woman search for her father: ఓ యువతి యదార్థ ఘటన కళ్లు చెమర్చేలా చేస్తోంది. ఎందుకంటే ఆ యువతికి పుట్టిన ఊరు తెలియదు. కన్న తండ్రి ఎవరో కూడా తెలీదు. అసలు తల్లి సైతం ఉందో లేదో తెలియని స్థితి ఆ యువతిది. ఈ కష్టాలు ఒకెత్తైతే భారతీయ మూలాలతో కూడిన తన వేషధరణ మరో ఎత్తు. అయితే ఆ యువతి తనకు ఒక కుటుంబం ఉందనే విషయాన్ని గ్రహించింది. విదేశాల నుండి తన తండ్రిని వెతుక్కుంటూ హైదరాబాద్ నగర వీధుల్లో తిరుగుతోంది.
భావోద్వేగమైన ఘటన: తన మూలాలను వెతుక్కుంటూ 40 ఏళ్ల తర్వాత ఒక యువతి విదేశాల నుంచి హైదరాబాద్‌కు వచ్చింది. భారతీయ మూలాలతో కూడిన వేషధారణ కారణంగా స్వీడన్‌లో అవమానాలకు గురైన ఆమె.. తన సొంత కుటుంబాన్ని కలుసుకోవాలని తపిస్తోంది. ఈ భావోద్వేగమైన యదార్థ ఘటన.. ఆమె తండ్రి కోసం హైదరాబాద్‌లో సాగిస్తున్న అన్వేషణకు అద్దం పడుతుంది.
మేనమామను గుర్తించిన యువతి: సరిగ్గా 40 సంవత్సరాల క్రితం.. హైదరాబాద్‌లో జన్మించిన ఆ యువతి పేరు సంధ్యారాణి. ఆమె తల్లిదండ్రులు, పుట్టిన ప్రదేశం ఆమెకు తెలియదు. అయితే.. ఆమె మేనమామ రామయ్య ద్వారా కొన్ని వివరాలు తెలిశాయి. 1987లో నిజాం కాలేజీలో పనిచేసే రామయ్య.. తన చెల్లెలికి అబిడ్స్‌లోని పారాస్ హోటల్‌లో పనిచేసే రాజ్ కుమార్ అనే వ్యక్తితో వివాహం జరిపించారు. ఈ క్రమంలోనే సంధ్యారాణి జన్మించింది. సంధ్యారాణికి రెండేళ్ల వయసు ఉన్నప్పుడు.. తండ్రి వారిని వదిలి వెళ్లిపోయాడు. తల్లి ఆచూకీ కూడా తెలియలేదు. దీంతో రామయ్య సంధ్యారాణిని ఒక చైల్డ్ హోమ్‌లో చేర్చారు.
విదేశాల్లో కష్టాలు: సంధ్యారాణికి రెండేళ్ల వయసులో స్వీడన్‌కు చెందిన పిల్లలు లేని ఒక దంపతులు ఆమెను.. చట్టబద్ధంగా దత్తత తీసుకున్నారు. అక్కడ వారు సంధ్యారాణిని చిత్రహింసలకు గురి చేశారు. చిన్నతనం నుంచే తనకు భారతీయ మూలాలు ఉండడం వల్ల స్వీడన్‌లో వేధింపులు, అవమానాలు ఎదుర్కొంది ఆ యువతి. వారు తన సొంత తల్లిదండ్రులు కాదని తెలుసుకున్న ఆమె.. అక్కడి నుంచి సొంతంగా లండన్‌కు వెళ్లింది. అక్కడ ఒక ప్రముఖ విశ్వవిద్యాలయంలో సైకాలజీలో డిగ్రీ పూర్తి చేసింది.
నువ్వు హాస్పిటల్‌లో కాదు.. ఫుట్‌పాత్ మీద పుట్టావు!: లండన్‌లో ఒక స్నేహితుడి సహాయంతో తన సొంత కుటుంబాన్ని కలుసుకోవాలని సంధ్యారాణి నిర్ణయించుకుంది. 2009లో తొలిసారి హైదరాబాద్‌కు వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాలుగుసార్లు వచ్చి తన తండ్రి రాజ్ కుమార్ కోసం నగరం వీధులన్నీ గాలించింది. తన కుటుంబం వరంగల్‌కు చెందినదని గుర్తించింది. తండ్రి ఒక రెస్టారెంట్‌లో పనిచేసేవారని ఆమె తెలుసుకుంది. పెంచుకున్న తల్లిదండ్రులు తన తల్లి గురించి తప్పుడు సమాచారం ఇచ్చేవారని పేర్కొంది. “నువ్వు హాస్పిటల్‌లో కాదు, ఫుట్‌పాత్ మీద పుట్టావు” అని వేధించేవారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
మనం కూడా ఆశిద్దాం: తన జీవితానికి సంబంధించిన నిజం తెలుసుకోవాలని, తన కుటుంబంతో కలిసి భారతదేశంలో జీవించాలని సంధ్యారాణి కోరుకుంటోంది. ఈ అన్వేషణలో పూణేలోని ‘ఎడాప్ట్ కౌన్సిల్ రైట్స్’ సంస్థ ఆమెకు సహాయం అందిస్తోంది. అయితే ఆ యువతి తల్లిదండ్రులు ఎవరో త్వరలోనే తెలియాలని మనం కూడా ఆశిద్దాం


