Karnataka Raichur Food Poisoning Deaths: గోరు చిక్కుడు కూర తిని ఒకే ఇంట్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ షాకింగ్ ఘటన కర్ణాటకలోని రాయచూర్‌లో జరిగింది. మృతులు రమేష్ (35), అతని కుమార్తెలు నాగమ్మ (8), దీప (6)గా పోలీసులు గుర్తించారు.
అసలేం జరిగిందంటే..
రాష్ట్రంలోని సిర్వార్ తాలుకూ కె. తిమ్మాపూర్ గ్రామానికి చెందిన రమేశ్ నాయక్ కు రెండెకరాలు పొలం ఉంది. అందులో ఇతడు సీడ్ పత్తిని సాగు చేయడమే కాకుండా.. కొంత భాగంలో కురగాయలను కూడా పండిస్తున్నాడు. ఈ క్రమంలో పొలంలో కోసిన గోరు చిక్కుడు కాయలను ఆదివారం ఇంటికి తీసుకురాగా..ఆరుగురు కుటుంబ సభ్యులు సోమవారం రాత్రి వండుకుని తిన్నారు. అయితే సడన్ గా మంగళవారం తెల్లవారుజామున వాంతులు, విరేచనాలు అయి నిమిషాల వ్యవధిలోనే ముగ్గురు మృత్యువాతపడ్డారు. మిగతావారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
సోమవారం రాత్రి రమేశ్ ఇంట్లో రోటీ, అన్నం, సాంబార్ తోపాటు గోరు చిక్కుడు కాయల కూర తిన్నట్లు తెలుస్తోంది. అయితే వీరంతా అదే రోజు తెల్లవారుజామున తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడగా..సన్నిహితులు లింగ్సుగూర్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో రమేశ్, నాగమ్మ చికిత్స ఇవ్వకముందే చనిపోయారు. దీప రాయచూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (RIMS)వైద్యశాలకు తరలిస్తుండగా మార్గ మధ్యలో మరణించింది. ప్రస్తుతం రమేష్ భార్య పద్మావతి, మరో ఇద్దరు పిల్లలు కృష్ణ (11), చైత్ర (10) స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ షాకింగ్ సంఘటన ఆ గ్రామస్తులను భయాందోళనలకు గురిచేసింది.
రమేశ్ పొలంలో పంటకు పురుగుల మందు పిచికారీ చేశాడని.. దాని ప్రభావం వల్లే గోరుచిక్కుడు విషతుల్యమై ప్రాణాలు తీసి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. దీనిపై కవితల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మెుదలుపెట్టారు. ఇదే నెల 16న కర్ణాటకలోని కలబురగి జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్నం భోజనం వికటించి.. దాదాపు 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.


