కరుణానిధి కుటుంబంలో మూడోతరం నాయకుడైన ఉదయనిధికి చిన్న సైజు పట్టాభిషేకం జరిగింది. తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగా ఉదయనిధి ప్రమాణస్వీకారం చేశారు. ఎంకే స్టాలిన్ క్యాబినెట్‌లో ఎంతోమంది సీనియర్లు ఉన్నారు. అయితే కొంతకాలంగా ఉదయనిధి పేరు మాత్రం మార్మోగిపోతోంది. పైగా ఇటీవలికాలంలో సనాతన ధర్మంపై ఆయన పోరాటం ప్రారంభించారు అంతేకాదు ద్రవిడవాదాన్ని మరింత బలోపేతం చేసేలా ఉదయనిధి తరచూ వ్యాఖ్యలు చేస్తున్నారు. కాగా తమిళనాడు అసెంబ్లీకి మరో రెండేళ్లలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో డీఎంకేను గెలుపుతీరాలకు చేర్చే బాధ్యతను దాదాపుగా ఉదయనిధికి డీఎంకే అప్పగించినట్లే.
ద్రవిడ మున్నేట్ర కజగం(డీఎంకే)లో మూడోతరం రాజకీయ వారసుడు ఉదయనిధి అధికారానికి బాగా దగ్గరగా వచ్చాడు. ప్రస్తుతానికి ముఖ్యమంత్రి పదవికి ఒక అడుగుదూరంలోనే ఉన్నాడు. తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధికి ప్రమోషన్ లభించింది. తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగా ఉదయనిధి ప్రమాణస్వీకారం చేశాడు. స్టాలిన్ క్యాబినెట్‌లో యువజన వ్యవహారాల మంత్రిగా ఆయన వ్యవహరించారు. సమర్థుడైన మంత్రిగా తమిళనాట ఉదయనిధి పేరు తెచ్చుకున్నారు. స్టాలిన్ క్యాబినెట్‌లో మంత్రులు చాలా మంది ఉన్నారు. అయితే అందరూ ఒక ఎత్తు. ఉదయనిధి ఒక ఎత్తు అంటారు డీఎంకే నాయకులు. అందుకే కొంతకాలంగా తమిళనాట ఉదయనిధి పేరు మార్మోగుతోంది . కాగా ఉదయనిధిని ఉప ముఖ్యమంత్రి చేయాలన్న డిమాం కొంతకాలంగా డీఎంకే కార్యకర్తల నుంచి వినిపిస్తోంది. డీఎంకే ఐడియాలజీని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఉదయనిధి విజయవంతం అయ్యారని కార్యకర్తలు అంటున్నారు. తమిళనాడు అసెంబ్లీకి మరో రెండేళ్లలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో యువతరానికి ప్రతీకగా ఉదయనిధిని ఉప ముఖ్యమంత్రి చేయాలన్న డిమాం ఊపందుకుంది. దీంతో క్యాడర్ డిమాం ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా అంగీకరించినట్లు చెన్నై రాజకీయవర్గాల సమాచారం.అంతిమంగా ఉదయనిధి తమిళనాడు ఉప ముఖ్యమంత్రి అయ్యారు.
ఉదయనిధికి డీఎంకేను గెలిపించే బాధ్యతలు ?
ప్రస్తుతం తమిళనాట డీఎంకే అధికార పక్షంగా ఉంది. ప్రధాన ప్రతిపక్షంగా అన్నాడీఎంకే ఉంది. అయితే, జయలలిత మరణం తర్వాత అన్నా డీఎంకే పార్టీ చాలా వరకు బలహీన పడిందనే చెప్పాలి. పైగా అన్నాడీఎంకే నేతల మధ్య సఖ్యత కూడా లేదు. ఇక, బీజేపీ ప్రభావం గురించి ఎంత చెప్పినా తక్కువే. వాస్తవానికి తమిళనాట బీజేపీని బలోపేతం చేయడంలో అన్నామలై ఫెయిలయ్యాడన్న నిర్థారణకు కమలం పార్టీ పెద్దలు వచ్చినట్లు చెన్నై రాజకీయ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో 2026లో జరగనున్న అసెంబ్లీ ఎన్నిక డీఎంకే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇటు అన్నా డీఎంకే అటు బీజేపీ నుంచి తమకు పెద్దగా ప్రతిఘటన ఉండదన్న అభిప్రాయానికి డీఎంకే వచ్చింది. ఏతావాతా ఒక్క సినీ నటుడు విజయ్ నుంచి మాత్రమే ప్రతిఘటన ఉంటుందని డీఎంకే భావిస్తోంది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా హీరో విజయ్‌కు కౌంటర్‌గా ఉదయనిధిని రంగంలోకి దింపాలన్నది డీఎంకే ఆలోచన అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలో బీజేపీయే వెనుక ఉండి…సినీ హీరో విజయ్ తో పార్టీ పెట్టించిందన్నది తమిళనాడు జనాభిప్రాయం. కాగా సినీ హీరో విజయ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో రాజకీయరంగ ప్రవేశం చేశారు. తమిళిగ వెట్రి కళగం పేరుతో ఆయన రాజకీయ పార్టీ ఏర్పాటు చేశారు. తమిళిగ అంటే తమిళనాడు అని అర్థం. వెట్రి అంటే విజయమని అర్థం. అలాగే కళగం అంటే రాజకీయపార్టీ అని అర్థం వస్తుంది. మొత్తంగా తమిళిగ వెట్రి కళగం అంటే తమిళనాడు విజయం పార్టీ అనే అర్థం వస్తుంది. తమిళనాడులో సినిమాలకు, రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంది. తమిళనాడులోని అనేక ప్రాంతీయ పార్టీల వ్యవస్థాపకులు సినీ రంగానికి చెందిన ప్రముఖులే. ఈ నేపథ్యంలోనే రాజకీయ పార్టీ పెడుతున్నట్లు సినీ హీరో విజయ్ వెల్లడించారు. రాజకీయ పార్టీ ఏర్పాటు చేయడానికి కొన్ని నెలల కిందట విజయ్ తన అభిమాన సంఘాలతో సుదీర్ఘ మంతనాలు జరిపారు. రాజకీయాల్లోకి రావాలా? వద్దా? అనే విషయమై పలు దఫాలు చర్చలు జరిపారు. చివరకు తమిళిగ వెట్రి కళగం పేరుతో హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. 2026లో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే హీరో విజయ్ పార్టీ పెట్టడం అలాగే జెండా ఆవిష్కరించడం జరిగిపోయాయి. తమిళనాడులో విజయ్ దళపతికి మంచి స్టార్‌డమ్ ఉంది. ఇప్పటితరం హీరోలలో విజయ్‌ను ప్రముఖుడిగా తమిళ సినీ ప్రముఖులు. హీరో విజయ్‌ను అభిమానులు ప్రేమగా దళపతి అని పిలుస్తుంటారు. విజయ్ కేవలం సినిమాలకే పరిమితమైన నటుడు కాదు. కొంతకాలంగా సేవారంగంలోనూ ఆయన కొనసాగుతున్నారు. పదో తరగతి, ప్లస్ టూ పరీక్షల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. అభిమానులకు విజయ్ ఎనలేని ప్రాధాన్యం ఇస్తుంటారు. ఏ చిన్న నిర్ణయం తీసుకోవాలన్నా ముందుగా అభిమానులను సంప్రదిస్తుంటారు. ఏడాదికి రెండు సార్లు అభిమానులతో హీరో విజయ్ సమావేశమవుతుంటారు. వారికి పసందైన విందు ఏర్పాటు చేస్తుంటారు. అంతేకాదు అభిమానులకు ఖరీదైన బహుమతులు కూడా ఇస్తుంటారు. ఫ్యాన్స్ పట్ల తన ఆత్మీయతను చాటుకుంటారు స్టార్ హీరో విజయ్. తమిళనాడులో రాజకీయ పార్టీలకు కొదవలేదు. బీజేపీ, కాంగ్రెస్‌లాంటి జాతీయ పార్టీలను మినహాయిస్తే, దాదాపుగా అన్ని ప్రాంతీయ పార్టీల్లోనూ సినీ ప్రముఖుల ఆధిపత్యమే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో హీరో విజయ్ నాయకత్వంలో మరో ప్రాంతీయ పార్టీ రెండేళ్లలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి సన్నద్ధమవుతోంది. హీరో విజయ్ విషయానికి వస్తే ఇప్పటివరకు ఆయన ప్రత్యక్షంగా ఎప్పుడూ రాజకీయాల్లో లేరు. కానీ స్వచ్ఛంద కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలలో ఆయన బిజీగా ఉంటూ ఉంటారు. రాజకీయాలు తనకు హాబీ కాదని, ప్రజల సంక్షేమం కోసం జీవితం పూర్తిగా అంకితం చేయాలని అనుకుంటున్నట్లు విజయ్ పేర్కొన్నారు.
కలగలసిన సినీ, రాజకీయరంగాలు
తమిళనాడులో చాలాకాలంగా రాజకీయాలు, సినిమాలు పెనవేసుకుపోయాయి. తమిళనాడులోని రెండు ప్రధాన ద్రవిడ పార్టీలైన డీఎంకే, అన్నా డీఎంకేలను చాలాకాలం పాటు శాసించింది సినీరంగ ప్రముఖులే. తమిళనాట రాజకీయ దిగ్గజాలైన కరుణానిధి, ఎమ్జీ రామచంద్రన్, జయలలిత సినిమా పరిశ్రమ నుంచి ఎదిగొచ్చిన నేతలే. తమిళనాడు రాజకీయాలను కరుణానిధి అయిదు దశాబ్దాల పాటు శాసించారు. కరుణానిధి అసలు పేరు దక్షిణామూర్తి. కాగా, బాల్యంలోనే రచనలపై ఆసక్తి చూపారు. అప్పట్లో జస్టిస్‌పార్టీ నేతృత్వంలో సాంఘిక సంస్కరణ ఉద్యమాలు బలంగా ఉండేవి. వీటి ప్రభావంతో విద్యార్థిగా ఉన్నప్పుడే మరి కొందరు సహచరులతో కలిసి ‘ఆల్‌స్టూడెంట్‌క్లబ్’ అనే సంస్థను ఆయన నెలకొల్పారు. ద్రవిడ ఉద్యమంలో ఇదే తొలి విద్యార్థి సంఘం. నాటక రచయితగా జీవితాన్ని ప్రారంభించిన కరుణానిధి ఆ తరువాత సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. పరాశక్తి సినిమాలో ఆయన రాసిన డైలాగ్స్, మంటలు పుట్టించాయి. సినీరంగం నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో కరుణానిధి ఎంట్రీ ఇచ్చారు. కాలక్రమంలో కరుణానిధి డీఎంకే అధినేత అయ్యారు. తమిళ ప్రజల నమ్మకాన్ని చూరగొన్నారు. తమిళనాడుకు ఐదుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ద్రవిడ సంస్కృతి చాంపియన్‌గా కరుణానిధి పేరు తెచ్చుకున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా కరుణానిధి ఉన్న సమయంలో సినీ హీరో ఎమ్జీ రామచంద్రన్ డీఎంకేలోనే ఉన్నారు. కరుణానిధికి నమ్మకస్తుడిగా ఎమ్జీఆర్ పేరు తెచ్చుకున్నారు. అయితే 70ల్లో మాటల రచయిత కరుణానిధి, వెండితెర వేలుపు ఎమ్జీ రామచంద్రన్ మధ్య విభేదాలు వచ్చాయి. ఫలితంగా డీఎంకేలో చీలిక వచ్చింది. ఈ నేపథ్యంలో డీఎంకే నుంచి ఎమ్జీ రామచంద్రన్ బయటకు వచ్చారు. ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం (అన్నా డీఎంకే) పేరుతో ఎమ్జీ రామచంద్రన్ కొత్త రాజకీయ పార్టీ పెట్టారు. 1977లో అన్నాడీఎంకే తమిళనాట అధికారంలోకి వచ్చింది. 1977తరువాత తమిళనాడు రాజకీయాల్లో పెనుమార్పులు సంభవించాయి. రాజకీయ పార్టీల బలాబలాలు మారిపోయాయి. 1987లో అనారోగ్యంతో చనిపోయేంతవరకు ఎమ్జీఆరే తమిళనాడు ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఈ పదేళ్ల కాలంలో డీఎంకే ప్రతిపక్షానికే పరిమితమైంది. తమిళనాడు రాజకీయాలలో ఎమ్జీఆర్ ది చెరగని ముద్ర. బాల్యంలో తిండికి కూడా ఇబ్బంది పడ్డ ఎమ్జీఆర్ ఆ తరువాత సినీ, రాజకీ రంగాలను శాసించారు. ఎమ్జీఆర్ తరువాత అన్నా డీఎంకేలో జయలలిత చక్రం తిప్పారు. జయలలితకు మరో పేరు పురచ్చి తలైవి. అంటే విప్లవ నాయకురాలని అ తమిళనాడు రాజకీయాల్లో ఆమె నిజంగా విప్లవ నాయకురాలే. అనేక అటుపోట్లను ఎదుర్కొని తమిళ రాజకీయాల్లో ఆమె కొనసాగారు. అప్పటి రాజకీయ ప్రత్యర్థి కరుణానిధి పై అలుపెరుగని పోరాటం చేశారు. విజయాలను సొంతం చేసుకున్నారు. తొలిరోజుల్లో ఎమ్జీఆర్ భార్య జానకీ రామచంద్రన్ తానే వారసురాలినంటూ ముందుకొచ్చారు. అయితే ఆ తరువాత అన్నా డీఎంకే క్యాడర్ , జయలలితకే జై కొట్టింది. దీంతో అన్నా డీఎంకే లో జయలలిత శకం ప్రారంభమైంది. సంవత్సరాలు గడిచేకొద్దీ అన్నా డీఎంకేకు జయలలిత తిరుగులేని నాయకురాలయ్యారు. తమిళనాట కొన్నేళ్ల పాటు రాష్ట్ర రాజకీయాలు జయలలిత చుట్టూనే తిరిగాయంటే అతిశయోక్తి కాదు. కరుణానిధి, ఎమ్జీ రామచంద్రన్, జయలలిత తరువాత తమిళనాడు రాజకీయాల్లో సత్తా చాటిన మరో సినీరంగ ప్రముఖుడు కెప్టెన్ విజయ్‌కాంత్. దక్షిణాదిన పోలీస్ ఆఫీసర్ పాత్రకు గ్లామర్ తీసుకువచ్చిన స్టార్ హీరో కెప్టెన్ విజయ్‌కాంత్. డబుల్ రోల్స్‌కు కూడా విజయ్‌కాంత్ ఫేమస్. ఆయన వందో చిత్రం కెప్టెన్ ప్రభాకరన్. ఈ సిన్మా తరువాత విజయ్‌కాంత్‌కు కెప్టెన్ అనే పేరు వచ్చింది. అప్పటినుంచీ తమిళ సినీపరిశ్రమలో కెప్టెన్ విజయకాంత్‌గా ఆయన పాపులర్ అయ్యారు. తమిళ సినీ హీరో శరత్ కుమార్ కూడా పాలిటిక్స్‌లోకి ప్రవేశించారు. ఆల్ ఇండియా సమతువ మక్కల్ కచ్చి పేరుతో ప్రాంతీయ పార్టీ పెట్టారు. అయితే శరత్ కుమార్ పార్టీ తమిళ రాజకీయాలపై ఎటువంటి ప్రభావం చూపలేకపోయింది. అలాగే కమల హసన్ పార్టీ కూడా ప్రజలను ఆకట్టుకోలేకపోయింది. ఇదిలా ఉంటే రజనీకాంత్ రాజకీయాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తమిళ సినీరంగంలో ఆయనొక సునామీ. తమిళనాట ఆయనకున్న క్రేజే వేరు. నాలుగు దశాబ్దాలకు పైగా తమిళ సినీరంగాన్ని ఆయన శాసిస్తున్నారంటే అతిశయోక్తి కాదు.“ నేను ఒకసారి చెబితే వంద సార్లు చెప్పినట్లే”….బాషా సినిమాలో రజనీకాంత్ నోటి వెంట వచ్చిన డైలాగ్ అద్భుతంగా పేలింది. అయితే ఈ డైలాగ్ రజనీ సినిమాలకే పరిమితం. రజనీకాంత్ నిజ జీవితానికి ఏమాత్రం వర్తించదు. ఎందుకంటే 2017 డిసెంబర్ లో తాను రాజకీయ పార్టీని ప్రకటిస్తానని రజనీకాంత్ వెల్లడించి హల్‌చల్ చేశారు. అయితే ఆ తరువాత ఆయన మనస్సు మార్చుకున్నారు. 2020 డిసెంబరులో “నేను రాజకీయాల్లోకి రాలేనని చెప్పడానికి ఎంతగానో చింతిస్తున్నా” అని స్టేట్ మెంట్ ఇచ్చారు. వస్తాను …వస్తాను అంటూనే చివరిక్షణంలో చేతులెత్తేశారు రజనీకాంత్. మొత్తంమీద మరో రెండేళ్లలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఉదయనిధి, విజయ్ ప్రధాన పోటీదారులవుతారన్న ఊహాగానాలు చెన్నైలో హల్‌చల్ చేస్తున్నాయి.
-ఎస్. అబ్దుల్ ఖాలిక్, సీనియర్ జర్నలిస్ట్ 63001 74320