సమయం
(సమయమంత్రి చంద్రశేఖర శర్మ)
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వరదలు బీభత్సం సృష్టించాయి. తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు గుండెకాయ లాంటి విజయవాడ నగరాన్ని వరదనీరు అతలాకుతలం చేసేసింది. గుంటూరు జిల్లాపైనా తీవ్ర ప్రభావం ఉంది. కొన్ని లక్షల మంది నిరాశ్రయులయ్యారు. తినడానికి గుప్పెడు తిండి లేక, తాగడానికి గుక్కెడు నీరు దొరక్క అల్లాడుతున్నారు. ఇలాంటి సమయంలో బాధ్యత కలిగిన రాజకీయ నాయకులు.. వాళ్లు ఏ పార్టీకి చెందినవారైనా కూడా నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి. మానవత్వంతో స్పందించి తాము సైతం తమ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆపన్నులను ఆదుకునేందుకు రంగంలోకి దూకాలి. ప్రభుత్వం చేపడుతున్న సహాయ చర్యలకు తోడుగా తాము కూడా తమవంతు బాధ్యతను నిర్వర్తించాలి. కానీ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు చేస్తున్నదేంటి? వరదల్లో బురద రాజకీయమే అనక తప్పట్లేదు. తలదాచుకునేందుకు గూడు కూడా లేక కొన్ని లక్షల మంది ప్రజలు అవస్థలు పడుతుంటే.. నాయకులు మాత్రం ఇప్పటికీ తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాలను వదిలిపెట్టకుండా.. అధికార పక్షాన్ని విమర్శించడం, ఇంకా నాలుగాకులు ఎక్కువ చదివినట్లు కొన్నిచోట్ల పరస్పరం దాడులకు పాల్పడడం అత్యంత జుగుప్సాకరమైన విధానం.
అసలే ఆర్థిక కష్టాల్లో ఉన్న రెండు తెలుగు రాష్ట్రాలను గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన కుండపోత వర్షాలు, ఆపై వచ్చిన వరదలు అతలాకుతలం చేశాయి. అప్పుల సుడిగుండంలో ఉన్నా కూడా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలుచేయడానికి ఆపసోపాలు పడుతున్నారు ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్డీయే కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఖజానా దాదాపు ఖాళీ అయిపోవడంతో అదే పరిస్థితుల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉన్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే వరద ముంచెత్తి రావడంతో ఇద్దరూ ఉక్కిరిబిక్కిరయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత కీలకమైన విజయవాడ-గుంటూరు ప్రాంతాలతో పాటు తెలంగాణలో ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలు వరద తాకిడికి చిగురుటాకుల్లా వణికిపోయాయి. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురవకపోతేనే ఇప్పటివరకు ఉన్న వరదనీరు తగ్గడానికి మూడు నాలుగు రోజులు పడుతుంది. కనీసం 15 రోజులైతే తప్ప సాధారణ పరిస్థితులను పునరుద్ధరించడం సాధ్యం కాదు. ఈ విషమ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ముఖ్యమంత్రులు ఇద్దరూ ప్రత్యక్షంగా రంగంలోకి దిగారు. చంద్రబాబు నాయుడు పగలు, రాత్రి అన్న తేడా లేకుండా రోజంతా పర్యటిస్తూ, పర్యవేక్షిస్తూ.. తాను పరుగులు పెడుతూ అధికార యంత్రంగాన్ని, మంత్రులను కూడా పరుగులు పెట్టిస్తున్నారు. ఆహారం, మందులు, తాగునీటి పంపిణీ కోసం అత్యాధునికంగా డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. ఇప్పటికే 30 డ్రోన్లు ఈ పనిలో ఉండగా, మరో 200 డ్రోన్లు తెప్పించి అన్ని ప్రాంతాలకూ ఆహారసరఫరా చేయాలని యోచిస్తున్నారు. రేవంత్ రెడ్డి కూడా స్వయంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ ఆపన్నులకు అభయ హస్తం అందించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ, రెండు రాష్ట్రాల్లోనూ ప్రతిపక్షాలు మాత్రం ఇదే అదను అన్నట్లు రాజకీయ విమర్శలకు దిగాయి. కొంతలో కొంత ఏపీలో ప్రతిపక్ష నేత అయిన వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నేరుగా వరదనీళ్లలో దిగి బాధితులను పలకరించారు. కానీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గానీ, ఆయన తనయుడు కేటీఆర్ గానీ ఖమ్మం, వరంగల్ ప్రాంతాలకు వెళ్లిన పాపాన కూడా పోలేదు.
మన దేశంలోనే పెను విపత్తుల్లో ఒకటైన 1977 నవంబర్ నాటి దివిసీమ ఉప్పెన సంభవించినప్పుడు వాళ్లు, వీళ్లని లేకుండా ప్రతి ఒక్కరూ రంగంలోకి దిగి తమవంతు సహాయం చేశారు. నిజానికి ఆ ఉప్పెన అంత తీవ్రతతో ఇప్పటి వరదను పోల్చలేము గానీ, విజయవాడ నగరంలోనే దాదాపు మూడు లక్షల మందికి పైగా ఈ వరద వల్ల నిరాశ్రయులయ్యారు. ఇంకా గుంటూరు జిల్లాలోని లంకల్లోను, ఇతర ప్రాంతాల్లోను కూడా చాలామంది ఇబ్బంది పడ్డారు. నిజానికి విజయవాడ నగరం వరద ప్రభావానికి గురికావడం అన్నది ప్రస్తుత తరంలో దాదాపు ఎవ్వరూ చూడని పరిస్థితి. ఎప్పుడు చూసినా బెజవాడ అంటే బ్లేజ్‌వాడ అనేమాటే వినిపిస్తుంది. విపరీతమైన ఎండలు, ఉక్కపోతకు పెట్టింది పేరా నగరం. అర్ధరాత్రి సమయంలో కూడా వడగాలులు వీచే పరిస్థితి ఆ నగరంలోనే చూస్తాం. అలాంటిది బుడమేరు డ్రెయిన్ పొంగి పొర్లడం అక్కడ పెనుముప్పును తీసుకొచ్చింది. మహా అయితే 5-10 లక్షల క్యూసెక్కుల ప్రవాహాన్ని మాత్రమే తట్టుకోగలిగే ఆ డ్రెయిన్‌లోకి ఏకంగా 45 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఎగువనుంచి వచ్చిపడేసరికి అది కాస్తా ఆ నగరాన్ని ముంచెత్తింది. లక్షలాది మంది ప్రజల భవితను ప్రశ్నార్థకం చేసింది.
వరదలు ఎప్పుడు, ఎక్కడ వచ్చినా అది ఒకరకంగా చెప్పాలంటే మానవ తప్పిదమే. అభివృద్ధి పేరుతో అడ్డదిడ్డంగా చేపట్టే పనులు, జలవనరులను అడ్డదిడ్డంగా ఆక్రమించి చేసే భారీ నిర్మాణాలు ఇందుకు ప్రధాన కారణం. సాధారణంగా ఎంత పెద్ద వర్షం పడినా, ఆ నీరంతా ఒక పద్ధతి ప్రకారం వాగులు, చెరువులు, నదుల్లో కలిసిపోతుంది. అందుకు తగిన ఏర్పాట్లు ప్రకృతిసిద్ధంగానే ఉంటాయి. కానీ, అలాంటి మార్గాలన్నింటినీ కబ్జాకోరులు చెరపట్టడం వల్ల నీరు ప్రవహించే మార్గానికి అడ్డంకులు ఏర్పడి, ఆ నీరు వెనక్కి ఎగదన్నుతుంది. అదే సమయంలో పైనుంచి ప్రవాహం ఆగకపోవడంతో ఇదంతా కలిసి వరదగా మారుతుంది. ఆ వరద ధాటికి పెద్ద పెద్ద వంతెనలు కూడా పేకమేడల్లా కుప్పకూలిపోతున్నాయి. చెరువులు, కుంటలు, ఏర్లు, వాగులు, నాలాలను కబళించి, ఆయా ప్రాంతాల్లో కాలనీలకు కాలనీలే కట్టేశారు. ఇలాంటి వరద ప్రవాహ ప్రాంతాల్లో… ఎవరు అధికారంలో ఉంటే ఆయా నాయకుల పేర్లమీద పెద్ద పెద్ద కాలనీలు వెలిశాయి. స్థానిక నాయకులు డబ్బులు దండుకోవడమో.. లేదా ఓట్ల వేటతోనో కొందరిని ఆయా కాలనీల్లో స్థిరనివాసాలు ఏర్పరుచుకునేలా చేసింది. మరికొన్ని ప్రాంతాల్లో అయితే బిల్డర్లు ఏకంగా చెరువులను పూడ్చేసి అక్కడ పెద్ద పెద్ద అపార్టుమెంట్లు కట్టేశారు. హైదరాబాద్ నిజాంపేటలోని బండారి లేఔట్ వ్యవహారం కూడా అలాంటిదే అన్న విషయం పాఠకులకు గుర్తుండే ఉంటుంది.
ఖమ్మంలోని లకారం చెరువు చుట్టూ ఆనకట్ట కట్టి.. దాన్ని అందంగా తయారుచేశారు. కానీ, బల్లేపల్లి నుంచి న్యూ విజన్ స్కూల్ మీదుగా లకారం చెరువు (Lakaram Cheruvu) అలుగు నుంచి దిగువకు వెళ్లాల్సిన వరద నీరు.. లకారం చెరువు చుట్టూ వాక్ వే నిర్మించడం వల్ల వెనక్కి పోటెత్తింది. ఫలితంగా అనేక కాలనీలు మునిగిపోయాయి. లకారం చెరువు చుట్టూ కట్టడాలు కట్టడం, పైనుంచి వచ్చే వరదనీరు వెళ్లడానికి ఉన్న కాలువ చిన్నగా ఉండడంతో ప్రజలకు తిప్పలు తప్పలేదు. మున్నేరు వరద బారి నుంచి కోలుకోవడానికి ఖమ్మం ప్రాంతీయులకు చాలా సమయమే పడుతుంది. అలాగే విజయవాడలోని బుడమేరు డ్రెయిన్ నిర్వహణ పనులు కూడా గత కొన్ని దశాబ్దాలుగా ఎవరూ పట్టించుకోని దీన స్థితి. వరుసగా వస్తున్న పాలకుల్లో ఎవరి దృష్టీ దానిమీదకు వెళ్లనే లేదు. అంతా సక్రమంగానే సాగిపోతోందనుకున్నప్పుడు దాని మరమ్మతు పనుల మీద డబ్బులు వెచ్చించాలన్న ఆలోచన ఎవరికి వస్తుంది? నిజానికి గతంలో సాగునీటి సంఘాలు, డిస్ట్రిబ్యూటరీ కమిటీల లాంటివి ఉన్నప్పుడు వాటికి నీటితీరువా రూపంలోను, ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్లతోను కాలువలు, డ్రెయిన్లను ఎప్పటికప్పుడు పూడికతీయడం, అడ్డంకులు తొలగించడం లాంటి పనులు కొంతవరకు చేసుకునేవారు. తర్వాత ఆ వ్యవస్థను పూర్తిగా ఆపేశారు. బుడమేరు పరిస్థితి కూడా అంతే. నిజానికి బుడమేరులో పేరుకుపోతున్న తూడు, ఇతర వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించడం, దాని చుట్టూ ఉన్న ఆక్రమణలను కూల్చేయడం లాంటి పనులు చేపట్టి ఉంటే.. ఇప్పుడు అది అంత ఉగ్రరూపం (Floods in Telugu states) దాల్చేది కాదు. ఈ పాపం అధికారంలో ఉన్న ప్రతి ఒక్కరిదీ అవుతుంది. ఒకళ్ల మీద ఒకళ్లు బురద చల్లుకోవడం ఈ తరుణంలో అనవసరం. అన్నీ ఆ తాను గుడ్డలే అన్నట్లు, తిలాపాపం తలా పిడికెడు అన్నట్లు ఇందులో ప్రతి ఒక్కరికీ వాటా ఉంటుంది.
ఇదంతా ఒక ఎత్తయితే.. వరద వల్ల ఎంతమంది చనిపోయారన్న విషయంలోనూ రాజకీయాలు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ సొంత పత్రిక అయిన సాక్షిలో బుడమేరు వరదల వల్ల 32 మంది ప్రాణాలు కోల్పోయినట్లు రాసుకున్నారు. లెక్కలేనన్ని మరణాలు ఇంకా చాలానే ఉంటాయనీ ఘనంగా చెప్పేశారు. అలాగే తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించినట్లు 16 మందే కాకుండా.. ఇంకా చాలామంది మరణించారన్నది బీఆర్ఎస్, వాళ్ల పత్రిక నమస్తే తెలంగాణల వాదన. నిజానిజాలు ఏంటన్నది నిలకడ మీద తెలుస్తాయి. ఈలోపు మరణాల లెక్కల మీద రాజకీయం చేయడం అధికార, ప్రతిపక్ష నాయకులు ఇద్దరికీ ఏమాత్రం మంచిది కాదు. అలాగే రెండు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు రంగంలోకి దిగి చేపడుతున్న చర్యలన్నీ కళ్లముందు ఎంచక్కా కనపడుతున్నా.. సహాయ కార్యకలాపాల్లో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందనడం పూర్తి బాధ్యతారాహిత్యమే.
నిజానికి ప్రకృతి ప్రకోపించినప్పుడు పార్టీ రాజకీయాలను పూర్తిగా పక్కన పెట్టి.. ప్రజలను ఆదుకోవడం మీదే దృష్టిసారించాలి. కానీ దాన్ని వదిలిపెట్టి చంద్రబాబు నాయుడి ఇంటిని కాపాడుకోవడం కోసమే విజయవాడ నగరం మొత్తాన్ని ముంచేశారని లాజిక్ లేకుండా మాట్లాడడం జగన్ మోహన్ రెడ్డి లాంటి మాజీ ముఖ్యమంత్రులకు సరికాదు. అయితే కొంతలో కొంత ఆయన స్వయంగా నడుంలోతు నీళ్లలో నడుచుకుంటూ వెళ్లి బాధితులను పరామర్శించారు. అధికారంలో ఉండగా రెడ్ కార్పెట్ మీదే వెళ్లి ముంపు ప్రాంతాలు చూశారన్న విమర్శలు ఎదుర్కొన్న జగన్‌లో ఇంత మార్పు రావడానికి కారణం ఎన్నికల ఫలితాలేనన్నది సుస్పష్టం. ఇక తెలంగాణలో ప్రతిపక్ష నాయకుడు, ఏకధాటిగా పదేళ్ల పాటు తెలంగాణను పరిపాలించిన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అసలు కాలు బయటపెడితే ఒట్టు. గతంలోనూ భద్రాచలంలో వరద వచ్చినప్పుడు ముందు వెళ్లకుండా.. గవర్నర్ పర్యటన ఖరారైన తర్వాత ముందు తాను వెళ్లకపోతే ఎవరేమనుకుంటారోనని అప్పుడు వెళ్లారని చెబుతారు. ఇక పార్టీలో నంబర్ 2, కాబోయే ముఖ్యమంత్రిగా విపరీతంగా ప్రచారం చేసుకున్న మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అమెరికా పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. నిజానికి వరద విషయం తెలియగానే తన పర్యటన రద్దుచేసుకుని ఆయన హుటాహుటిన ప్రభావిత ప్రాంతాల్లో తిరగొచ్చు. కానీ ఆ పనిని తన బావ హరీశ్ రావుకు అప్పగించి వదిలేశారు.
ఖమ్మం పర్యటనలో బీఆర్ఎస్ కీలకనేత హరీశ్ రావు కారుపై దాడి జరిగిందని గగ్గోలు పెట్టారు. బాధితులను పరామర్శించి పార్టీ తరఫున సాయం అందించేందుకు వచ్చిన హరీశ్ తదితరులపై కాంగ్రెస్ గూండాలు దాడులు చేశారంటూ బీఆర్ఎస్ దుమ్మెత్తిపోస్తోంది. తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో కొన్ని ఫొటోలు, వీడియోలను ఆ పార్టీ అప్ లోడ్ చేసింది. అయితే, ప్రజల సానుభూతి కోసం తమ పార్టీ వాళ్లతో తామే దాడులు చేయించుకుని ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ వాళ్లపై ఎదురుదాడికి దిగింది. దాంతోపాటు.. హరీశ్ రావు కారుపై కర్రతో దాడిచేసిన దృశ్యాలు, అందులో ఉన్న వ్యక్తులను కాంగ్రెస్ పార్టీ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పంచుకుంది. అందులో దాడికి పాల్పడిన వ్యక్తుల్లో ఒకరు బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారుడే అంటూ ఆ ఫొటోను చూపించింది. ఒక్క ఖమ్మంలోనే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చాలాచోట్ల ఇలా భౌతిక దాడులు కాకపోయినా మాటలతో దాడులు పరస్పరం జరుగుతూనే ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో కూడా తాము చేపట్టిన స్ట్రాటజిక్ నాలా డెవలప్‌మెంట్ ప్రోగ్రాం (SNDP) వల్లనే వరదలు రాలేదని, అలాంటి పనులేవీ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టకపోవడం వల్ల ఖమ్మం మునిగిపోయిందని బీఆర్ఎస్ నేతలు విమర్శించడం ఫక్తు నీచ రాజకీయమే. నిజానికి హైదరాబాద్‌లో చెరువులు, నాలాల కబ్జాల భరతం పట్టేందుకు హైడ్రా పేరుతో ఒక మంచి వ్యవస్థను రేవంత్ రెడ్డి ప్రారంభించారని అన్నివర్గాల వారూ మెచ్చుకుంటున్నారు. మోకిల ప్రాంతంలో నాలుగేసి కోట్ల రూపాయలు పోసి కొన్న విల్లాలు సైతం మునిగిపోయిన ఈ తరుణంలో చెరువులను చెరబట్టకపోతే ఈ దుస్థితి ఉండేది కాదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
సాయానికి కొలతలు ఉంటాయా?
మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండుచేశారు. అది బాగానే ఉంది గానీ, గతంలో వరదలు, వర్షాలు వచ్చినప్పుడు ఎవరైనా మరణిస్తే నాటి టీఆర్ఎస్, ప్రస్తుత బీఆర్ఎస్ అప్పట్లో అధికారంలో ఉండి ఎంత పరిహారం ప్రకటించింది? ప్రకృతివిపత్తుల్లో బాధితులకు ఎంత సాయం అందించాలనేందుకు ఒక లెక్క ఉంటుంది. ఏ ప్రభుత్వం అయినా ఆ నిబంధనల ప్రకారమే నడుచుకుంటుంది. గతంలో మృతులకు రూ.4 లక్షల పరిహారం ఉండేది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాన్ని రూ. 5 లక్షలకు పెంచారు. అయినా ఈ విషయంలో విమర్శలు చేయడం కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే అన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
మృతుల సంఖ్యపై ఎందుకీ గందరగోళం?
బుడమేరు వరద, మొగల్రాజపురం ప్రాంతంలోని సున్నపుబట్టీల వద్ద కొండ చరియలు విరిగిపడడం వల్ల ఇప్పటివరకు 15 మంది మరణించారని తొలుత లెక్కలు వచ్చాయి. తర్వాత 12 మంది మృతదేహాలు ఒకేసారి కనిపించాయి. అదంతా అధికారికంగానే వెల్లడించారు. కానీ, వైఎస్సార్సీపీ మాత్రం తమ సాక్షి పత్రికలో మృతుల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటుందని, దాన్ని దాచిపెడుతున్నారని ఆరోపిస్తోంది. అజిత్‌సింగ్‌నగర్, పాయకాపురం, కండ్రిక లాంటి ప్రాంతాల్లో శవాలు నీళ్లలో కొట్టుకొస్తున్నాయంటూ రాసింది. ఇలాంటి తరుణంలో ఈ తరహా ప్రచారంతో భయం కలిగించడం కూడా సరికాదు. నిజంగా ఎవరైనా చనిపోతే ప్రభుత్వాలు దాచిపెట్టాల్సిన అవసరం లేదు. నేరుగా ప్రకటిస్తాయి కూడా.
జగన్ ఇచ్చింది కోటి.. మీరెంత సార్లూ?
ఆంధ్రప్రదేశ్‌లో వరద బాధితులను ఆదుకునేందుకు తమ పార్టీ తరఫున కోటి రూపాయల విరాళం ఇస్తున్నట్లు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. అది స్వాగతించదగినదే. మరి తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష స్థానంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు ఈ దిశగా ఒక్క అడుగైనా ముందుకు వేస్తున్నారా? ప్రభుత్వాన్ని ఆడుకోవడం మానేసి బాధితులను ఆదుకోవడం గురించి ఆలోచిస్తే అందరికీ మంచిది.