“ఇవ్వడంలో లభించే ఆనందం, పొందడంలో లేదు” అన్న విషయం జగమెరిగిన సత్యమైనప్పటికీ నేటి సమాజంలో ఎంతో మంది సంపన్నులు సైతం ఆ అనుభూతిని సొంతం చేసుకోలేకపోవడం మనకు తెలియంది కాదు. అయితే ఆ అనుభూతిని సొంతం చేసుకోవడానికి సంపన్నులే కానవసరం లేదు, సంకల్పబలం ఉంటే సామాన్యులకు సైతం అది సాధ్యమే అని ప్రయోగాత్మకంగా నిరూపించారు మధ్యప్రదేశ్, ఇండోర్ లోని మధ్య తరగతి కుటుంబానికి చెందిన బాలీవుడ్ గాయని పలక్ ముచ్చల్. గేయ రచయిత కూడా అయిన ఆమె తన గాత్ర మాధుర్యంతో కొడిగడుతున్న మూడు వేలకు పైగా చిన్నారి గుండెలను ఆదుకుని వారికి పునర్జన్మ ప్రసాదించారు. 11 జూన్ 2024న ఇండోర్ కు చెందిన ఎనిమిదేళ్ల బాలుడు అలోక్ సాహూ గుండె శస్త్ర చికిత్స కోసం ఆర్ధిక సహాయాన్ని అందించడం ద్వారా పలక్ ముచ్చల్ 3000వ చిన్నారి గుండెను కాపాడిన వ్యక్తిగా అరుదైన మైలురాయిని చేరుకొని ‘ఔరా’ అనిపించుకున్నారు.
బాల్యంలోనే దాతృత్వానికి అంకురం:
తన నాల్గవ యేటనే పాడటం ప్రారంభించిన పలక్, 1999లో కార్గిల్ యుద్ధ సైనికుల కోసం ఒక వారం రోజుల పాటు ఇంటింటికీ తిరిగి పాడుతూ నిధులను సేకరించారు. మార్చి 2000 నుండి తన సోదరుడు పలాష్ ముచ్చల్ తో కలిసి గుండె జబ్బులతో బాధపడుతున్న పేద పిల్లల ఆసుపత్రి ఖర్చుల కోసం నిధులను సేకరించడానికి భారతదేశం మరియు విదేశాలలో స్టేజ్ షోలను ప్రదర్శిస్తున్నారు. తన ఏడేళ్ల వయసులో చేపట్టిన ఈ కార్యక్రమం ఇప్పుడు తన జీవితంలో అతిపెద్ద మిషన్ అని అనడం, అభాగ్యులైన చిన్నారి హృద్రోగుల పట్ల ఆమెకు గల దాతృత్వానికి నిదర్శనం. తనకు సినిమాల్లో పని లేనప్పుడు, ఒక చిన్నారి గుండె శస్త్ర చికిత్స కోసం విరాళాలు సేకరించడానికి కచేరీలలో మూడు గంటలు పాడతాను, అని ఆమె ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆమె స్వచ్ఛంద సేవలను భారత ప్రభుత్వంతో పాటు ఇతర ప్రభుత్వ సంస్థలు గుర్తించి వివిధ అవార్డులతో సత్కరించాయి. 2006 చివరలో ముంబైకి చేరుకున్న ముచ్చల్ 2011లో విడుదలైన ‘దమాదమ్’ చిత్రం కోసం టైటిల్ సాంగ్ పాడడం ద్వారా బాలీవుడ్ ప్లేబ్యాక్ సింగింగ్‌లోకి అడుగుపెట్టారు. ఇప్పటికీ ఇంకా తన వద్ద ఆర్ధిక సహాయం కోసం ఎదురుచూస్తున్న 413 మంది పిల్లల జాబితా ఉందని, ప్రతి కచేరీ ద్వారా నేను సంపాదించే సొమ్మును తమ పిల్లల గుండె శస్త్రచికిత్సల కోసం ఆర్ధిక స్థోమత లేక ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్న తల్లితండ్రులకు అందిస్తున్నాను అని ముచ్చల్ అన్నారు. ఎదుగుతున్న వయసుతో ఇది తనకు బాధ్యతగా అనిపిస్తుందని, ఈ మహత్కార్యాన్ని చేయడానికి దేవుడు తనను ఒక మాధ్యమంగా ఎంచుకున్నందుకు నిజంగా సంతోషిస్తున్నానని అన్నారు.
ప్రేరణ:
ఆమె తన ప్రస్థానాన్ని మననం చూసుకుంటూ “నేను చిన్నతనంలో పాడటం ప్రారంభించిన వెంటనే చిన్నారి హృదయాలను రక్షించే నా మిషన్‌కు శ్రీకారం చుట్టాను. నేను దర్జాగా అందమైన దుస్తుల్లో సంచరిస్తుండగా, చలికాలంలో సరైన ఆచ్చాదన లేక చలికి గజగజ వణుకుతూ ఫుట్‌పాత్‌ల కింద కూర్చునే లేదా తాను ప్రయాణించే రైళ్లలో ఏదైనా శుభ్రపరిచే పని చేస్తూ డబ్బు అడిగే పిల్లలను చూసినప్పుడు నాకు అపరాధ భావన కలిగేది” అని ఆమె అంటారు. ఈ భావనే తనకు అభాగ్యులైన చిన్నారుల కోసం ఏదైనా చేయాలనే ప్రేరణ కలిగించిందని ఆమె తెలిపారు. 1999లో జరిగిన కార్గిల్ యుద్ధం సందర్భంగా సైనికుల కోసం నిధులు సేకరించడానికి తన మొదటి మిషన్ ప్రారంభించానని, అప్పుడు ఒక వారం రోజుల పాటు తాను షాపింగ్ చేయడానికి వెళ్ళే ప్రతి దుకాణంలో సైనికుల త్యాగాలను కళ్ళకు కట్టే విధంగా సుమధుర గాయని లతా మంగేష్కర్ ఆలాపించిన “ఏ మేరే వతన్ కే లోగో జర ఆంఖ్ మే భర్ లో పానీ జో షహీద్ హుయే హై ఉన్ కీ జర యాద్ కరో కుర్బానీ” పాట పాడి విరాళాలను సేకరించానని తెలిపారు. గుండె శస్త్రచికిత్స సహాయార్థం తమ వద్దకు వచ్చిన మొదటి పిల్లవాడి కోసం తన సోదరుడు పలాష్ మరియు తాను రోడ్లపై పాడామని అప్పటి నుండి తాను చేసిన ప్రతి కచేరీ గుండె శస్త్రచికిత్సలను సులభతరం చేయడానికి అంకితం చేయబడిందని పలక్ అంటారు. మొదట్లో ప్రతి ఒక్క చిన్నారి గుండె శస్త్రచికిత్స కోసం తాను మూడు గంటల పాటు కచేరీ చేయాల్సి వచ్చేదని “ఉడ్ జా కాలే కవ్వా”, “దేఖా హజారో దఫా”, “ఏక్ ములాఖాత్”, “తేరీ మేరీ కహానీ”, “నయా ప్యార్ నయా ఎహ్సాస్” లాంటి పాటలతో శ్రోతల మది దోచుకోవడంతో, తన పాటలకు ప్రజాదరణ పెరిగి తన పారితోషికం కూడా పెరిగిందని, ఇప్పుడు ప్రతి ఒక్క కచేరీ ద్వారా 13 నుండి 14 మంది చిన్నారి గుండెల శస్త్రచికిత్సల కోసం డబ్బు ఆర్జించగలుగుతున్నానని ఆమె తెలిపారు. తన ఈ ప్రయాణం ద్వారా తాను సమాజంలో మార్పు తెచ్చేందుకు కృషి చేస్తున్నానని అన్నారు.
బాలీవుడ్ ప్రయాణం:
బహుముఖ సామర్థ్యాలతో తనకంటూ ఒక ప్రత్యేకతను సృష్టించుకుంటున్న పలక్ 2010లో టెలివిజన్‌లో కూడా తళుక్కుమంది. అంతేకాదు అభిషేక్ బచ్చన్ మరియు దీపికా పడుకొణె సరసన యాక్షన్-డ్రామా చిత్రం “ఖేలే హమ్ జీ జాన్ సే”లో సహాయక పాత్రలో చలనచిత్ర ప్రవేశం కూడా చేసింది. అప్పటి నుంచి ఆమె ఏ టీవీ షోలోనూ కనిపించలేదు. కానీ, ఆమె గతంలో “ది వాయిస్ ఇండియా కిడ్స్” వంటి సంగీత పోటీలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. బాలీవుడ్‌లో గాయకురాలిగా తన కెరీర్‌ను కొనసాగించేందుకు 2006లో ఇండోర్ నుండి ముంబైకి మకాం మారిన ఆమెకు చిన్నప్పటి నుండి నేపధ్య గాయని (ప్లేబ్యాక్ సింగర్) కావాలనే బలమైన కోరిక ఉంది. ఆమె బాల్యం మరియు కౌమారదశలోనే ఆరు సినిమాయేతర రికార్డులను విడుదల చేసింది. 2001లో తన తొమ్మిదేళ్ల వయసులో టిప్స్ మ్యూజిక్ ద్వారా తన మొదటి ఆల్బమ్ “చైల్డ్ ఫర్ చిల్డ్రన్”ని విడుదల చేసింది. ఆమె రెండవ ఆల్బమ్, ‘పల్కే’ 2003లో ఆ తరువాత “దిల్ కే లియే” మరియు “ఆవో తుమ్హే చాంద్ పర్ లే జాయే” లాంటి మరిన్ని పాటలను ఈ పద్ధతిలో విడుదల చేసింది. 2011లో, టి-సిరీస్ ఆమె మతపరమైన భక్తి పాటల రికార్డ్ “జై జై దేవ్ గణేష్” విడుదల చేసింది. 2011లో విడుదలైన ‘దమాదమ్’ చిత్రంలో తన మొదటి బాలీవుడ్ పాటను పాడిన ఆమె అదే సంవత్సరంలో, “నా జానే కబ్సే” చిత్రం కోసం తన రెండవ పాట “ప్యార్ కే సిల్సిలే” పాడింది. సల్మాన్ ఖాన్ పలక్ పేరును ‘వీర్’ చిత్రానికి సంగీత స్వరకర్తలైన సాజిద్-వాజిద్ తో పాటు యష్ రాజ్ ప్రొడక్షన్స్‌కి కూడా ప్రతిపాదించారు. 2012 హిట్ చిత్రం “ఏక్ థా టైగర్”లో ‘లాపతా’ పాట ఆ సంవత్సపు హిట్స్లో ఒకటి కావడంతో ఆమె హిందీ సంగీత పరిశ్రమకు పరిచయం అయ్యింది. హిందీ సంగీత పరిశ్రమలోకి అధికారికంగా ప్రవేశించిన తర్వాత ఆమె హిమేష్ రేషమ్మియా స్వరపరిచిన వివిధ పాటలను పాడింది. ఆమె 2014లో రేషమ్మియా యొక్క కంపోజిషన్ “జుమ్మే కీ రాత్”లో మికా సింగ్‌తో కలిసి పని చేయగా అది ఆ సంవత్సరపు అతిపెద్ద హిట్‌గా నిలిచింది. తదనంతరం ఆమె సల్మాన్ ఖాన్ తన గాత్రాన్ని అందించిన పాట యొక్క మరొక వెర్షన్ పాడింది. ఆమె 2015లో సల్మాన్ ఖాన్ యొక్క అత్యంత ప్రజాదరణ చిత్రం “ప్రేమ్ రతన్ ధన్ పాయో”లో ప్రధాన గాయకురాలిగా తన గాత్రాన్నందించింది. 2016లో ఆమె ఎం ఎస్ ధోనీ చిత్రానికి అమల్ మల్లిక్ స్వరపరిచిన “కౌన్ తుజే” పాడి ప్రేక్షకులను అలరించింది. ఆమె ఇప్పటివరకు పాడిన అత్యధిక పాటలలో అత్యధిక భాగం హిమేష్ రేషమ్మియా, గంగూలీ, మిథూన్ మరియు అమల్ మల్లిక్ లు స్వరపరచినవే. 2018లో ఆమె పాడిన ఏకైక కన్నడ పాట “ఏనమ్మీ ఏనమ్మీ” అత్యంత ప్రజాదరణ పొందింది. సల్మాన్ ఖాన్ తన పేరును ప్రతిపాదించకపోయి ఉంటే హిందీ సంగీత పరిశ్రమలో ప్లేబ్యాక్ సింగర్‌గా తనకు ఇంత పేరు వచ్చి ఉండేదికాదని ఆమె భావిస్తుంది.
భగవద్కృప ద్వారా తనకు సిద్ధించిన ప్రతిభను కేవలం ధనార్జన కోసం మాత్రమే కాకుండా, జనవరి 20, 1961 అతి పిన్న వయసులో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జాన్ ఎఫ్ కెన్నెడీ దేశ ప్రజలను ఉద్దేశించి సంబోధిస్తూ చేసిన వ్యాఖ్య “Ask not what your country can do for you – ask what you can do for your country (దేశం నాకు ఏమిచ్చింది అని కాకుండా దేశానికి నేనేమివ్వగలను” అన్నట్లు అభాగ్యులైన చిన్నారి బాలల హృద్రోగ శస్త్రచికిత్స కోసం ఎంతో ఆర్తితో కృషి చేస్తున్న “పలక్ ముచ్చల్” అత్యంత అభినందనీయురాలు. ఆమెను స్ఫూర్తిగా తీసుకుని సమాజంలోని ప్రతి వ్యక్తి తమ పరిధిలో చేతనైనంత సహాయం చేసేందుకు ముందుకు వస్తే ఈ జగమంతా ఆనందనిలయమవుతుంది.
యేచన్ చంద్ర శేఖర్
మాజీ రాష్ట్ర కార్యదర్శి
ది భారత్ స్కౌట్స్ & గైడ్స్, తెలంగాణ
హైదరాబాద్
✆ 8885050822