Viral 1000 Wala: సోషల్ మీడియా ఫేమస్ అవ్వడం కోసం కొందరు వికృత చేష్టలకు పాల్పడుతుంటారు. తమకు హాని కలుగుతుందని తెలిసినా.. లైక్స్, వ్యూస్ కోసం ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తుంటారు. రైల్వే ట్రాక్‌పైన వీడియోలు చేయడం, ట్రైన్ వస్తుంటే సెల్ఫీ వీడియో తీసుకోవడం, కొండల అంచున నిలబడి రీల్స్ చేయడం, బైక్‌పై వెళ్తూ వీడియో చేయడం.. ఇలా ఒకటా రెండా.. సోషల్ మీడియా మోజులో పడి ప్రాణాలకు తెగిస్తున్నారు. తాజాగా దీపావళి నేపథ్యంలో ఓ యువకుడు చేసిన నిర్వాకం నెట్టింట్లో వైరల్ అవుతోంది.
దీపావళి వస్తుందంటేనే వారం, పదిరోజుల ముందు నుంచే టపాసుల సందడి మొదలవుతుంది. కొందరు సంప్రదాయబద్ధంగా రోడ్డుపై టపాసులు పేలుస్తూ వేడుకలు జరుపుకొంటారు. ఇక దీపావళి టపాసుల్లో 1000 వాలా చాలా ఫేమస్.. రోడ్డుపై పెట్టి పేలుస్తుంటే వచ్చే. సౌండ్ చాలా మజా వస్తుంది. కానీ ఓ యువకుడు మాత్రం.. ఈ 1000 వాలాను ఒంటిపై పెట్టుకుని పేల్చుకున్నాడు. ఈ ఘనకార్యాన్ని ఫ్రెండ్స్‌తో వీడియో చేయించాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
ఓ వ్యక్తి 1000 వాలా టపాసుల దండను నడుము నుంచి కాళ్ళ చుట్టూ చుట్టుకున్నాడు. అనంతరం అతడి రెండు చేతులను తాళ్లతో కట్టేయించాడు. ఆ తర్వాత మరో వ్యక్తి ఆ టపాసులకు నిప్పంటించగా.. వెంటనే, ఆ టపాసులు ఒకదాని తర్వాత ఒకటిగా టపటపా పేలాయి. మంటలు, పొగ, చెవులు చిల్లులు పడే శబ్దాల వస్తున్నప్పటికీ ఆ అబ్బాయి అలాగే నిలుచున్నాడు. ఈ దృశ్యం చూస్తున్న వారికి ఓ వైపు గుండెలు అదిరిపోతున్నాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు మండిపడుతున్నారు.
Also Read: https://teluguprabha.net/telangana-news/government-plant-to-setup-health-atms-in-rural-phcs/
”ఇదెక్కడి పిచ్చి రా బాబు!” అంటూ అతడిని తిట్టిపోస్తున్నారు. పటాసులు నేలపై పేలడానికి తయారు చేశారు. ఒంటిపై పేల్చుకోవడానికి కాదు అంటూ ఓ వ్యక్తి కామెంట్లలో మండిపడ్డాడు. ఇలాంటి మతిలేని పనులు ఎందుకు చేస్తున్నారంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. వ్యూస్, లైకులు కోసం ఇలా ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దంటూ హితవు పలికారు.


