Ajmer floods Viral Videos: ఉత్తర భారతాన్ని కుండపోత వర్షాలు వణికిస్తున్నాయి. ముఖ్యంగా జమ్మూకశ్మీర్, రాజస్థాన్, యూపీల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వరుణుడి ధాటికి నదులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగాయి. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. చాలా చోట్ల కొండచరియలు విరిగి పడుతున్నాయి. ఈ వర్షాల నేపథ్యంలో కొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రాజస్థాన్ ఆజ్మీర్ లో శుక్రవారం రాత్రి కురిసిన వర్షాలకు వీధులన్నీ నదులను తలపించాయి. నగరంలోని నాలా బజార్‌లో వరద ఉద్ధృతికి వస్తువులు, వాహనాలతోపాటు మనుషులు కూడా కొట్టుకుపోయారు. దర్గా ప్రాంత సమీపంలోని నిజాం గేట్ సమీపంలో ఓ వ్యక్తి నీటిలో జారిపడి వీధిలోని వరద ప్రవాహంలో కొట్టుకుపోయాడు. అతడిని పట్టుకునేందుకు చాలా మంది ప్రయత్నించినప్పటికీ వీలు కాలేదు. చివరకు ఒక హోటల్ సమీపంలో షాపుల్లో పనిచేసే వ్యక్తులు అతన్ని రక్షించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్స్ తమదైన శైలిలో లైక్స్, కామెంట్స్ చేస్తున్నారు.
https://twitter.com/AjitSinghRathi/status/1946427967233818825
మరో వీడియోలో అయితే వరద ప్రవాహంలో ఇంట్లో సామాన్లు, ఇతర వస్తువులతోపాటు మోటార్ సైకిల్ కొట్టుకుపోవడం చూడవచ్చు. ఈ వర్షాలకు నగరంలోని లఖన్ కోట్డిలో శనివారం ఉదయం ఒక శిథిలావస్థలో ఉన్న ఇల్లు కూలిపోయింది. అయితే అందులోని వారు ముందుగానే ఇల్లు ఖాళీ చేశారు. ఈ వర్షాలకు అజ్మీర్‌లోని అనా సాగర్ సరస్సు కూడా ఉప్పొంగి ప్రవహిస్తుంది. స్థానికులు ఇసుక బస్తాలను ఉపయోగించి ప్రవాహాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. రాజస్థాన్‌లోని బుండి, పుష్కర్, పాలి మరియు సవాయి మాధోపూర్ నగరాల్లో కూడా భారీగానే వర్షాలు కురుస్తున్నాయి. జూన్ 1న రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుండి రాష్ట్రంలో సాధారణం కంటే 126 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైంది.


