Woman fight jackal: సాధారణంగా క్రూరమైన నక్క దాడి చేస్తే ఎవరైనా భయంతో వణికిపోవాల్సిందే. కానీ మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ 65 ఏళ్ల వృద్ధురాలు మాత్రం అలా కాదు. ఆ వృద్ధురాలు ధైర్యానికి మారుపేరుగా నిలిచింది. మాయదారి నక్కపై పోరాడి.. దాన్ని చంపేసింది. ఆమె అసాధారణ ధైర్యసాహసాలతో అందరినీ ఆశ్చర్యపరిచింది.
చీర కొంగే ఆయుధం: మధ్యప్రదేశ్‌లోని శివ్‌పురి జిల్లా బర్ఖాడీ గ్రామానికి చెందిన సురజియా బాయి పశువుల మేత కోసం పొలానికి వెళ్లారు. అదే సమయంలో ఒక నక్క ఆమెపై దాడి చేశారు. ఆ నక్క ఆమె కాళ్లు, చేతులపై దాదాపు 18 సార్లు కరిచి తీవ్ర గాయాలు చేసింది. అయినా సురజియా భయపడకుండా గట్టిగా అరిచారు. ఎంత గట్టిగా అరిచినా.. ఎవరూ సహాయం కోసం ముందుకు రాలేదు. దీంతో ఆ వృద్ధురాలు ధైర్యాన్ని కూడగట్టుకున్నారు. శివంగిలా నక్కపై ఎదురుదాడికి దిగారు. అరగంట పాటు సాగిన ఈ పోరాటంలో.. సురజియా తన చీర కొంగునే ఆయుధంగా మార్చుకున్నారు. నక్క మెడకు చీర కొంగును ఉచ్చుగా బిగించి చంపేసింది. అనంతరం ఆమె తీవ్ర రక్తస్రావంతో స్పృహ కోల్పోయారు. ఆరు గంటల తర్వాత ఆసుపత్రిలో ఆమెకు స్పృహ వచ్చిందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది. చికిత్స కొనసాగుతోందని వైద్యులు తెలిపారు.
సురజియా కుటుంబానికి కొత్తేమీ కాదు: ఈ ఘటన సురజియా కుటుంబానికి కొత్తేమీ కాదు. 6 నెలల క్రితం సురజియా మరిది లాతురా జాదవ్ సైతం ఇంటిలోకి వచ్చిన నక్కతో పోరాడి చంపారు. దురదృష్టవశాత్తు.. ఆ గాయాల కారణంగా ఆయన మూడు నెలల క్రితం మరణించారు. ఈ నేపథ్యంలో సురజియా చూపించిన తెగువ, ధైర్యం అందరి ప్రశంసలు అందుకుంటోంది.
అరిచే కొద్దీ దాడి చేసింది: అరిచే కొద్దీ నక్క మరింత తీవ్రంగా దాడి చేసిందని సురజియా బాయి అన్నారు. ఎంత గట్టిగా అరిచినా.. ఎవరూ సహాయం కోసం ముందుకు రాలేదని తెలిపారు. దీంతో ఆ వృద్ధురాలు ధైర్యాన్ని కూడగట్టుకున్నట్లు చెప్పారు. శరీరంలోని శక్తినంతా కూడగట్టుకుని దాన్ని చంపేశానని.. ఆసుపత్రి బెడ్‌పై నుంచే ఆ పోరాటాన్ని గుర్తుచేసుకున్నారు.


