Saree Theft Viral Video: ఓ దుకాణంలో చీరలు దొంగిలించిందన్న కారణంతో మహిళను షాప్ యజమాని నడి రోడ్డుపైకి ఈడ్చుకొచ్చి దారుణంగా కొట్టిన ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటుచేసుకుంది. సదరు మహిళను కాళ్లతో తంతూ దూషించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ నెల 20న బెంగళూరు అవెన్యూ రోడ్డులోని మాయా సిల్క్స్ శారీస్ దుకాణంలోకి వెళ్లిన ఓ మహిళ.. షాపులోని 61 చీరల కట్టను దొంగిలించింది. వీటి విలువ రూ. 91,500 వరకు ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. కాగా, ఆమె చీరలను దొంగిలిస్తున్నట్లు దుకాణంలోని సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయింది. గమనించిన దుకాణం యజమాని సదరు మహిళపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిటీ మార్కెట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మరుసటి రోజు సదరు మహిళ మళ్లీ ఆ దుకాణం వైపు రావడంతో గమనించిన షాపు యజమాని వెంటనే తన సిబ్బందితో కలిసి సదరు మహిళపై దాడికి పాల్పడ్డారు. రోడ్డుపైకి ఈడ్చుకొచ్చి చితకబాదుతుండగా.. ఆ ఘటనను అక్కడున్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. సదరు మహిళను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఆమె దొంగిలించిన చీరలను స్వాధీనం చేసుకున్నారు.
Also Read: https://teluguprabha.net/viral/drugs-addicted-man-swallowed-spoons-and-brushes-in-up/
కాగా మహిళపై దాడి వీడియో వైరల్ కావడంతో సంఘటనపై నెటిజన్ల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. మహిళపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడంతో.. దాడికి పాల్పడిన దుకాణం యజమాని, సిబ్బందిని అరెస్ట్ చేశారు.


