Men form human bridge due to heavy rains in Punjab: దేశవ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ వానలకు నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. గత కొన్ని రోజులగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. చాలా ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తమయింది. ఇప్పటికే రోడ్లు, పొలాలు నీట మునిగాయి. పలు రాష్ట్రాల్లో విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చారు.
పంజాబ్ లో సైతం భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాలకు స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ వానలకు రోడ్లు కొట్టుకుపోవడంతో ప్రజలతోపాటు విద్యార్థులు కూడా తమ గమ్యస్థానాలకు చేరుకోలేక అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో మోగాలో జరిగిన ఓ సంఘటన సోషల్ మీడియాను కదిలించింది.
భారీ వర్షాలకు రాష్ట్రంలోని మోగా ప్రాంతంలో మల్లెయాన్, రసూల్పూర్ గ్రామాలను కలిపే ప్రధాన రహదారి కొంత భాగం కూలిపోయింది. పాఠశాలకు వెళ్లిన పిల్లలు ఉదయం 10 గంటలకు సెలవు ప్రకటించడంతో వారి ఇంటికి తిరుగుముఖం పట్టారు. రోడ్డు గండికి పడటంతో 35 మంది విద్యార్థులు చిక్కుకుపోయారు.
దీంతో సుఖ్‌బిందర్ సింగ్, గగన్‌దీప్ సింగ్ అనే ఇద్దరు వంతెనగా ఏర్పడి విద్యార్థులను అవతలి ఒడ్డుకు చేర్చారు. వారు చేసిన ఈ పనికి ప్రశంసలు జల్లు కురుస్తుంది. ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో..దాన్ని చూసిన అధికారులు వీలైనంత తొందరగా ఆ ప్రాంతంలో వంతెన ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.


