వ్యక్తిత్వ విలువలు, సమాజ వికాసాన్ని పెంచే విద్యా విధానం రాష్ట్రంలో రావాల్సిన అవసరం ఉందన్నారు మంత్రి సీతక్క. ప్రస్తుత కాలానికి అనుగుణంగా సెలబస్ ను సవరించాలన్నారు. అప్పుడే మార్పునకు నాందిపడుతుందని చెప్పారు. విద్యా వ్యవస్థలో తీసుకరావాల్సిన సంస్కరణల కోసం ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సచివాలయంలో బుధవారం నాడు భేటీ అయ్యింది.
కమిటి చైర్మన్ మంత్రి శ్రీధర్ బాబు, సభ్యురాలు మంత్రి సీతక్క ఆద్వర్యంలో సాగిన సమావేశంలో విద్యా వ్యవస్థలో తీసుకరావాల్సిన మార్పులపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ..ప్రస్తుత కాలానికి అనుగుణంగా విద్యా విధానంలో మార్పులు చేయాలని సూచించారు. విద్యార్ధులకు మంచి మార్కులతో పాటు మంచి నడవడిక నేర్పేలా మార్పులు జరగాలన్నారు. అమ్మాయిలు, మహిళలు అంటే చిన్న చూపు పొగొట్టేలా, లింగ సమానత్వం సాధించే దిశలో సెలబస్ లో పాఠాలను చేర్చాలన్నారు. తమ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధన్యతనిస్తుందన్నారు. ఇప్పటికే ఉపాధ్యాయ ఖాలీలను భర్తి చేస్తున్నామని, ఏండ్లుగా ఉన్న పదోన్నతుల అంశాన్ని పరిష్కరించామన్నారు. గత ప్రభుత్వం ఎంఈఓలను, డీఈఓలను నియమించకపోవడంతో పర్యవేక్షణ లేకుండా పోయిందన్నారు. పర్యవేక్షణ అధికారులను నియమించి నిరంతరం పర్యవేక్షణ కొనసాగే చర్యలు తీసుకుంటామన్నారు. బీటెక్, ఎంటెక్ ఫీజులకన్నా కేజీ చిన్నారుల ఫీజులు కొన్ని పాఠశాలల్లో అధికంగా ఉన్నాయని, ఫీజులను నియంత్రించేలా నిబంధనలు రూపొందిస్తామన్నారు. విద్యా వ్యవస్థను మెరుగుదల కోసం ఇంటిగ్రేటెట్ పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అత్యాధునిక ప్రమాణాలతో కూడిన విద్య పేదలకు అందేలా…దేశానికే ఆదర్శంగా నిలిచే సరికొత్త విద్యా విధానం రూపొందిస్తామన్నారు మంత్రి సీతక్క.
క్యాబినెట్ సబ్ కమిటి సమావేశంలో మంత్రులతో పాటు విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యామండలిచైర్మన్ లింబాద్రి, విద్యాశాఖ అదనపు కార్యదర్శి లలిత, డైరెక్టర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ శృతి ఓజా, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గోన్నారు. పాఠశాల నుంచి యునివర్సీటి స్థాయి వరకు విద్యా రంగంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, తేవాల్సిన సంస్కరణలపై ప్రాథమికంగా చర్చించారు.
కోచింగ్ సెంటర్ ల నిర్వహాణ విషయంలో కేంద్ర మార్గదర్శకాలు రాష్ట్రంలో అమలు కాకపోవడం పట్ల కేంద్ర ప్రభుత్వం ఈ మద్య సీరియస్ అయిన నేపథ్యంలో కేంద్ర మార్గదర్శకాలను రాష్ట్రంలో ఖచ్చితంగా అమలు చేయాలని క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. కేంద్ర గైడ్ లైన్స్ పాటించని కోచింగ్ సెంటర్లపై చర్యలు తీసుకోవాలని తీర్మానించింది.
కేంద్రం తెరమీదకు తెచ్చిన నూతన జాతీయ విద్యావిధానాన్ని రాష్ట్రంలో అమలు చేయాలా వద్దా అనే నిర్ణయం తీసుకునేందుకు వీలుగా ఇతర రాష్ట్రాల్లో నూతన జాతీయ విద్యావిధానం అమలు తీరు, సాదక బాధకాలపై నివేదిక అంధించాలని అధికారును మంత్రులు ఆదేశించారు. ఉద్యోగ అవకాశాలు మెరుగు పనిచేలా ఐటీఐ లను ఏటీసీలు గా ఆదునీకరించినట్లుగా నే, పాలిటెక్నిక్ కళశాలలను అప్ గ్రేడ్ చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఇంటర్ కాలేజీ నుంచి యునివర్సీటి వరకు అన్ని స్థాయిలో లెక్చరర్ల నియామకం కోసం కాలేజీ సర్వీస్ కమీషన్ ఏర్పాటు చేసే అంశంపై చర్చించారు. డిగ్రి విద్యార్దుల నైపుణ్యాన్ని పెంచేలా…పాలిటెక్నిక్ కాలేజీల మాదిరిగా ఇంటర్న్ షిప్ ను చేర్చే అంశాన్ని పరిశీలించారు.
వీటితోపాటు విద్యా రంగంలో తేవాల్సిన సంస్కరణలపై రెండు గంటలకు పైగా చర్చించారు. మరిన్ని సమావేశాలు జరిపి..వీలైనంత త్వరగా ప్రస్తుత కాలానికి సరిపడే విద్యా విధానాన్ని రూపొందించనుంది ప్రభుత్వం.