ఊర్కొండ మండలంలో 100 కోట్లతో వివిధ అభివృద్ధి పనులను చేపట్టనున్నామని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి వెల్లడించారు. మండలానికి ఇప్పటికే ఇండోర్ స్టేడియం మంజూరు కాగా ఆర్ అండ్ బి. పంచాయితీ రాజ్ తదితర విభాగాల నుంచి దాదాపు 100 కోట్లు మంజూరు కానున్నాయని ఊర్కొండ మండలాన్ని జడ్చర్ల నియోజకవర్గంలోని ఇతర మండలాలతో సమానంగా అభివృద్ధి చేస్తానని హామీనిచ్చారు.
మంగళవారం మండలంలోని ఇప్పపహాడ్, జకినాలపల్లి,బొమ్మరాజుపల్లి, జగబోయిన్ పల్లి, రాంరెడ్డిపల్లి, ముచ్చర్లపల్లి, ఊర్కొండ, ఊర్కొండపేట్,రాచాలపల్లి, మాధారం, గుడిగానిపల్లి, రేవల్లి, తిమ్మన్నపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు షూస్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పదేళ్ల బీఆర్ఎస్ పరిపాలనలో ఊర్కొండ మండలం అభివృద్ధికి నోచుకోలేకపోయిందని అన్నారు. ఊర్కొండ మండల అభివృద్ధికి అవసరమైన నిధులను తీసుకొచ్చి తాను ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తానని పేర్కొన్నారు. జకినాలపల్లి గ్రామంలో చెరువు నిర్మాణం చేయాలని ప్రజలు కోరగా తాను చెరువు నిర్మాణానికి పంచాయితీ రాజ్ శాఖ ద్వారా 5 కోట్ల నిధులు మంజూరు చేయించానని ప్రస్తుతం దీనికి సంబంధించి టెండర్ల ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. అలాగే మండలంలోని రోడ్ల నిర్మాణాల కోసం ఆర్ అండ్ బి ద్వారా 60 కోట్ల నిధుల కోసం ప్రతిపాదనలు పంపించినట్లు ఈ నిధులు మార్చి నెల నాటికి మంజూరవుతాయని అన్నారు. అదేవిధంగా ఊర్కొండ మండల కేంద్రంలో ఎమ్మార్వో, ఎంపీడీఓ కార్యాలయాలకు సరైన భవనాలు లేవని ప్రస్తావిస్తూ వాటి కోసం 16 కోట్లతో ఇంటి గ్రెటెడ్ భవన నిర్మాణాన్ని ప్రతిపాదించామన్నారు.
గత పదేళ్ల కాలంలో అప్పటి ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్వీర్యం చేసి, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిని పట్టించుకోని కారణంగా ఆర్థిక స్థోమత సహకరించకపోయినా ప్రైవేటు పాఠశాలల్లో పిల్లలను చదివించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి అవసరమైన నిధులను మంజూరు చేయించడానికి కృషి చేస్తానని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు లక్ష్యాలను ఎంచుకొని ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు తిరుపతిరెడ్డి, అధికార ప్రతినిధి వీరస్వామి, ప్రధానకార్యదర్శి రమేష్ నాయక్, మైనార్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు అబ్దుల్ సమీ, మండల అధ్యక్షుడు వెంకటయ్యగౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ నిఖిల్ రెడ్డి, మాజీ సర్పంచ్లు అనిల్ రెడ్డి,నాగోజి, కృష్ణయ్య, నాయకులు నర్సిరెడ్డి, అయ్యబ్ పాషా, రవీందర్ గౌడ్, మనోహర్ రెడ్డి, వహీద్, విజయుడు తదితరులు పాల్గొన్నారు.