ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం, అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన శ్రీశైలం మహాక్షేత్రంలో గురువారం నుంచి శరన్నవరాత్రులు ప్రారంభం ప్రారంభం అయ్యాయి. దసరా ఉత్సవాల నేపథ్యంలో ఆలయాన్ని రంగు రంగుల విద్యుద్దీపాలు, పూలతో అందంగా అలంకరించారు.
ఉదయం ఆలయ ఈవో పెద్దిరాజు అర్చక పండితులతో కలిసి ఉదయం పసుపు కుంకుమ, పూలు పండ్లతో ప్రధాన గోపురం నుంచి ఆలయ ప్రవేశం చేశారు. అనంతరం గణపతి పూజ, స్వస్తి పుణ్యాహవాచనం, దీక్ష సంకల్పం, కంకణ పూజ, ఋత్వికగ్వరణం, యాగశాల ప్రవేశం, గణపతిపూజ అఖండదీపస్థాపన మండపారాధన, తదితర పూజాకార్యక్రమాలు జరిపించారు.
శ్రీశైలంలో అమ్మవారు భ్రమరాంబికాదేవి కొలువై పూజలందుకుంటోంది. అష్టాదశ మహాశక్తి పీఠాల్లో ఒకటైన శ్రీశైల క్షేత్రంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. మొదటిరోజున శ్రీ భ్రమరాంబిక అమ్మవారు భృంగి వాహనాన్ని అధిరోహించి..నెలవంకను శిరస్సున అభరణంగా ధరించి, కుడిచేత శూలాన్ని, ఎడమ చేత పద్మాన్ని ధరించి, హిమవంతుని కుమార్తెగా..శైలపుత్రిగా భక్తులకు దర్శనమిచ్చారు.
రాత్రి 7 గంటలకు ‘శైలపుత్రి’ అలంకారంలో- అమ్మవారిని కొలువు తీర్చిన ఆలయ అర్చకులు రాత్రి 8 గంటలకు భృంగి వాహనంపై మల్లికార్జున స్వామివారి సహితంగా శైలపుత్రి అమ్మవారిని ఆలయం నుంచి తోడ్కొని వచ్చి..అనంతరం మాడవీధుల్లో ఊరేగించారు.
శ్రీశైలంలో మల్లిఖార్జున స్వామిగా కొలువైన శివుడి సతీమణిగా భ్రవరాంభికాదేవిగా అవతరించారు.
స్వామివారి దేవాలయానికి వెనుకవైపు అమ్మవారు భ్రమరాంబికా దేవిగా కొలువై పూజలందుకుంటున్నారు. శరన్నవారాత్రి ఉత్సవాల్లో భాగంగా భ్రమరాంభికాదేవి శైలపుత్రిగా భక్తులకు దర్శనమిచ్చారు.
నేడు బ్రహ్మచారిణి అలంకారంలో భ్రమరాంబిక దేవి
దసరా బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీశైల మహాక్షేత్రం లో రెండవ రోజైన శుక్రవారం భ్రమరాంబిక దేవి బ్రహ్మచారిణి దేవి అలంకరణలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. సాయంత్రం శ్రీ స్వామి అమ్మవార్లకు మయూర వాహనం సేవ నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో పెద్ది రాజు పేర్కొన్నారు.