Uttar Pradesh: ఉచితంగా వస్తే ఏదైనా సరే అనే ధోరణి ఎంత ప్రమాదకరంగా మారుతుందో చెప్పేందుకు ఈ ఘటనే నిదర్శనం. అధికారులు ఆరోగ్యానికి హానికరమని చెత్తకుండీలో పడేసిన కల్తీ స్వీట్ల కోసం జనం ఎగబడటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.
అసలేం జరిగిందంటే: ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇటీవల స్వీట్ షాపులపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో గడువు ముగిసిన, కల్తీ జరిగిన భారీ నిల్వలను అధికారులు గుర్తించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న షాపు యజమానులపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఆ స్వీట్లను సీజ్ చేసి సమీపంలోని మున్సిపల్ చెత్తకుండీలో పారేయించారు.
విస్తుపోయిన అధికారులు: అధికారులు అక్కడి నుంచి వెళ్లారో లేదో.. స్థానికులు కొందరు చెత్తకుండీ వద్దకు చేరుకున్నారు. మురికిగా ఉన్న ఆ కుండీలో నుంచి కల్తీ స్వీట్ల బాక్సులను పోటీ పడి మరీ ఏరుకున్నారు. అవి ఆరోగ్యానికి హానికరమని తెలిసినా.. కేవలం ఉచితంగా వస్తున్నాయని వాటిని ఇంటికి తీసుకెళ్లడం అక్కడున్న వారిని ఆశ్చర్యానికి గురిచేసింది.
Also read-Viral News: ‘శుభలగ్నం’ సీన్ రిపీట్.. రూ. 1.7 కోట్లకు భర్తను అమ్మేసిన భార్య!
నెటిజన్ల ఆగ్రహం: ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ప్రాణాల కంటే రుచి, ఉచితం ముఖ్యమైపోయాయా? అని కొందరు ప్రశ్నించారు. అవగాహన లేని ఇలాంటి చర్యలు ప్రాణాంతకమని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. అధికారులు పారేసిన వస్తువులను మళ్లీ సేకరించకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.

