపోవడంతో డబ్బులు కోసం బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో బాధితుడు చివరకు చేసేదేమీ లేక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
మాదాపూర్‌కు చెందిన 23 ఏళ్ల డాక్టర్ కు గ్రీండర్ డేటింగ్ యాప్ ద్వారా ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ ఈ యాప్ ద్వారా రోజూ చాటింగ్ చేసుకునేవారు. ఈ క్రమంలో ఇద్దరు కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీని కోసం సెప్టెంబరు 21న మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీలో ఉన్న ఓయో రూమ్ బుక్ చేసుకున్నారు. దీంతో గదిలోకి వెళ్లిన తర్వాత యువకుడు వైద్యుడుపై అత్యాచారానికి పాల్పడబోయాడు. డాక్టర్ ప్రతిఘటించడంతో కోపంతో రగిలిపోయిన అతడు వైద్యుడుపై చెంపదెబ్బ కొట్టాడు. అంతేకాకుండా డబ్బులు కోసం బ్లాక్ మెయిల్ కు పాల్పడ్డాడు.దీంతో భయపడ్డ డాక్టర్ రూ. 5 వేలను అతడికి యూపీఐ ద్వారా పంపించాడు.
అంతటితో ఆగకుండా నిందుతుడు డాక్టర్ ను ఫాలో చేసి.. అతడు పనిచేస్తున్న ఆస్పత్రికి వెళ్లాడు. డబ్బులు కోసం అక్కడ న్యూసెన్స్ చేశాడు. ఆ తర్వాత డాక్టర్ ఫ్లాట్ లోకి చొరపడి 3 వేల రూపాయలు బలవంతంగా ఎత్తుకెళ్లాడు. ఈ క్రమంలో వైద్యుడిని తిట్టడంతోపాటు భౌతికంగా దాడికి పాల్పడ్డాడు. చంపేస్తానని పదే పదే బెదిరిస్తుండటంతో సదరు వైద్యుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టాడు. నిందుతుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. 308(5), 351(2), 352 సెక్షన్లు కింద సదరు వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు.


