Farmer Income: మధ్యప్రదేశ్‌లో ఓ రైతుకు జారీ చేసిన ఆదాయ ధ్రువీకరణ పత్రం తాజాగా దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ పత్రంలో రైతు వార్షిక ఆదాయం కేవలం మూడు రూపాయలుగా పేర్కొనడంతో, అది సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారి తీసింది. పత్రం బయటకు రావడంతో “ఇదేనా దేశంలో అత్యంత పేద వ్యక్తి?” అంటూ నెటిజన్లు సర్వత్రా స్పందిస్తున్నారు. వివరాల్లోకెళ్తే.. సత్నా జిల్లాలోని కోఠీ మండలానికి చెందిన రామ్‌స్వరూప్ అనే రైతు, ఆదాయ ధ్రువీకరణ పత్రం కోసం స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని ఆశ్రయించాడు. అధికారులు జూలై 22న ధ్రువపత్రం జారీ చేశారు. పత్రంపై తహసీల్దార్ సౌరభ్ ద్వివేది సంతకం కూడా ఉంది. కానీ అందులో రామ్‌స్వరూప్ వార్షిక ఆదాయం రూ.3 మాత్రమేగా ఉండటాన్ని చూసి ఆయన షాక్‌కు గురయ్యాడు. ఈ లెక్కన అతడి నెల ఆదాయం 25 పైసలు మాత్రమే అవుతుంది.
సోషల్ మీడియాలో వైరల్.. అధికారులు స్పందన
ఈ ఘటన వెలుగులోకి రాగానే, పత్రం ఫొటో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. విషయాన్ని గమనించిన అధికారులు జూలై 25న సవరించిన కొత్త ధ్రువీకరణ పత్రం జారీ చేశారు. ఇందులో రామ్‌స్వరూప్ వార్షిక ఆదాయం రూ.30,000గా పేర్కొన్నారు. ఈ తప్పిదంపై స్పందించిన తహసీల్దార్ ద్వివేది, “ఇది పూర్తిగా క్లోరికల్ తప్పిదం వల్ల జరిగింది. వెంటనే సరిచేశాం,” అని వివరణ ఇచ్చారు. ఈ ఘటనపై మధ్యప్రదేశ్ కాంగ్రెస్ తీవ్రంగా విమర్శలు గుప్పించింది. అధికార బీజేపీ ప్రభుత్వంపై టార్గెట్ చేస్తూ, “ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ పాలనలో దేశంలోనే అత్యంత పేదవాడు కనబడిపోయాడు. ఇది అధికార యంత్రాంగ వైఫల్యానికి నిదర్శనం,” అంటూ ట్విట్టర్ (X) వేదికగా స్పందించింది.
ఇలాంటి ఘోరమైన పొరపాట్లు పేద ప్రజలకు అనేక విధాలుగా నష్టాన్ని కలిగించే ప్రమాదం ఉంది. ప్రభుత్వ సేవల్లో ఈ తరహా అనవసరమైన తప్పిదాలు సమర్థవంతమైన సమీక్ష అవసరమని నిపుణులు అంటున్నారు. ఈ ఘటన వ్యవస్థపట్ల ప్రజల నమ్మకాన్ని దెబ్బతీసేలా మారకూడదని, మరింత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందని సామాజిక కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.


