Monday, September 23, 2024
Homeఓపన్ పేజ్Tirumala Laddu prasadam controversy: లడ్డూ చుట్టూ కొవ్వు రాజకీయం

Tirumala Laddu prasadam controversy: లడ్డూ చుట్టూ కొవ్వు రాజకీయం

అక్కడ లడ్డూ ఇక్కడ విగ్రహం..

తెలుగు రాష్ట్రాల రాజకీయాలు చూస్తే ఎత్తెత్తి ఎంగిలాకులో కాలు వేసినట్లు కనిపిస్తున్నాయి. అత్యంత జాగ్రత్తగా అవతలివాళ్లని బద్నాం చేయాలని ప్రయత్నిస్తూ అదే సమయంలో ఘోరమైన తప్పులు చేసేస్తున్నారు. వాటి ఫలితాలు ఎలా ఉంటాయి, సామాన్య ప్రజల మీద వాటి ప్రభావం ఎలా ఉంటుందన్న విషయాన్ని కూడా ఏమాత్రం పట్టించుకోకుండా తమ ఎజెండాను ఎంచక్కా ప్రజల మీద రుద్దేయడానికి ప్రయత్నిస్తున్నారు. దానికి ఎప్పుడూ మద్దతుగా ఉండే మీడియా కూడా తోడు ఉండడం ఆయా పార్టీలకు కలిసొస్తోంది.

- Advertisement -


తిరుమల అనేది కలియుగ వైకుంఠం. అది ఆనంద నిలయం. దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు అనునిత్యం మనసా వాచా కర్మణా ఆ కలియుగ ప్రత్యక్ష దైవం అయిన దేవదేవుడు శ్రీ వేంకటేశ్వరుడిని కొలుస్తుంటారు. జీవితంలో వీలైన ప్రతిసారీ తిరుమలకు వెళ్లి ఆ స్వామి ప్రతిరూపాన్ని రెండు కళ్ల నిండా నింపుకొని భక్తి పారవశ్యంలో మునిగిపోతారు. స్వామివారి లడ్డూ అంటే అత్యంత పరమ పవిత్రంగా భావిస్తారు. కానీ, 40 ఇయర్స్‌ ఇండస్ట్రీ అని, సైబరాబాద్‌ను తానే నిర్మించానని, హైదరాబాద్‌ పునర్నిర్మాణం ఘనత అంతా తనదేనని గట్టిగా చెప్పుకొనే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యంత బాధ్యతారహితంగా తిరుమల లడ్డూలో వినియోగించే నెయ్యిలో పందికొవ్వు, గొడ్డుకొవ్వు, చేపనూనె లాంటివి కలిపారంటూ వ్యాఖ్యానించారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసింది.
తిరుమల ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు.. అందులోనూ పందికొవ్వు, గొడ్డు కొవ్వు, చేపనూనె లాంటివి ఉన్నాయంటూ నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డుకు చెందిన కాఫ్‌ సంస్థ ఓ నివేదిక ఇచ్చిందని తెలుగుదేశం పార్టీలో తనను తాను ప్రముఖ నాయకుడిగా భావించుకునే ఆనం వెంకట రమణారెడ్డి ఓ నివేదిక బయటపెట్టారు. అంతకు ముందురోజు తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్డీయే శాసనసభా పక్షం సమావేశంలో మాట్లాడిన ఒక బాధ్యతారహితమైన మాటను పట్టుకుని, దానికి బలం చేకూర్చడానికి అన్నట్లుగా ఆయన ఈ నివేదికను చూపిస్తూ విలేఖరులతో మాట్లాడారు.

ఎన్‌డీడీబీ కాఫ్‌ అనే సంస్థ ఒక నివేదిక ఇచ్చిన మాట వాస్తవమే. కానీ, అందులో ఏముందన్న దాన్ని ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు అన్వయించుకుంటున్నారు. నివేదికను ఆసాంతం చూసినప్పుడు మాత్రం అందులో యద్భావం తద్భవతి అన్నట్లు కనిపిస్తోంది. ఎన్‌డీడీబీ నివేదికను విశ్లేషించి, అందులో జంతువుల కొవ్వు గురించిన ప్రస్తావన ఏమైనా ఉందా అని ఒక ప్రఖ్యాత ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ టూల్‌ను అడిగినప్పుడు… అందులో డీటైల్డ్‌ ఫ్యాటీ యాసిడ్‌ ప్రొఫైల్‌ ఉందని, కానీ అందులో ఎక్కడా ప్రత్యేకంగా నిర్దిష్ట జంతువుల కొవ్వు గానీ, చేప నూనె గానీ ఆ శాంపిళ్ళలో ఉన్నట్లు రాయలేదని తేల్చి చెప్పేసింది. అయితే, కొన్ని రకాల ఫ్యాటీ యాసిడ్లను పరీక్షించినప్పుడు వాటి ఆధారంగా చూసినప్పుడు మాత్రం.. సాధారణంగా జంతువులు లేదా చేప ఉత్పత్తులలో కనిపించేలాంటి కొన్ని కొవ్వులు మాత్రం దాంట్లో ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చు అని స్పష్టం చేసింది. ఈ పరీక్ష ఫలితాలు బట్టి, ఆవు నెయ్యిలో కల్తీ అనేది గమనించదగిన అంశమని, నెయ్యి తయారీలో కృత్రిమ రసాయనాలు కలిపే అవకాశాలు ఉన్నాయని అది తెలిపింది. ముఖ్యంగా, కొన్ని రసాయనాలు అవసరానికి మించి ఉండటం, ఇతర రసాయనాల అనుపస్థితి కల్తీ ఉన్నట్లుగా నిర్ధారిస్తుందని కుండ బద్దలు కొట్టింది.
ఒకవేళ పత్తినూనె, పామాయిల్‌ లాంటివి ఆవులకు పెట్టే మేతలో కలిసి ఉంటే ఫలితాలు కొంత విభిన్నంగా వచ్చే అవకాశం ఉందని కూడా ఎన్‌డీడీబీ కాఫ్‌ సంస్థ ఇచ్చిన ఆరు పేజీల నివేదికలో చిట్టచివరి భాగంలో స్పష్టం చేశారు. ఇవన్నీ ఉన్నప్పటికీ, కొన్ని కొన్ని పారామీటర్ల ప్రకారం.. అంటే ఎస్‌ విలువ ఎంత ఉందన్నదాన్ని బట్టి ఏవేం కల్తీలు జరిగి ఉండడానికి అవకాశం ఉందని పేర్కొన్నారో.. అవన్నీ ఉన్నట్లు గానే ప్రచారం చేసేశారు.


ఇక్కడ కల్తీ ఎవరు చేశారు, ఎవరు చేయించారన్న విషయం కంటే ప్రధానమైనది.. భక్తుల మనోభావాలు. తిరుమల పుణ్యక్షేత్రానికి దేశవ్యాప్తంగా, ఇంకా గట్టిగా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. రోజుకు దాదాపు లక్ష మందికి పైగా సందర్శించుకునే పరమ పవిత్ర క్షేత్రమది. అందులోనూ అక్కడి ప్రసాదం అంటే ఇంటికి తీసుకొచ్చి, చుట్టుపక్కల ఉన్న ఎంతమందికి పంచితే అంత పుణ్యమని కూడా భావిస్తారు. అలాంటిది తిరుమల ప్రసాదంలో ఉపయోగించే నెయ్యిలో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు ఉన్నాయంటూ ప్రచారం చేసేస్తే.. దానివల్ల రాజకీయ ప్రయోజనం చేకూరడం మాటేమో గానీ, ఒక్కసారిగా తిరుమలకు భక్తుల రాక తగ్గిపోవడం ఖాయం. ఒకవేళ వచ్చినా, దేవుడికి దండం పెట్టుకుని వెళ్లిపోతారే తప్ప కొన్నాళ్ల పాటు లడ్డూ ప్రసాదం గానీ, అక్కడ తయారు చేసే ఇతర ప్రసాదాలు గానీ ఉచితంగా ఇచ్చినా తీసుకోవడానికి ఇష్టపడరు. ఇప్పుడు తాము అంతా ప్రక్షాళన చేసేశామని, అందువల్ల ఇప్పుడు అంతా పరమ పవిత్రంగానే ఉందని చెప్పినా, భక్తకోటిలో అనుమానాలు మాత్రం అలాగే ఉండిపోతాయి. అందువల్ల ప్రసాదం తీసుకోవడానికి సుతరామూ ఇష్టపడరు.
తనను తాను 40 ఏళ్ల అపార అనుభవం ఉందని చెప్పుకొనే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఇలాంటి ఒక మాట చెప్పడానికి ముందు ఏమాత్రం ఎందుకు ఆలోచించలేదు? సిపాయిల తిరుగుబాటు లాంటి విషయాలు ఆయన మనసులోకి కూడా రాలేదా? నిజానికి నా పాతికేళ్ల జర్నలిజం అనుభవంలో మత ఘర్షణల లాంటివి చాలా సందర్భాల్లో చూశాను. అలాంటివి ఏమైనా జరిగినప్పుడు, లేదా రెండు మతాల మధ్య గొడవలు జరిగినప్పుడు కూడా రెండు వర్గాలు అని అత్యంత జాగ్రత్తగా మాకు మేమే స్వీయ నియంత్రణ విధించుకుని రాస్తామే తప్ప.. అస్సలు ఎక్కడా ఎవరు ఎవరన్న విషయాలు బయటపడేలా ప్రవర్తించం. ఒక సాధారణ జర్నలిస్టే ఇలా, ఇంత జాగ్రత్తగా పదాలు ఉపయోగించాలని, లేకపోతే ఘర్షణలు మరింత ప్రబలుతాయని అప్రమత్తంగా ఉంటున్నప్పుడు.. బాధ్యతాయుతమైన ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి, ఇలాంటి విషయాలు ఎలా బయటపెడతారు? ఒకవేళ నిజంగానే అలాంటి విషయం ఏమైనా జరిగి ఉంటే.. ముందుగా దానిమీద పూర్తిస్థాయిలో విచారణ జరిపించి, దానికి బాధ్యులెవరో తేల్చి, ఆ తర్వాత దాని గురించి మాట్లాడాలి. అంతేగానీ, తనకు జులై నెలాఖరులో నివేదిక వచ్చిందంటూ ఆ విషయాన్ని సెప్టెంబరు నెలలో బయటపెట్టడం ఏంటి? తెలుగు రాష్ట్రాల్లో అందులోనూ తెలుగు పత్రికల్లో అత్యధిక సర్క్యూలేషన్‌ ఉండి బాబు కోసం కొంచెం వకాల్తా పుచ్చుకుంటుందని కొంతమేర ప్రచారం జరిగే ఈనాడు లాంటి పత్రిక కూడా సంయమనం పాటించి లడ్డుపై బాబు చేసిన కామెంట్‌ని తొలిరోజు ప్రచురించనే లేదు. ఆ తర్వాత మిగతా మీడియా వారు దీన్ని రాద్ధాంతం చేస్తున్న క్రమంలోనే తప్పనిసరి పరిస్థితుల్లో వారు వార్తను ప్రచురిస్తున్నట్లు అర్థం అవుతోంది.
ఒకవేళ నిజంగానే విచారణలో ఆ నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని నిర్ధారణ అయితే మాత్రం అలా చేసిన వాళ్లను శంకరగిరి మాన్యాలు పట్టించడానికి జనం ఏమాత్రం వెనకాడరు. నిజానికి జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే అంతర్వేదిలో రథం కాలిపోవడం, రామతీర్థంలో రాముడి విగ్రహం శిరస్సు విరిగిపోయి పడిపోవడం లాంటి అనర్థాలు జరిగాయి. స్వతహాగా జగన్‌ క్రిస్టియన్‌ మతస్థుడు కావడం, తిరుమల సహా ఏ ఆలయానికి అధికారిక లాంఛనాలతో స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించాలన్నా సతీసమేతంగా ఒక్కరోజు కూడా వెళ్లపోవడం, పాస్టర్లకు ప్రోత్సాహకాలు కల్పించడం, కొన్ని దేవాలయాల్లో కూడా అన్యమతస్థులను ఉద్యోగులుగా నియమించడం లాంటి ఘటనలు మనం చూశాం. అంతమాత్రాన తిరుమల ప్రసాదాన్ని అపవిత్రం చేయాలన్నంత దురుద్దేశం ఉంటుందని మాత్రం ఊహించలేం. ఒకవేళ అలాంటిది ఉన్నట్లు బయటపడితే, ఇప్పటికే ఆ పార్టీని అథఃపాతాళానికి తొక్కేసిన ప్రజలు, ఇకపై ఏం చేస్తారన్నది ఊహకు కూడా అందనంత దారుణంగా ఉంటుంది.
కానీ, అన్యమతస్థులు అయినంత మాత్రాన ఇలా ప్రసాదం విషయంలో ఏదో చేసేస్తారని ఊహించడం ఏమాత్రం సబబు కాదు. ఎందుకంటే షారుక్‌ ఖాన్‌ లాంటి వాళ్లు కూడా తిరుమల పుణ్యక్షేత్రానికి వచ్చి, అక్కడ దర్శనం చేసుకుని, అంతకుముందే డిక్లరేషన్‌ కూడా ఇచ్చి వెళ్తున్నారు. అలాంటిది ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి తిరుమల లాంటి అత్యంత పుణ్యక్షేత్రాన్ని ఇలా అపవిత్రం చేయాలని భావించారంటే నమ్మశక్యం కాదు.
తిరుమల పుణ్యక్షేత్రం అంటే నాకు వ్యక్తిగతంగా పరమ పవిత్రమైన స్థలం. నేను ఈ ఏడాది జూన్‌ మాసంలో నలుగురు మిత్రులతో తిరుమల వెంకటేశ్వరున్ని దర్శించుకుని లడ్డు తీసుకున్నాను. హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణంలో ఎయిర్‌ ఇండియా విమానంలో ఉన్న ఎయిర్‌ హోస్టస్‌కు కూడా లడ్డుప్రసాదం ఇచ్చాను. ఆమె దాన్ని కళ్లకద్దుకుని అక్కడే తింది. భక్తి పారవశ్యంతో నాకు నమస్కరించి, ఇటీవలి కాలంలో తిరుమల లడ్డు రుచి కొంచం తగ్గినట్టు అనిపించేదని, కానీ ఈ సారి మీరిచ్చిన లడ్డూ తిన్నది మాత్రం అత్యంత అద్భుతంగా ఉందని, తన ఇంట్లో వారికి కూడా తీసుకెళ్తానని స్వయంగా ఆమె నాతో చెప్పింది. ఈ విషయన్ని నా మిత్రులు గమనించారు. ఈ ఘటన జరిగింది జూన్‌ నెలలో. అంటే.. అప్పటికే వీళ్లు చెబుతున్న నెయ్యి కుంభకోణం జరిగి ఉండాలి. మరి ఏమాత్రం సంబంధం లేని ఒక ఎయిర్‌ హోస్టెస్‌ ఆ ప్రసాదాన్ని అంత బాగుందని ఎందుకు చెబుతారు?
ఇలాంటి ఘటనలు నిజంగానే ఏమైనా జరిగి ఉన్నా కూడా ముఖ్యమంత్రి స్థానంలో ఉండే వ్యక్తి అంత బాధ్యతారహితంగా వ్యవహరించకూడదు. నివేదికలను ఆమూలాగ్రం విశ్లేషించుకోవాలి. దానికి బాధ్యులు ఎవరన్న విషయం మీద అత్యంత రహస్యంగా విచారణ చేయించాలి. ఇన్నాళ్ల నుంచి, ఇన్నేళ్ల నుంచి నిజంగానే ఒకవేళ అలాంటి దుర్మార్గాలు ఏమైనా జరుగుతుంటే.. నిత్యం పోటులో పనిచేసే శ్రీవైష్ణవ బ్రాహ్మణులకు ఆ నెయ్యి బాగోలేదన్న విషయం తెలియదా? వాళ్లలో ఒక్కరంటే ఒక్కరైనా ఫిర్యాదు చేయాలని భావించలేదా? ఈ విషయం ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా, స్వతహాగా చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తిగా చంద్రబాబుకు ఎందుకు తెలియలేదు? అంతేకాదు.. నెయ్యి ఖరీదు 410 అని ఒకరు, 460 అని ఒకరు, 320 అని మరొకరు.. ఇలా నోటికొచ్చినట్లు చెబుతున్నారు. అంత తక్కువ ఖరీదుకు నెయ్యి ఇస్తున్నారంటే.. దాంతోపాటు ఎవరెవరికి ఎన్నెన్ని కమీషన్లు ముట్టజెప్పారు? ఈ విషయాలన్నీ కూడా బయటకు వచ్చి తీరాల్సిందే.
ఇక రమణ దీక్షితులు విషయానికి వద్దాం. గత ఐదేళ్లుగా తిరుమల విషయంలో అపచారం జరుగుతోందని ఆయన కొత్త పల్లవి అందుకున్నారు. తాను ఇన్నాళ్లుగా దీని గురించి పోరాటం చేస్తున్నా, మిగిలిన బ్రాహ్మణోత్తములు ఎవరూ తనతో రాలేదని, తనకు మద్దతు పలకలేదని చెబుతున్నారు. ఈ రమణ దీక్షితులు ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రకం. గతంలో ఈయన ప్రధాన అర్చకుడిగా ఉన్నప్పుడు ఒకసారి ఎన్టీఆర్‌ కుమార్తె లోకేశ్వరి తిరుమల దర్శనానికి వచ్చారు. అప్పుడు నేను కూడా అక్కడే ఉన్నాను. ఆమె రమణ దీక్షితులును ఏమాత్రం పట్టించుకోకుండా తన మానాన తాను దర్శనం చేసుకుని వెళ్లిపోయారు. అప్పుడు ఇదే రమణ దీక్షితులు నా దగ్గరే తన గోడు వెళ్లబోసుకున్నారు. జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు, చంద్రబాబు సీఎం కాగానే ఆయనకు భజన చేయడం ఈయనకు బాగా అలవాటు. అలాంటి ఆయన కూడా లడ్డు గురించి మాట్లాడితే నాకైతే ఆశ్చర్యమేస్తోంది. ఆయన లడ్డూల గురించి ఫిర్యాదు చేసినప్పుడు తనకు ఎవరి మద్ధతు లభించలేదని చెప్పడం విడ్డూరం. స్వామికి సేవ చేసే భాగ్యం ఉన్న సదరు వ్యక్తి ఈ విషయాన్ని ఎందుకు ఆనాడే ప్రజలకు బహిరంగంగా చెప్పలేదు? స్వామివారికి జరుగుతున్న ఓ అపరాధం తెలిసి కూడా ఇన్నేళ్లు మౌనంగా ఉండడం అంటే రమణ దీక్షితుల స్వామి భక్తిపై నాలాంటి వారికి అనుమానం కలగకపోదు.
అసలు ఆలయాలు, ముఖ్యంగా తిరుమల, శ్రీశైలం లాంటి ఆలయాల్లో రాజకీయ జోక్యాలను పూర్తిగా నివారించాలి. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తులు, విశ్రాంత ఐఏఎస్‌ అధికారుల లాంటి వారితో ఒక సనాతన ధర్మ పరిరక్షణ బోర్డును ఏర్పాటు చేసి, కేవలం పూర్తి భక్తి ప్రపత్తులతో, సేవా తత్పరతతో పనిచేసేవారినే అందులో నియమించాలి. వారికి ఎలాంటి జీతభత్యాలు ఇవ్వకూడదు. వారంతా కేవలం స్వామివారి మీద భక్తితో ఒక సేవగా మాత్రమే దీన్ని భావించేవారు అయి ఉండాలి. నిజానికి అలాంటివారికి అప్పటికే పింఛన్లు వస్తుంటాయి కాబట్టి, ఇక్కడి నుంచి డబ్బులు ఆశించరు. అలాంటివాళ్ల నేతృత్వంలోనే ఆలయాలను నడిపిస్తే.. అప్పుడు ఇలాంటి అక్రమాలకు తావు అన్నది కనిపించదు. విశ్వ హిందూ పరిషత్‌ కూడా ఇలాంటి డిమాండునే తెరమీదకు తీసుకొచ్చింది.

వైసీపీ ఖాళీనేనా?

గడిచిన ఐదేళ్లలో వైఎస్‌ఆర్‌సీపీని అత్యంత బలోపేతంగా చేసుకున్నారు. సామ దాన భేద దండోపాయాలు ఉపయోగించి స్థానిక సంస్థలన్నింటినీ చేజిక్కించుకున్నారు. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోటల్లా ఉండే నియోజకవర్గాలను సైతం సాధించారు. కానీ, ఒక్కసారి అధికారం చేతులు మారగానే అదంతా గాలి బుడగలా పేలిపోయింది. పెద్ద పెద్ద నాయకుల నుంచి మునిసిపల్‌ ఛైర్మన్లు, కౌన్సిలర్ల వరకు అందరూ చకచకా పార్టీ మారిపోతున్నారు. ఒంగోలులో మంచి నాయకుడిగా పేరున్న బాలినేని శ్రీనివాసరెడ్డి, జగ్గయ్యపేట ప్రాంతానికి చెందిన సామినేని ఉదయభాను ఒకేసారి వెళ్లిపోయారు. నిజానికి బాలినేని విషయంలో ఎన్నికలకు ముందు నుంచే కొంత ఊగిసలాట జరుగుతూ ఉంది. అప్పట్లో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి తాను పార్టీ మారాలని నిర్ణయించుకున్న తర్వాత ముందుగా సంప్రదించింది కూడా బాలినేని శ్రీనివాసరెడ్డినే. ఆయన జగన్‌కు సమీప బంధువు కూడా కావడం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో గణనీయమైన ప్రభావం చూపించే సత్తా ఉండడంతో అప్పుడే బాలినేనిని తనతో పాటు తీసుకెళ్లాలని విశ్వప్రయత్నం చేశారు. కానీ అప్పటికి ఇంకా ఏమీ నిర్ణయించుకోలేని పరిస్థితుల్లో ఉండడంతో బాలినేని అప్పుడు బయటకు వెళ్లలేదు. కానీ, ఇప్పుడు మాత్రం ఇక వైసీపీలో ఉండడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండబోదని నిర్ణయించుకుని, జనసేన పంచన చేరారు.
బాలినేని జనం మనిషి అన్న పేరుంది. ఎంతటి సామాన్యుడైనా నేరుగా ఆయన బెడ్‌ రూంలోకి వెళ్లిపోయి, ఆయనను నిద్ర లేపగలరని ఒంగోలు ప్రాంతంలో చెప్పుకొంటారు. వచ్చిన వాళ్లను కూడా అక్కడే కూర్చోబెట్టి మాట్లాడేంత చనువు ఆయనకు ఉంది. నగరంలో లేదా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఫలానా చోట వెంచర్‌ వేస్తున్నామని చెబితే సాధారణంగా ఇతర ఎమ్మెల్యేలు ఎవరైనా తమకు అందులో ఇన్ని ప్లాట్లు కావాలనో, లేదా మొత్తమ్మీద ఇంత పర్సంటేజి ఇవ్వాలనో ప్రత్యక్షంగానో పరోక్షంగానో తెలియజేస్తారు. కానీ బాలినేని మాత్రం, ఇనాగరేషన్‌ ఎప్పుడో చెబితే వీలు చూసుకుని వస్తానంటారు. అందుకే ఆయనకు ఏ పార్టీలో ఉన్నా ప్రజా బలం మాత్రం అలాగే ఉంటుందన్న టాక్‌ అక్కడ ఉంది. అయితే, ఇటీవలి కాలంలో బాలినేని కుమారుడు, ఆయన వియ్యంకుడు కూడా కొంత అప్రతిష్ఠ మూటగట్టుకున్నారు. రియల్‌ ఎస్టేట్‌ వెంచర్ల నుంచి గ్రానైట్‌ వ్యాపారుల వరకు అందరివద్ద బాలినేని కుమారుడు వసూళ్లకు పాల్పడ్డారన్న అపప్రథ వచ్చింది.
బాలినేనితో పాటు సామినేని ఉదయభాను కూడా తాను సైతం అదే బాటలో వెళ్తానని ప్రకటించేశారు. దీంతో వైఎస్‌ఆర్‌సీపీ పరిస్థితి మునిగిపోతున్న నావలా తయారవుతోంది. నిజానికి నిన్న మొన్నటి వరకు ఉత్తరాంధ్రలో తిరుగులేని నాయకుడిగా ఉన్న బొత్స సత్యనారాయణ కూడా పార్టీ మారుతారన్న ప్రచారం ఉధృతంగానే సాగింది. దాంతో జాగ్రత్త పడిన జగన్‌.. వెంటనే పావులు కదిపి, బొత్సను ఎమ్మెల్సీగా ఎన్నికయ్యేలా చక్రం తిప్పారు. ఆయనకు మండలిలో ప్రతిపక్ష నేతగా కూడా పదవి ఇచ్చారు. తద్వారా ప్రస్తుతానికి బొత్స సత్తిబాబు పార్టీ మారకుండా చూసుకోగలిగారు. దాంతో పాటు తాజాగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీ అధ్యక్షులను కూడా మార్చుకున్నారు. కానీ దీనివల్ల ఏమాత్రం ప్రయోజనం ఉంటుందన్నది అనుమానమే. ఎందుకంటే, గతంలో 2014 ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీకి 67 స్థానాలు వచ్చాయి. అప్పట్లోనే 23 మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ కండువా కప్పేసుకున్నారు. ఇప్పుడు ఈసారి ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీకి వచ్చినవి కేవలం 11 స్థానాలు మాత్రమే. ఓడిపోయిన నాయకులు పార్టీలు మారడం ఎటూ మామూలే. ఇప్పుడు ఉన్న 11 మందినైనా జగన్‌ కాపాడుకోగలరా లేదా అన్నది పెద్ద ప్రశ్నగా మారిపోయింది. దానికితోడు స్థానిక సంస్థల నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులు కూడా పార్టీ మారిపో తుండడంతో క్షేత్రస్థాయిలో వైసీపీ బలం క్రమంగా క్షీణిస్తోంది. 2029 ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయించడానికి కనీసం అభ్యర్థులు దొరుకుతారా.. లేదా అన్నది కూడా ఆ పార్టీ అధినేత, సర్వం సహాధినేత అయిన జగన్‌ చూసుకోవాలి.
విగ్రహాల చుట్టూ తెలంగాణ

ఇక తెలంగాణలో విగ్రహాల రాజకీయం విసుగెత్తిస్తోంది. హైదరాబాద్‌ సచివాలయం ముందు రాజీవ్‌ గాంధీ విగ్రహ ఏర్పాటు విషయం అనేక మలుపులు తిరిగింది. తెలంగాణ తల్లి విగ్రహానికి కేటాయించిన స్థలంలో రాజీవ్‌ విగ్రహం ఏర్పాటు విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి ఏమాత్రం వెనక్కి తగ్గలేదని అంటున్నారు. దీంతో సచివాలయం ముందు రాజీవ్‌ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌ రెడ్డి నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా రాజీవ్‌ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, ఆవిష్కరించడం కూడా చకచకా జరిగిపోయాయి. ఈ నెల 16న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చేతుల మీదుగా రాజీవ్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్‌ ఇంచార్జి దీపా దాస్‌మున్షీ, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాజీవ్‌ గాంధీ అన్న వ్యక్తి మన దేశంలో సంస్కరణలకు ఆద్యుడు. టెక్నాలజీని భారతదేశానికి పరిచయం చేశారు. అమృతసర్‌లోని స్వర్ణదేవాలయంలో ఖలిస్థానీ ఉగ్రవాదులను హతమార్చేందుకు చేపట్టిన ఆపరేషన్‌ బ్లూస్టార్‌ ఫలితంగా తన తల్లి ఇందిరాగాంధీ సిక్కు భద్రతాధికారుల చేతిలోనే కాల్పులకు గురై మరణించినప్పుడు.. అలాంటి సంక్లిష్టమైన పరిస్థితుల్లో దేశ ప్రధానిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత ఎక్కడా సిక్కుల మనోభావాలను దెబ్బతీయకుండా, వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడకుండా తనదైన పద్ధతిలో పరిపాలన సాగించారు. అలాంటి రాజీవ్‌ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనుకోవడం తప్పయితే కాదు కదా.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. మునిసిపల్‌ శాఖ మంత్రిగా కేటీ రామారావు వ్యవహరించారు. దాదాపు పదేళ్ల పాటు ఆ శాఖ మంత్రిగా ఉన్నారు. తాము మళ్లీ అధికారంలోకి వస్తే, సకల లాంఛనాలతో రాజీవ్‌ గాంధీ విగ్రహాన్ని తీసుకెళ్లి గాంధీ భవన్‌ వద్ద పెట్టిస్తామని, ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టిస్తామని ఆయన అన్నారు. అంతవరకు బాగానే ఉందని కాసేపు అనుకుందాం.

ఒక్కసారి చరిత్రలోకి వెళ్దాం. 2009 ప్రాంతంలో నేను జీహెచ్‌ఎంసీ బీట్‌ రిపోర్టర్‌గా ఉండే సమయంలో బండ కార్తీకరెడ్డి హైదరాబాద్‌ నగర మేయర్‌ అయ్యారు. ఆమె మేయర్‌ పదవి చేపట్టడానికి ప్రధాన కారణం.. దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి. ఆయన చలవ వల్లే కార్తీకరెడ్డికి ఆ పదవి దక్కింది. వైఎస్‌ మరణానంతరం ఆయన పట్ల కృతజ్ఞతతో కార్తీకరెడ్డి వైఎస్‌ విగ్రహాన్ని జీహెచ్‌ఎంసీ కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేయించారు. అయితే, అప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండేది. నాటి టీడీపీ ఫ్లోర్‌ లీడర్‌ సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఒక అంబేడ్కర్‌ విగ్రహాన్ని, ఒక గాంధీ విగ్రహాన్ని కూడా తీసుకొచ్చి, వైఎస్‌ విగ్రహం పక్కనే పెట్టించారు. కానీ, వైఎస్‌ విగ్రహం మాత్రం ఒక పీఠం మీద పెద్దగా ఉండగా.. గాంధీ, అంబేడ్కర్‌ విగ్రహాలు దానికి రెండు పక్కలా కింద కాళ్ల దగ్గర ఉన్నట్లు ఉంటాయి. ఆ మూడింటికీ ఇప్పటికీ ముసుగు తీయలేదు. కేటీఆర్‌ మునిసిపల్‌ శాఖ మంత్రిగా దాదాపు దశాబ్దం పాటు ఉన్నారు. ఆ హోదాలో జీహెచ్‌ఎంసీ కార్యాలయానికి కూడా కొన్ని వందల సార్లు వచ్చి ఉంటారు. టీఆర్‌ఎస్‌కు ఫక్తు వ్యతిరేకిగా ఉండి, అసెంబ్లీలోనే ఈటల రాజేందర్‌ను ఉప ఎన్నికల ప్రస్తావన తీసుకొచ్చి దులిపి పారేసిన వ్యక్తి వైఎస్‌ రాజశేఖరరెడ్డి. అంతటి వ్యతిరేకత ఉన్న వైఎస్‌ విగ్రహాన్నే కేటీఆర్‌ ఆ పదేళ్లలో ఒక్క అంగుళం కూడా కదిలించలేదు. అలాంటిది ఈ విషయంలో ఏమాత్రం సంబంధం లేని రాజీవ్‌ గాంధీ విగ్రహాన్ని మాత్రం అక్కడి నుంచి ఎలా కదిలిస్తారు కేటీఆర్‌ గారూ? అంతేకాదు.. టీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నారు. అది తప్పేమీ కాదు. కానీ వాటిలో ఒక్కచోటైనా తెలంగాణ తల్లి విగ్రహం పెట్టుకున్నారా? అక్కడ పెట్టనప్పుడు ఇప్పుడు సరిగ్గా రాజీవ్‌ గాంధీ విగ్రహం పెట్టిన చోటే సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలన్న పంతం ఎందుకు వచ్చింది? పోనీ.. సచివాలయం ప్రాంగణంలో మరోచోట ఎలాగో మన తెలంగాణ తల్లి విగ్రహం పెడుతున్నట్టు రేవంత్‌ ప్రకటించారు కదా.! తెలంగాణ సెంటిమెంట్‌ను రగిలించడానికి మాత్రమే ఇలా మాట్లాడుతున్నారనే విషయం ఇప్పడు అందరికీ అర్థమవుతున్నది అర్థం కానిది మీకు మాత్రమే.

స‌మ‌య‌మంత్రి చంద్ర‌శేఖ‌ర శ‌ర్మ‌

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News