Sunday, October 6, 2024
Homeఓపన్ పేజ్DMK-Udayanidhi: డి.ఎం.కె పార్టీకి వారసుడు రెడీ

DMK-Udayanidhi: డి.ఎం.కె పార్టీకి వారసుడు రెడీ

కుటుంబ రాజకీయాలు..

తమిళనాడులో అతి పెద్ద పార్టీగా గుర్తింపు పొంది, పాలక పక్షంగా వ్యవహరిస్తూ, ఒక సుదీర్ఘ చరిత్ర కలిగిన ద్రవిడ మున్నేట్ర కళగం పార్టీకి ‘ఉదయ సూర్యుడు’ చిహ్నంగా ఉంటూ వస్తోంది. అయితే, ఇంత సుదీర్ఘ చరిత్ర కలిగి ఉండి, అనేక పర్యాయాలు అధికారం చేపట్టిన ఈ పార్టీ మొదటి నుంచి కుటుంబ వారసుల మీదే ఆధారపడుతూ ఉంటోంది. కొత్త నాయకత్వాన్ని సృష్టించే ప్రయత్నమేదీ పార్టీలో జరగడం లేదు. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌ కుమారుడైన ఉదయనిధికే పార్టీ వారసత్వంతో పాటు, పాలన వారసత్వం కూడా దక్కే సూచనలు ప్రబలంగా కనిపిస్తు న్నాయి. స్టాలిన్‌ తన కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌ ను ఉప ముఖ్యమంత్రి పదవికి ప్రమోట్‌ చేయడం దీన్ని నిర్ధారిస్తోంది. వాస్తవానికి ఉదయనిధి ఇప్పటికే అటు ప్రభుత్వంలోనూ, ఇటు పార్టీలోనూ చక్రం తిప్పుతున్నారు. పార్టీ వ్యవస్థాపకుడు ఎం. కరుణానిధి చేసినట్టే స్టాలిన్‌ కూడా మున్ముందు ఉదయనిధిని ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టే అవకాశం ఉంది.
ఉదయనిధి రాజకీయాల్లోకి రావడం, శాసనసభకు పోటీ చేసి విజయం సాధించడం, మంత్రి పద విని చేపట్టడం, ఉప ముఖ్యమంత్రి పదవికి ప్రమోట్‌ కావడం వంటివి శీఘ్రగతిన జరిగిపోయాయి. ఆయన కొద్ది కాలం సినిమాల్లో హీరోగా నటించారు. రాజకీయ ప్రవేశం చేసే ముందు కొంత కాలమైనా చలన చిత్ర రంగంలో ఉండడం తమిళనాడులో ఒక ఆనవాయితీగా మారింది. కొద్ది కాలం సినిమాల్లో నటించిన తర్వాత ఉదయనిధి 2018లో రాజకీయ అరంగేట్రం చేశారు. తండ్రి ఆయన భవిష్యత్‌ ప్రణాళికలను రూపొందిస్తుండడంతో ఆయన రాజకీయాల్లో కని విని ఎరుగని రీతిలో పైపైకి దూసుకుపోయారు. 2019 ఎన్నికల్లో ఆయనే పార్టీ ప్రధాన ప్రచార సారథి. ఆయనను అప్పట్లో పార్టీ యువజన విభాగానికి కార్యదర్శిగా నియమించడం జరిగింది. ఆ తర్వాత 2021లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఆయన ఘన విజయం సాధించి మొదటిసారిగా శాసనసభలో అడుగుపెట్టారు. కొద్ది రోజులకే మంత్రి వర్గంలో కూడా చేరడం జరిగింది.
ఉదయనిధికి సంబంధించి స్టాలిన్‌ చేపడుతున్న మార్పులు, చేర్పుల విషయంలో పార్టీ నాయకులు, ఇతర మంత్రులు, కార్యకర్తలు మనసులో ఏమనుకుంటున్నారో తెలియదు కానీ, దీని గురించి వారు బహిరంగంగా మాట్లాడే అవకాశం లేదు. అయితే, ఉదయనిధిని ఉప ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టడం అనేది మాత్రం తప్పకుండా పార్టీలో కొంత అసంతృప్తికి, అసమ్మతికి అవ కాశం ఇచ్చి ఉంటుంది. పార్టీ మీద కుటుంబ పెత్తనం పెరగడమంటే, అది పార్టీని బలహీనపర చడమే అవుతుంది. అంతేకాక, అది పార్టీ స్ఫూర్తికి కూడా పూర్తిగా విరుద్ధం. ఈ వ్యవహారం పార్టీని బలహీనపరచడానికి కొంత సమయం పట్టవచ్చు కానీ తప్పకుండా ఇటువంటిది జరిగే అవకాశం ఉంది. సామాజిక న్యాయం, ప్రజా భాగస్వామ్యం, సమానత్వం, హేతుబద్ధత వంటి ఆశయాలతో ఏర్పడిన డి.ఎం.కె లో వారసత్వ రాజకీయాలు ఈ సిద్ధాంతాలు, ఆశయాలకు పాతర వేసే అవ కాశం ఉంది. ఈ పార్టీలో కరుణానిధి కుటుంబానికి ఉన్నంత పట్టు మరెవరికీ లేకపోవడమన్నది చాలా కాలంగా పార్టీ వ్యవహారాలను, పాలనా వ్యవహారాలను ప్రభావితం చేస్తోంది. కరుణానిధి భార్యలు, కుమారులు, కుమార్తెలు, మనమళ్లు, మనవరాళ్లకు ఉన్నంత ప్రాధాన్యం పార్టీలో సీనియర్‌ నాయకులకు, ప్రభుత్వంలోని సీనియర్‌ మంత్రులకు కూడా లేదు.
కుటుంబ రాజకీయాలు కేవలం తమిళనాడు రాష్ట్రానికే పరిమితం కాలేదు. ఉత్తర ప్రదేశ్‌ లో ములాయం సింగ్‌ యాదవ్‌ కుటుంబం, బీహార్‌ లో లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుటుంబం, మహా రాష్ట్రలో థాకరే వారసులు, కాశ్మీర్‌ లో అబ్దుల్లా, ముఫ్తీ కుటుంబాలు, కర్ణాటకలో దేవెగౌడ కుటుంబం, చివరికి పశ్చిమ బెంగాల్‌ లో కూడా మమతా బెనర్జీ బంధువులు రాష్ట్ర రాజకీయాలను శాసించడం జరుగుతోంది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ వారసత్వ రాజకీయాల నుంచి చెప్పనక్కర లేదు. నెహ్రూ కుటుంబం అనేక దశాబ్దాలుగా కాంగ్రెస్‌ పార్టీలో అధికారం చెలాయిస్తోంది. వారసత్వ రాజకీయాలను ఎండగట్టే బీజేపీలో కూడా దిగువ స్థాయిలో కుటుంబ రాజకీయాలు కొనసాగుతు న్నాయి. ఒక్క వామపక్షాలు మాత్రమే ఇందుకు మినహాయింపుగా కనిపిస్తున్నాయి. వారసత్వ రాజకీయాలు ప్రజాస్వామ్య సిద్ధాంతాలను, విలువలను మంటగలిపేస్తాయి. ప్రజలందరినీ సరి సమానంగా చూడవలసిన ప్రజాస్వామ్యంలో కొన్ని కుటుంబాలకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వడం ప్రజా ద్రోహమే అవుతుంది. అందరికీ అన్ని రకాల అవకాశాలు లభించాలి. రాజకీయాలనేవి కుటుంబ వ్యాపారాలుగా మారిపోతే స్వల్పకాలంలో ప్రజలు, దీర్ఘకాలంలో ఆ కుటుంబాలు తీవ్రంగా నష్టపోవడం జరుగుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News