Landlord’s heartwarming farewell gift: మనలో చాలా మంది పుట్టి పెరిగిన ఊళ్లో ఉపాధి లేక పొట్ట చేతపట్టుకుని పట్నానికి వచ్చి బతుకుతున్నారు. ఇక్కడ కూలో నాలో చేసుకుని నాలుగు రాళ్లు వెనుకేసుకుని కుటుంబాలను పోషిస్తారు. అయితే పల్లెటూరిలో ఉన్నటువంటి కంఫార్ట్స్ నగరాల్లో ఉండవు. ఇక్కడ ఒక చిన్న గది, బాత్రూమ్ ఉంటేనే ఐదు వేల నుంచి పదివేలు రెంట్ వసూలు చేస్తారు. అలాంటి మంచి వసతులు కావాలంటే పది వేల పైనే పెట్టాల్సి ఉంటుంది.
సాధారణంగా ఇంట్లో అద్దెకు దిగేవాళ్లు ఓనర్ తో సఖ్యతగా ఉండాలని చూస్తారు. ఎందుకంటే యజమానితో సరిగ్గా లేకపోతే ఎప్పుడు ఖాళీ చేయమంటారోనని భయం. చాలా మంది ఓనర్లు రెంట్ రెండు రోజుల లేట్ అయ్యందంటే చాలు అగ్గిమీద గుగ్గిలం అవుతారు. తిట్టడమో లేదా ఇళ్లు ఖాళీ చేయమనడమో చేస్తారు. కొంత మంది మంచివారు కూడా ఉంటారు లేండి. అయితే మనం అద్దె ఇంట్లోకి దిగితే వెళ్లిపోయేటప్పుడు ఇంతకాలం చూసుకున్నందుకు ఓనర్ కు థ్యాంక్స్ చెప్పి వెళ్తాం. మరికొందరు ఇంటి యజమానితో కలిసిపోయి ఒక కుటుంబంలా ఉంటారు. కానీ మరి కాస్ట్ లీ బహుమతులు ఇచ్చేంత బాండింగ్ అయితే ఉండదు. అయితే తాజాగా ఇలాంటిది బెంగుళూరులో జరిగింది.
బెంగళూరుకు చెందిన ఓ ఇంటి యజమాని అద్దెకు ఉండి వెళ్లిపోతున్న ఓ వ్యక్తికి వెండి కడియం బహుమతిగా ఇచ్చాడు. సదరు వ్యక్తి ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. తాను ఇల్లు ఖాళీ చేస్తున్నప్పుడు ఇంటి ఓనర్ ప్రేమతో వెండి బ్రాస్లెట్ తనకు బహుమతిగా ఇచ్చాడని ఆ వ్యక్తి చెప్పుకొచ్చాడు. ఈ సంఘటనను రెడ్డిట్ ఖాతాలో షేర్ చేశాడు.
ఇళ్ల యజమానులు మనం ఇచ్చిన అడ్వాన్సులే తిరిగి ఇవ్వని నగరంలో నా ఇంటి ఓనర్ నాకు వీడ్కోలు బహుమతి ఇవ్వడం ఆనందంగా ఉందని పేర్కొన్నాడు. నేనున్న రెండు ఏళ్ల కన్న కొడుకులా చూసుకున్నారని ఆ వ్యక్తి చెప్పుకొచ్చాడు. ఖాళీ చేస్తే అద్దె పెంచి వేరే వాళ్లకు ఇచ్చే ఓనర్లు ఉన్న ఈ కాలంలో ఇలాంటి యజమాని ఉండటం గొప్ప విషయమే అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


