Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Kejriwal aims Modi's seat: మోదీ సీటే కేజ్రీవాల్‌ లక్ష్యం!

Kejriwal aims Modi’s seat: మోదీ సీటే కేజ్రీవాల్‌ లక్ష్యం!

ఏ రాజకీయ నాయకుడికైనా ఆయన పార్టీ అనుసరించే సిద్ధాంతాన్నే బట్టే గుర్తింపు లభిస్తుంది. అయితే, తామే ఒక సిద్ధాంతమని, తమకు వేరే సిద్ధాంతం అవసరం లేదని చెప్పుకునే నాయకులు కూడా రాజకీయ తెర మీద మధ్య మధ్య ప్రత్యక్షమవుతుంటారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఈ రెండో కోవకు చెందిన వ్యక్తి. ఆయనకు ఒక సిద్ధాంతమంటూ ఏమీ లేదు. ఆయనే ఓ సిద్ధాంతం. ఆయన ఏం చేసినా ఇతరులతో సంప్రదించడమంటూ ఉండదు. ఆ విధానమే ఆయనను మద్యం కేసులో ఇరికించి, తీహార్‌ జైలుకు పంపించింది. జైలు నుంచి బయటికి వచ్చినా, మళ్లీ రాజకీయంగా పావులు కదుపుతున్నా ప్రతిదీ సొంత నిర్ణయమే. తన మనసుకు ఎంత తోస్తే అంత. తీహార్‌ జైలు నుంచి బెయిలు మీద బయటికి రాగానే ఆయన తనకు అత్యంత సన్నిహితురాలు, మంత్రివర్గ సభ్యురాలు అయిన ఆతిశీ మార్లేనాను ముఖ్యమంత్రి పదవికి ఎంపిక చేశారు. ఇప్పుడు ఆయన లక్ష్యం బీజేపీ, ప్రధాని, కాంగ్రెస్‌. ఈ మూడు శక్తులను తాను వదిలిపెట్టేది లేదని ఆయన ఢంకా బజాయించి చెబుతున్నారు. నిజానికి ఓట్లను కూడగట్టడంలో బీజేపీలో నరేంద్ర మోదీ ఎంతో ఆమ్‌ ఆద్మీ పార్టీలో కేజ్రీవాల్‌ అంత. ఈ విషయంలో ఇద్దరూ సమఉజ్జీలు. ఇప్పుడు ఆయనకు మోదీ సీటే ప్రధాన లక్ష్యం.
అన్నా హజారేను కలుసుకుని, ఆయనతో కలిసి అవినీతి మీద పోరాటం సాగిస్తున్న నాటి నుంచి కేజ్రీవాల్‌ రాజకీయంగా తన్ను తాను గుర్తించడం మొదలైంది. తాను కేంద్ర బిందువుగా ఉండాలే తప్ప గుంపులో గోవిందా అన్నట్టుగా ఉండకూడదనే అభిప్రాయం ఆయనకు అప్పుడు కలిగింది. తాను ప్రజల కోసమే పుట్టాననే అభిప్రాయాన్ని ఆయన కలిగించగలిగారు. తాను నీతి నిజాయతీలకు కట్టుబడి ఉండే వ్యక్తినని నిరూపించుకోగలిగారు. ఆధునిక స్వాతంత్య్ర సమర యోధుడిననే గుర్తింపును పొందగలిగారు. ఈ మిశ్రమానికి రాజకీయ, సామాజిక, చారిత్రక మసాలా కలిపి అందమైన, ఆకర్షణీయమైన, రుచికరమైన వంటకాన్ని తయారు చేశారు. దీనితో పాటు ఇందిరా గాంధీ మాదిరిగానే సంక్షేమమే నినాదంగా ప్రజల్లోకి ఆయన చొచ్చుకుపోయారు.
నిశ్శబ్ద వ్యూహాలు
ఢిల్లీని లక్షలాది కోట్ల రూపాయల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేస్తానని ఆయన ఏనాడూ ప్రకటించ లేదు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ గురించి కానీ, ఆధునిక టెక్నాలజీ గురించి కానీ ఆయన ఎక్కడా ఎప్పుడూ మాట్లాడలేదు. “మీతో కలిసిపోయే నాయకుడిని, మీతో తినే, తాగే, పడుకునే నాయకుడిని ఎంచుకోండి. మీలాగా దుస్తులు ధరించే నాయకుడిని అనుసరించండి” అనేది ఆయన సరళ సిద్ధాంతం. 2014లో మోదీ ప్రభంజనం ప్రారంభమైన తర్వాత ఆయనకు భిన్నమైన నాయకుల అవసరం ఏర్పడిన విషయాన్ని గ్రహించుకుని ఆయన కొత్త అవతారం ఎత్తారు.
కులాలు, మతాలతో ఆయనకు పని లేదు. తానే ఒక సిద్ధాంతంగా మారడమే కాక, తన అనుచరులు, అనుయాయులను కూడా ఇదే సిద్ధాంతంలోకి మార్చారు. ఇదే సిద్ధాంతంతో ఆయన మూడు పర్యాయాలు ఢిల్లీ శాసనసభలోనూ, ఒకసారి పంజాబ్‌ శాసనసభలోనూ విజయ ఢంకా మోగించారు. క్రమంగా కేజ్రీవాలిజం అనే కొత్త సిద్ధాంతం రూపుదిద్దుకుంది. ఇది గాంధీయిజం, మార్క్సిజం, క్యాపిటలిజం, సోషలిజం వగైరాలన్నిటికీ అతీతమైంది. పని చేసే ప్రభుత్వం, సమర్థవంతమైన పాలన అనే విధానాలను అనుసరించిన కేజ్రీవాల్‌ వీటితోనే విజయాలు సాధిస్తున్నారు.
ఉచిత విద్య, ఉచిత విద్యుత్తు, చౌకగా వైద్యం, ఉచిత మంచినీరు ఆయన విధానాల్లో ముఖ్యమైన భాగాలు. విచిత్రమేమిటంటే, ఆయన ప్రవేశపెట్టిన ఉచితాలన్నీ కాలక్రమంలో దేశంలో ప్రతి రాజకీయ పార్టీ మేనిఫెస్టోల్లో ప్రధానాంశాలుగా మారిపోయాయి. ఇక మతం విషయానికి వస్తే ఆయన కరుడు కట్టిన హిందువు. వీలైనప్పుడల్లా ఆంజనేయ స్వామి ఆలయాలకు వెడుతుంటారు. తాను లౌకికవాద హిందువునని చెప్పుకుంటుంటారు. ఢిల్లీలోని బస్తీల్లో, మురికివాడల్లో, మైనారిటీలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ వాలంటీర్లు అహర్నిశలూ కనిపిస్తుంటారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకులు, కార్యకర్తలెవరూ బీజేపీని గానీ, కాంగ్రెస్‌ పార్టీని గానీ ఒక పట్టాన నమ్మరు. ఈ రెండు పార్టీలు తమను అనేక విధాలుగా మోసం చేశాయని వారు చెబుతుంటారు. మురికివాడల్లో, పేదల ప్రాంతాల్లో విద్యుత్తు, మంచినీరు, ఇతర ప్రాథమిక సదుపాయాలు అవిచ్ఛిన్నంగా కొనసాగడం మీద వీరు దృష్టి పెడుతుంటారు. పైగా ఈ పార్టీలో ఉన్న నాయకులు, కార్యకర్తల్లో 80 శాతం మంది యువజనులే. పార్టీ ఏర్పడిన మొదట్లో విదేశాల నుంచే సహాయ సహకారాలు అందుతుండేవి. ఇప్పుడు పార్టీ పూర్తిగా నిలదొక్కుతుంది.
అధికార దాహం
కొద్ది కాలం జైలు జీవితాన్ని అనుభవించిన తర్వాత కేజ్రీవాల్‌లో బాగా మార్పు వచ్చింది. ఇక ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆయన ఢిల్లీకి, శాసనసభ ఎన్నికలకు పరిమితం కాదలుచుకోలేదు. జాతీయస్థాయి, లోక్‌ సభ వంటివి ఆయన ప్రాధాన్యాల జాబితాలో మొదటి స్థానానికి చేరిపోయాయి. సుమారు 12 ఏళ్లుగా ఆయన జాతీయ రాజకీయాల మీద దృష్టి పెట్టినప్పటికీ, జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత మాత్రం ఆయన సంకల్పం మరింత దృఢపడిపోయింది. 2014-19 సంవత్సరాల మధ్య మోదీని ఆయన తన ఏకైక లక్ష్యంగా చేసుకున్నారు. మోదీని అనేక సందర్భాల్లో ఆయన ఓ ఉన్మాదిగా అభివర్ణించడం కూడా జరిగింది. ఢిల్లీ శాసనసభలో 70 స్థానాలకు 67 స్థానాలు గెలుచుకున్న తర్వాత ఆయనకు జాతీయ రాజకీయాల మీద మరింతగా దృష్టి కేంద్రీకృతమైంది. ముందుగా ఇతర రాష్ట్రాల్లో బలం పుంజుకునే కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. గత పదేళ్ల కాలంలో ఆయన హర్యానా, కర్ణాటక, చత్తీస్‌ గఢ్‌, మధ్యప్రదేశ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, ఒడిశా, రాజస్థాన్‌, ఉత్తరాఖండ్‌ ఉత్తరప్రదేశ్‌, ఈశాన్య రాష్ట్రాల్లో ఆయన పార్టీ పోటీ చేసింది. అయితే, ఈ రాష్ట్రాల్లో ఆయన ఇంకా ఖాతా ప్రారంభించలేదు. అయితే, ఆయనకు ఇతర రాష్ట్రాల్లో తనకున్న బలం ఏమిటో మాత్రం తెలిసి వచ్చింది.
దేశంలో కాంగ్రెస్‌ పార్టీ మూడు రాష్ట్రాల్లో అధికారంలో ఉండగా ఆమ్‌ ఆద్మీపార్టీ రెండు రాష్ట్రాల్లో, పంజాబ్‌, ఢిల్లీ రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. అంటే మూడవ స్థానంలో ఉందన్నమాట. ఇటీవల జాతీయ స్థాయిలో ప్రజాభిప్రాయ సేకరణ జరిగినప్పుడు కూడా దేశంలో అత్యంత జనాకర్షణ కలిగిన నాయకుల్లో మోదీ, రాహుల్‌ గాంధీ తర్వాత కేజ్రీవాల్‌ మూడవ స్థానంలో ఉన్నట్టు తేలింది. కేజ్రీవాల్‌కు జనాదరణ పెరగడానికి కారణమేమిటన్నది అర్థం కావడం లేదు. ఆయన ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, “మేము సాధారణ ప్రజలం. సమస్యలకు పరిష్కారం వామపక్షాల్లో దొరుకుతుంద నుకుంటే వాటిని అక్కడి నుంచే స్వీకరిస్తాం. పరిష్కారం మితవాదుల్లో దొరుకుతుందనుకుంటే వాటిని అక్కడి నుంచే తీసుకుంటాం. అకుంఠిత దేశభక్తి, తిరుగులేని నిజాయతీ, మానవత్వం ఇవే మా సిద్ధాంతాలు” అని వివరించారు.
ఉన్నత స్థానానికి వెళ్లే దారి అనేక ఆటంకాలు, అవరోధాలతో కూడుకున్నదని ఆయనకు బాగా తెలుసు. ఇండీ కూటమి వాహనాన్ని కూడా తోడు తీసుకుని ఈ జాతీయ రహదారిలో ముందుకు సాగాలని, అవసరమైనప్పుడు డ్రైవర్‌ సీటులో కూర్చోవచ్చని ఆయన ఆలోచించారు. ఢిల్లీ, పంజాబ్‌ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ లేకపోవడం వల్ల ఏర్పడిన శూన్యాన్ని ఆయన భర్తీ చేశారు. ఆ విధంగా ఆయన కాంగ్రెస్‌ పార్టీకి ఒక ముప్పుగా మారారు. ఆయన చాతుర్యాన్ని, ఆయన వ్యూహాల్ని, ఆయన ఆశల్ని, ఆశయాల్ని అర్థం చేసుకున్న ప్రాంతీయ పార్టీలు కూడా ఆయన వల్ల తమకు ముప్పు ఉందని గ్రహించాయి. అయితే, ఆయన ఏ విషయంలోనూ హడావిడి పడరు. తొందరపాటు వైఖరి కనిపించదు. నిదానమే ప్రధామన్నట్టుగా ఆయన రాజకీయాల్ని ముందుకు నడిపిస్తున్నారు. ఆయన ఓటర్లు ఆయన నుంచి అత్యుత్తమ ప్రాథమిక సౌకర్యాలను కోరుకుంటుండగా ఆయన మోదీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలని కోరుకుంటున్నారు. రాష్ట్ర పీఠం మీద ఆతిషీని ప్రతిష్ఠించిన తర్వాత జాతీయ పీఠం మీద శ్రద్ధ పెరగడం మరింత ఎక్కువవుతుంది.

  • జి. జ్ఞానేశ్వర్‌
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News