పశ్చిమ బెంగాల్ శాసనసభ ఆమోదించిన అత్యాచార నిరోధక బిల్లు (Aparajita Bill) కొత్త సీసాలో పాత సారా అన్నట్టుగానే ఉంది. మమతా బెనర్జీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బిల్లు మహిళలపై అత్యాచారాలను, దాడులను, హత్యలను నిరోధించడానికి ఉద్దేశించినదే కానీ, ఈ బిల్లులో (Bengal’s Anti Rape Law) కొత్తగా ఒక్క అంశాన్ని కూడా చేర్చకపోవడం విడ్డూరంగా కనిపించింది. అత్యాచారానికి పాల్పడినవారికి జీవిత ఖైదు విధించాలని ఈ బిల్లు సూచించింది. అత్యాచారానికి లేదా సామూహిక అత్యాచారానికి గురైన వ్యక్తి మరణించినా, జీవచ్ఛవంలా మారినా నిందితుడికి ఉరిశిక్ష విధించాలని కూడా ఈ బిల్లు పేర్కొంది. నిజానికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన భారతీయ న్యాయ సంహిత కూడా ఇదే రకమైన శిక్షలను నిర్దేశించింది. భారతీయ న్యాయ సంహిత కన్నా ముందు అమలులో ఉన్న ఐ.పి.సిలో కూడా దాదాపు ఇవే అంశాలున్నాయి. కానీ, ఇవేవీ దేశంలో అత్యాచారాలను నిరోధించలేకపోగా, దేశంలో గంటకు 49 అత్యాచారాలు, లైంగిక దాడులు మాత్రం అడ్డూ ఆపూ లేకుండా సాగిపోతున్నాయి.
వాస్తవానికి మరణ శిక్షల వల్ల ఎప్పుడూ ఏ నేరమూ ఆగలేదు. లైంగిక నేరాలతో సహా ఏ నేరం మీదా ఇవి సమర్థవంతంగా పనిచేయడం జరగలేదు. అత్యాచారాల నిరోధానికి అనేక చట్టాలు అమలులో ఉన్నా, అత్యాచారాలను నిరోధించడమే ఈ చట్టాల ప్రధాన ధ్యేయం అయినా, మహిళ లకు కనీస భద్రత కూడా లభించకపోవడానికి కారణమేమిటనేది ఆలోచించాల్సిన విషయం. అత్యాచారానికి లేదా లైంగిక దాడికి పాల్పడే పక్షంలో తమకు తప్పకుండా శిక్షపడు తుందనే అభి ప్రాయం నేరస్థులకు కలగకపోవడమే అత్యాచారాలు పెరగడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. చట్టాలను సమర్థవంతంగా అమలు చేయకపోవడమే అసలు కారణం తప్ప, ఈ విషయంలో చట్టాలను తప్పుపట్టలేం. చట్టాలు కఠినంగా ఉన్నంత మాత్రాన సరిపోదు. అవి తప్పకుండా అమలు జరుగుతాయని, తమకు తప్పకుండా శిక్ష పడుతుందని ప్రతి ఒక్కరూ భావించగలగాలి.
మహిళల మీద నానాటికీ లైంగిక దాడులు, ఇతర నేరాలు పెరుగుతున్నాయంటే చట్టాల్లోని లోపాలు కారణమని భావించకూడదు. చట్టాలు బలహీనంగా ఉన్నాయని కూడా అర్థం చేసుకో కూడదు. అత్యాచారం కేసుల్లో శిక్షలు పడడమనేది అయిదు శాతం కూడా ఉండడం లేదని రికార్డులు తెలియజేస్తున్నాయి. అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి బెయిల్ గానీ, పెరోల్ గానీ లభించకూడదని, అతి వేగంగా దర్యాప్తు, విచారణ పూర్తి కావాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తాజాగా రూపొందించిన బిల్లు నిర్దేశిస్తోంది. వాస్తవానికి ఈ రాష్ట్రంలో ఈ రెండూ అమలు జరగడం లేదు. పశ్చిమ బెంగాల్ లో ఇదివరకు అమలులో ఉన్న చట్టాలు కూడా ఇటువంటి శిక్షలనే, ఇటువంటి దర్యాప్తులు, విచారణలనే నిర్దేశించడం జరిగింది. అయితే, ఇక్కడ ఒక్క శాతం నిందితు లకు కూడా శిక్షలు పడడం జరగలేదు. నిర్భయ కేసులో కూడా నిందితులకు ఏడేళ్ల విచారణ తర్వాత శిక్షపడడం జరిగింది. అత్యాచారం కేసుల్లో 27 శాతం నిందితుల మీద కూడా విచారణ జరగడం లేదని కేంద్ర ప్రభుత్వ రికార్డులే తెలియజేస్తున్నాయి. అంటే, అత్యాచారం, హత్య వంటి తీవ్రస్థాయి నేరాలకు ఒడిగట్టిన నేరస్థులు సైతం స్వేచ్ఛగా బయట తిరగడం జరుగుతోందన్న మాట.
దేశంలోని అనేక రాష్ట్రాల్లో అత్యాచారాలకు సంబంధించి కఠినాతికఠినమైన చట్టాలు అమలులో ఉన్నాయి. అయితే, ఆ రాష్ట్రాల్లోనే అత్యాచారాల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. వెలుగులోకి వస్తున్న అత్యాచారం కేసులే వేల సంఖ్యలో ఉంటున్నాయి. పరువుపోతుందనో, జీవితం నాశనం అవుతుందనో, పెళ్లి కాదనో బయటకు చెప్పని, చెప్పుకోలేని అత్యాచారాల సంఖ్య ఎంత ఉంటుందో చెప్పలేం. దేశంలో వేళ్లుపాతుకుపోయి ఉన్న పురుషాధిక్య మనస్తత్వం నుంచి ప్రజలు బయట పడితే తప్ప ఈ సమస్య తగ్గే అవకాశం లేదనేది సామాజిక నిపుణుల నిశ్చితాభిప్రాయం. ఇదే దోరణి కారణంగా మహిళలు ఆట వస్తువులుగా, భోగ్య వస్తువుగా పరిగణన పొందుతున్నారు. ఇటువంటి ధోరణి మారడం అవసరం. అంతే తప్ప చట్టాలు, పోలీసులు, న్యాయస్థానాలతో ఇది మారే అవకాశం లేదు. అత్యధిక శాతం మహిళలు చదువుకోవాల్సిన అవసరం ఉంది. పురుషులతో సమానంగా మహిళలు ఉద్యోగాలు చేయాల్సిన అవసరం కూడా ఉంది. కుటుంబ స్థాయిలోనే లైంగిక సమానత్వాన్ని పిల్లల్లో నూరిపోయాల్సిన అగత్యం అంత కన్నా ఎక్కువగా ఉంది. మహిళల భద్రత విషయంలో మమతా బెనర్జీ వంటి ముఖ్యమంత్రులు మరింత బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం కూడా ఉంది.
Bengal’s Aparajita Bill has no miracle to provide women safety: అత్యాచార నిరోధక బిల్లులో కొత్తేముంది?
దీదీ లాంటి వాళ్ల బాధ్యత ఇంతేనా?