Young Man Suicide Attempt From Hi Tension Tower: ప్రేమించిన అమ్మాయితో పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోతే పారిపోయి పెళ్లి చేసుకున్న సందర్భాలు చూశాం. లేదా వారు ఒప్పుకొనేంత వరకు వెయిట్ చేయడం లేదంటే పేరెంట్స్‌ని బాధ పెట్టడం ఇష్టలేక పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకోవడం చూశాం. కానీ ఈ యువకుడు మాత్రం ప్రేమించిన యువతితో పెళ్లి కోసం పబ్లిక్ ప్లేస్‌లో తన ప్రాణాలనే పణంగా పెట్టాడు. ఏకంగా విద్యుత్ టవర్ ఎక్కి ఆత్మహత్యకు యత్నించాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఒక యువకుడు తనకు పెళ్లి చేయాలని కుటుంబీకులపై ఒత్తిడి చేస్తూ హైటెన్షన్ విద్యుత్ టవర్‌పైకి హల్‌చల్ చేశాడు. స్థానికులు అతన్ని కిందకు దించేందుకు ప్రయత్నించినా, అతడు వినిపించుకోలేదు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు, విద్యుత్ శాఖ అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని యువకుడిని కిందకు దించేందుకు బృందాలు సిద్ధం చేశారు.
అయితే యువకుడిని అధికారులు గంటల తరబడి సముదాయించినా.. తన నిర్ణయంపై యువకుడు మొండిగా నిలబడ్డాడు. చివరికి పోలీసులు దగ్గరగా వెళ్లే క్రమంలో వారి చేతుల్లోంచి తప్పించుకుని, టవర్ పై నుంచి కిందకు దూకేశాడు. టవర్ కింద మట్టితో కూడిన బురద ఉండటంతో యువకుడి తలకు, కాళ్లకు తీవ్రమైన గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు సమీపంలోని ఆసుపత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు అతని పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు. కుటుంబం ప్రేమ వివాహానికి అంగీకరించకపోవడంతో యువకుడు ఈ దారుణ చర్యకు పాల్పడ్డాడని పోలీసులు పేర్కొన్నారు.


