Woman Sprays Pepper on Passengers: ఉచిత బస్సు ప్రయాణం పథకం అమల్లోకి వచ్చాక బస్సుల్లో మహిళల రద్దీ విపరీతంగా పెరగడం చూస్తున్నాం. ఈ క్రమంలో సీట్ల కోసం అతివలు జుట్లు పట్టుకుని కొట్టుకోవడం లాంటి ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో చోటుచేసుకోవడంతో తెగ వైరల్ అయ్యాయి. అయితే ఇలాంటి సంఘటనలు రైళ్లలో ఇప్పటివరకూ ఎప్పుడూ జరగలేదు. కానీ తాజాగా ఓ లోకల్ ట్రైన్‌లో సీటు దొరక్కపోవడంతో ఓ మహిళ చేసిన పని నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది.
లోకల్ ట్రైన్‌లో సీటు దొరకపోవడంతో అసహనంతో ఒక మహిళ ప్రయాణికులపై పెప్పర్ స్ప్రే చల్లిన ఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఓ లోకల్ ట్రైన్ సీల్దా స్టేషన్‌కు చేరుకోగానే ఓ మహిళ ఎక్కింది. రైలులో సీటు దొరక్కపోవడంతో ఆగ్రహానికి గురై.. హ్యాండ్ బ్యాగ్ నుంచి పెప్పర్ స్ప్రే డబ్బా తీసి ప్రయాణికుల ముఖంపై చల్లేందుకు యత్నించింది. వెంటనే ఓ మహిళ అడ్డుకోవడంతో.. మరింత రెచ్చిపోయి ఆ కంపార్ట్‌మెంట్‌లో పెప్పర్ చల్లింది. దీంతో కారం ఘాటుకు కొందరు ఇబ్బందులకు గురయ్యారు. పిల్లలు అస్వస్థతకు గురయ్యారు.
मैडम को सीट नहीं मिली तो मैडम ने मिर्च स्प्रे छिड़क दिया दूसरी महिलाओं पर।🥰
सीट बचाने की जंग, मिर्च स्प्रे के संग! pic.twitter.com/jxZkuybuyT
— Chitraahh Commentary (@ParodyChitraahh) October 10, 2025
హఠాత్పరిణామానికి ఖంగు తిన్న ప్రయాణికులు వెంటనే మహిళను అడ్డుకుని నిలదీశారు. దీంతో ఆమె క్షమాపణలు చెప్పింది. అనంతరం ఆ మహిళను రైల్వే పోలీసులకు అప్పగించారు. ఇందుకు సంబంధించిన ఘటనను కొందరు ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్లలో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది.


