తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వరదల కారణంగా ఐదు రైళ్లు నిలిచిపోయాయి. ఆ రైళ్లలోని ప్రయాణికులను వారి వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. బస్సులు, ప్రత్యేక రైళ్ల ద్వారా సుమారు 10 వేల ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ రవాణా ఏర్పాట్లు చేసింది.
సెప్టెంబర్ ఒకటిన తెల్లవారుజామున సికింద్రాబాద్ – విశాఖపట్నం గోదావరి ఎక్స్ప్రెస్, న్యూఢిల్లీ – చెన్నై తమిళనాడు ఎక్స్ ప్రెస్, హైదరాబాద్ – తాంబరం చార్మినార్ ఎక్స్‌ప్రెస్ మొదలైన మూడు రైళ్లు కొండపల్లి- రాయనపాడు స్టేషన్ల మధ్య నిలిచిపోయాయి. ఈ రైళ్లలోని ప్రయాణికులను బయటకు తీసుకురావడానికి పలు జేసీబీలు, ట్రాక్టర్లను వినియోగించారు.
దాదాపు 4,200 మంది ప్రయాణికులను విజయవాడ రైల్వే స్టేషన్‌కు తరలించేందుకు 84 ఆర్టీసీ బస్సులను సంఘటనా స్థలంలో ఉంచారు. గోదావరి ఎక్స్‌ప్రెస్ ప్రయాణికుల కోసం విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి విశాఖపట్నం వైపు ఒకటి , తమిళనాడు ఎక్స్‌ప్రెస్, చార్మినార్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణికుల కోసం చెన్నై వైపు మరో రెండు ప్రత్యేక రైళ్లను.. మొత్తం మూడు ప్రత్యేక రైళ్లు నడిపారు.
ఆదేవిధంగా బెంగళూరు నుంచి దానాపూర్‌కు , దానాపూర్ నుంచి బెంగళూరుకు ఏకకాలంలో రెండు ప్రత్యేక రైళ్లను నడిపారు. వీటితోపాటు నెక్కొండ నుంచి 74 బస్సులను ఏర్పాటు చేసి 5,600 మంది ప్రయాణికులను కాజీపేటకు తీసుకొచ్చారు. కాజీపేట నుంచి దానాపూర్‌కు ఒక ప్రత్యేక రైలు, కాజీపేట నుంచి బెంగళూరుకు మరో ప్రత్యేక రైలులో ప్రయాణికులందరినీ సురక్షితంగా వారి వారి గమ్యస్థానాలకు చేర్చారు.
ప్రయాణీకులందరికీ అల్పాహారం, భోజనం, రాత్రి భోజనం, తాగు నీటి ఏర్పాట్లు కూడా చేశారు.