వారసత్వాలు మనదేశంలో రాజకీయాలను శాసిస్తున్నాయి. దాదాపు ప్రతి రాష్ట్రంలోనూ ఉన్నత స్థాయి పదవులను అలంకరిస్తున్న, అధిష్టిస్తున్నవారిలో అత్యధికులకు వారసత్వమే ప్రధాన అర్హత అవుతోంది. ఉత్తర, ,దక్షిణ భారతాలనే తేడా లేకుండా ఎక్కడ చూసినా ఇదే తంతు. సామాన్యులు ఎవరైనా రాజకీయాల్లోకి వచ్చి రాణించాలనుకుంటే దాదాపు అసాధ్యమే అవుతోంది. అయితే వారసత్వం, లేదా ధనబలం రెండింటిలో ఏదో ఒకటి తప్పనిసరి అవుతోంది. రాజకీయ వారసత్వం ఉంటే ధనబలం కూడా దాదాపుగా దానంతట అదే వచ్చేస్తోంది కాబట్టి వారికి పదవులు వడ్డించిన విస్తరి అవుతున్నాయి. జాతీయ రాజకీయాల్లో ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే వారసత్వ రాజకీయాలను బాగా పెంచి పోషించింది. స్వతంత్ర భారతదేశానికి ప్రథమ ప్రధానమంత్రి అయిన జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత ఆయన కుమార్తె ఇందిరాగాంధీ, ఆమె తర్వాత ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రులు అయ్యారు. ఆయన మరణానంతరం భార్య సోనియాగాంధీ చాలాకాలం చక్రం తిప్పారు. ఆమె నేరుగా ప్రధానమంత్రి అయ్యేందుకు కొందరు కాంగ్రెస్ నాయకులే అడ్డం పడ్డారు గానీ, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సోనియాగాంధీ ప్రభావం ఎంతమేరకు ఉండేదన్నది బహిరంగ రహస్యమే. పైనుంచి చూసుకుంటే.. జమ్ము కశ్మీర్‌లో ముఫ్తీ మహ్మద్ సయీద్ కుమార్తె మెహబూబా ముఫ్తీ, ఫరూక్ అబ్దుల్లా కుమారుడు ఒమర్ అబ్దుల్లాల రాజకీయం మనకు తెలిసిందే. పంజాబ్‌లోనూ బర్నాలా కుటుంబం, బాదల్ కుటుంబం వరుసగా తరతరాలుగా రాజకీయాలు చేస్తూనే ఉన్నాయి. ప్రకాష్ సింగ్ బాదల్, సుఖ్‌బీర్ సింగ్ బాదల్, హర్ సిమ్రత్ కౌర్ బాదల్, గురుదాస్ సింగ్ బాదల్, మన్‌ప్రీత్ సింగ్ బాదల్.. ఇలా పంజాబీ కుటుంబ నేతల జాబితాకు ఏమాత్రం కొదవలేదు.
ఉత్తరప్రదేశ్‌లో ములాయం సింగ్ యాదవ్ కుమారుడు అఖిలేష్ యాదవ్ ఒకసారి ముఖ్యమంత్రిగా పనిచేశారు. తన తండ్రి ఆదేశంతోనే తొలుత రాజకీయాల్లోకి వచ్చినా, తర్వాత తండ్రిని తలదన్ని మరీ పార్టీని సొంతం చేసుకున్నారు. రాజస్థాన్‌లో అయితే ఇక రాజకీయ వంశాలకు కొదవే లేదు. అక్కడ గెహ్లోత్‌లు, రాజేలు, సింధియాలు, పైలట్లు, సింగ్‌లు, మీర్ధాలు, మీనాలు, ఓలాలు.. ఇలా అనేకానేక వంశాలకు చెందినవాళ్లు వరుసగా రాజకీయాలు చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతానికి పశ్చిమ బెంగాల్ ఒక్కటే ఇందుకు మినహాయింపులా కనిపిస్తోంది. మహారాష్ట్రలోనూ ఠాక్రేలు, పాటిల్‌లు, పటేల్‌లు, పవార్‌లు, ఇతరులు తమ రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకునేందుకు అన్నిరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
ఇక దక్షిణాది విషయానికి వస్తే.. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు, దివంగత ముఖ్యమంత్రి ఎం.కె.కరుణానిధి మనవడు అయిన ఉదయనిధి స్టాలిన్ మొన్నీమధ్యే తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పటికే ఆ రాష్ట్ర మంత్రిగా ఉన్న ఉదయనిధి.. తన తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకుని రాష్ట్ర పగ్గాలను పూర్తిగా చేతుల్లోకి తీసుకునేందుకు వీలుగా.. ముందుగా ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. ద్రవిడ మున్నేట్ర కళగం (డీఎంకే) పార్టీని స్థాపించిన ఎం.కె. కరుణానిధి ముందుగా తన వారసుడిగా స్టాలిన్‌ను ఎంపిక చేసుకున్నారు. అళగిరి కూడా తన కుమారుడే అయినప్పటికీ, ఆయన్ను పక్కన పెట్టి రాష్ట్ర రాజకీయాలకు స్టాలిన్‌ను, జాతీయ స్థాయి రాజకీయాలకు తన కుమార్తె కనిమొళిని కరుణానిధి ఎంపిక చేశారు. అనుకున్నట్లే స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రి అవ్వగా, కనిమొళి లోక్‌సభ సభ్యురాలిగా తమ పార్టీకి పార్లమెంటులో తగిన గుర్తింపు తీసుకొస్తున్నారు. రెండు కొండల వెనక ఉదయిస్తున్న సూర్యుడు ఆ పార్టీ గుర్తు. అలాంటి రెండు దిగ్గజ నాయకుల మధ్య నుంచి ఉదయనిధి ఇప్పుడు ఉదయిస్తున్న సూర్యుడిలా ముందుకొచ్చారు. నిజానికి 2022లోనే ఉదయనిధి స్టాలిన్‌ను 46 ఏళ్ల వయసులో ఉండగా మంత్రివర్గంలోకి స్టాలిన్ తీసుకున్నారు. అప్పుడే తమిళనాట డీఎంకే రాజకీయ వారసత్వానికి మొదటి అడుగు పడినట్లయింది. 2009 నుంచి 2011 వరకు స్టాలిన్ కూడా తన తండ్రి ఎం.కె.కరుణానిధి దగ్గర ఉప ముఖ్యమంత్రిగా పనిచేసి, ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన విషయం తెలిసిందే. దాంతో ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ కూడా రేపో మాపో తమిళనాడు ముఖ్యమంత్రి పగ్గాలు చేపడతారన్న ఊహాగానాలు అక్కడ మొదలయ్యాయి. కరుణానిధి సినిమాల్లో రచయితగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తే, ఆయన మనవడు అయిన ఉదయనిధి తమిళ సినిమాల్లో హీరోగా చేశారు. అందులో కూడా తమ ద్రవిడ వాదాన్ని వీలైనంతవరకు ప్రచారం చేయడానికి ప్రయత్నించినట్లే అనిపిస్తుంది.
స్టాలిన్, ఉదయనిధి ఈ ఇద్దరూ రాజకీయాల్లోకి రంగప్రవేశం చేసిన తీరు మాత్రం కొంత విభిన్నంగా అనిపిస్తుంటుంది. దాదాపు రెండు దశాబ్దాల పాటు కేవలం రాజకీయాలను దూరం నుంచి మాత్రమే పరిశీలిస్తూ వచ్చిన స్టాలిన్.. ఆ తర్వాత డీఎంకే యువజన విభాగాన్ని స్థాపించారు. తర్వాత చెన్నై నగరానికి మేయర్ అయ్యారు. ఆ తర్వాత తన తండ్రి మంత్రివర్గంలో చేరి, ఆపై ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. ఇక ఉదయనిధి విషయానికొస్తే, ఆయన తొలుత తమిళ సినీ పరిశ్రమలో నిర్మాతగా, నటుడిగా రంగప్రవేశం చేసి అక్కడ తనను తాను నిరూపించుకున్నారు. తర్వాత పార్టీలోకి ప్రవేశించగానే యువజన విభాగాన్ని బాగా బలోపేతం చేశారు. యువతను పెద్ద సంఖ్యలో తమ పార్టీలోకి తీసుకొచ్చారు. 2026లో ఆ రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా యువతతో ప్రచారపర్వాన్ని వేడెక్కించేందుకు సిద్ధంగా ఉన్నారు. నేరుగా రాష్ట్ర మంత్రివర్గంలో బెర్తు సంపాదించి, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి కూడా అయ్యారు. మరోవైపు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆరోగ్యం అంతంతమాత్రంగానే ఉందన్న మాట వినిపిస్తోంది. ఆయన తీవ్ర అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారని, అందుకే ముందుగానే తన రాజకీయ వారసుడిని అన్నిరకాలుగా సిద్ధం చేస్తున్నారని అంటున్నారు. తమిళనాడులో రెండో ప్రధాన పక్షమైన అన్నాడీఎంకే ఇప్పట్లో కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు. జయలలిత లాంటి అగ్రశ్రేణి నాయకత్వం ఇప్పుడు ఆ పార్టీలో కొరవడింది. అంతకుముందు ఒక్క 2011-21 మధ్య మినహా తమిళనాడులో ఎప్పుడు చూసినా డీఎంకే, అన్నా డీఎంకే వరుసగా ఒకరి తర్వాత ఒకరు అధికార పగ్గాలు చేపడుతూ ఉండేవారు. ఇక ఉదయనిధి యువతను భారీస్థాయిలో పార్టీలోకి తీసుకురాగలిగితే ఇప్పట్లో ఇక అన్నాడీఎంకే మళ్లీ కోలుకునే అవకాశం ఉండకపోవచ్చన్నది అక్కడి రాజకీయ పండితుల మాట.
కన్నడనాట గౌడలు..
కర్ణాటకలో మాజీ ప్రధానమంత్రి హెచ్‌డీ దేవెగౌడ కుటుంబం ఒకవైపు, యడ్యూరప్ప కుటుంబం మరొకవైపు రాజకీయాలు నడిపిస్తున్నాయి. దేవెగౌడ కుమారులు ఇద్దరు హెచ్‌డీ కుమారస్వామి, హెచ్‌డీ రేవణ్ణ ఇద్దరూ రాజకీయాల్లో చురుగ్గానే ఉన్నారు. వారిలో కుమారస్వామి కేంద్రమంత్రిగా కూడా వ్యవహరిస్తున్నారు. ఆయన ఇప్పటికే రెండుసార్లు కర్ణాటక ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. ఇక యడ్యూరప్ప కుటుంబంలో ఆయన కుమారుడు రాఘవేంద్ర ఇప్పటికే రాజకీయాల్లోకి ప్రవేశించారు. తన తండ్రిలా ముఖ్యమంత్రి స్థాయికి ఇంకా ఎదగకపోయినా, తాను సైతం వారసుడినేనని చెప్పకనే చెబుతున్నారు. గాలి జనార్దనరెడ్డి, ఆయన కుటుంబం, మిత్రులు అందరూ కూడా కర్ణాటక రాజకీయాలపై తమవంతు ప్రభావం చూపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఏపీ, తెలంగాణలో అన్ని పార్టీల్లోనూ…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక్కటిగా ఉన్నప్పుడు గానీ, విడిపోయిన తర్వాత గానీ ఎలా చూసుకున్నా వారసత్వ రాజకీయాలు ప్రస్ఫుటంగా కనిపిస్తూనే ఉంటాయి. తెలంగాణలో కొండా వెంకట రంగారెడ్డి ప్రముఖ నాయకుడిగా ఉండేవారు. ఆయన మేనల్లుడే మర్రి చెన్నారెడ్డి. చెన్నారెడ్డి కుమారుడు మర్రి శశిధర్ రెడ్డి కూడా రాజకీయాల్లోకి ప్రవేశించారు గానీ, తండ్రి స్థాయికి ఎదగలేకపోయారు. రంగారెడ్డి మనవడు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పారిశ్రామికవేత్తగా ఉంటూ.. 2013లో కేసీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చారు. 2014లో టీఆర్ఎస్ తరఫున చేవెళ్ల లోక్‌సభ స్థానానికి పోటీచేసి గెలిచారు. 2019లో మాత్రం అదే స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీచేసి ఓడిపోయారు. తిరిగి 20224లో బీజేపీ నుంచి పోటీ చేసి అక్కడే గెలిచారు. ఇక కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత ఎంపీగా, ఎమ్మెల్సీగా చేశారు. కుమారుడు కల్వకుంట్ల తారక రామారావు రాష్ట్ర మంత్రిగా ఉంటూ కేబినెట్‌లో నెంబర్ 2గా వ్యవహరించారు. మేనల్లుడు తన్నీరు హరీష్‌రావు మాస్ లీడర్‌గా పేరుపొంది సిద్దిపేటను తన కంచుకోటగా మార్చుకున్నారు. నందమూరి తారక రామారావు సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన కుమారుడు బాలకృష్ణ కూడా పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అల్లుడు నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రంలోను, విభజిత రాష్ట్రంలోనూ ముఖ్యమంత్రిగా చేశారు. చంద్రబాబు తన వారసుడిగా లోకేశ్‌ను తీర్చిదిద్దే పనిలో ఉన్నారు. లోకేశ్ ఇప్పటికి రెండు సార్లు మంత్రిపదవి చేపట్టారు. ఈసారి మాత్రం ఎన్నికలకు ముందు యువగళం (Yuvagalam padayatra) పేరుతో పాదయాత్ర చేసి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంలో కీలకపాత్ర పోషించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో రెండుసార్లు ముఖ్యమంత్రిగా చేశారు. ఆయన మరణానంతరం వైఎస్ఆర్‌సీపీ పార్టీని స్థాపించిన ఆయన కుమారుడు జగన్‌మోహన్ రెడ్డి ఒకసారి ప్రతిపక్ష నాయకుడిగా, మరోసారి ముఖ్యమంత్రిగా విభజిత రాష్ట్రంలో వ్యవహరించారు. నాదెండ్ల భాస్కరరావు ఉమ్మడి రాష్ట్రంలో ఒకసారి ముఖ్యమంత్రిగా వ్యవహరించగా, ఆయన కుమారుడు నాదెండ్ల మనోహర్ గతంలో ఒకసారి స్పీకర్‌గాను, ప్రస్తుతం మంత్రిగాను చేస్తున్నారు. దుద్దిళ్ల శ్రీపాదరావు 1991 నుంచి 1995 వరకు ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీకి స్పీకర్‌గా వ్యవహరించారు. నక్సలైట్ల దాడిలో ఆయన ప్రాణాలు కోల్పోయిన తర్వాత ఆయన కుమారుడు శ్రీధర్ బాబు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ తాజా మంత్రివర్గంలో ఐటీ శాఖ మంత్రిగా మంచి పనితీరు కనబరుస్తున్నారు. పటోళ్ల ఇంద్రారెడ్డి హఠాన్మరణం తర్వాత ఆయన భార్య సబితా ఇంద్రారెడ్డి అనూహ్యంగా రాజకీయ రంగప్రవేశం చేశారు. తొలుత కాంగ్రెస్ పార్టీలోను, తర్వాత టీఆర్ఎస్‌లోను చేరి, మంత్రిగా కూడా పనిచేశారు. కె. కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మి ప్రస్తుతం హైదరాబాద్ నగర మేయర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వారసుల గురించి చెప్పుకోవాలంటే ఆ జాబితా అనంతంగా కొనసాగుతూనే ఉంటుంది.
అయితే, ఇటు తెలంగాణలో గానీ, అటు ఆంధ్రప్రదేశ్‌లో గానీ రాజకీయ వారసులు ఎంతవరకు విజయాలు సాధించారా అని చూస్తే మాత్రం పూర్తిగా చెప్పలేని పరిస్థితి. చంద్రబాబు తన వారసుడిగా లోకేశ్‌ను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నా, ఆయన సుదీర్ఘకాలం తర్వాత ఇప్పుడిప్పుడే కొంతవరకు రాజకీయ భాషను ఒంటబట్టించుకుంటున్నారు. పాదయాత్ర పుణ్యమాని పూర్తిస్థాయిలో జనాల్లోకి వెళ్లారు. అంతకుముందు తాను పోటీచేసి ఓడిపోయిన మంగళగిరిలోనే ఈసారి నెగ్గి రాచమార్గంలో అసెంబ్లీలోకి ప్రవేశించారు. ఇంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన లోకేశ్‌ను ఎమ్మెల్సీగా చేసి మంత్రివర్గంలోకి తీసుకున్నారన్న అపప్రథ ఉండేది. ఇప్పుడు మాత్రం ఆ ముద్రను కొంతమేర చెరిపేసుకోగలిగారు. అయినా, తెలంగాణలో గత ముఖ్యమంత్రి కేసీఆర్ వారసుడిగా కేటీఆర్ ఎదిగిన తీరుతో పోలిస్తే లోకేశ్ ఇంకా ఆ స్థాయిని అందుకోవాల్సి ఉందనే పరిశీలకులు చెబుతున్నారు. బీఆర్ఎస్ ఈసారి కూడా అధికారంలోకి వస్తే.. కేటీఆర్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కూడా లేకపోలేవన్నది ఎన్నికలకు ముందు చాలామంది అనుకున్న మాట. అయితే మొత్తం ఫలితాలే తలకిందులు కావడంతో ఇక ఆ ప్రస్తావన అన్నదే రాలేదు.
ఒడిశాలో పట్నాయక్..
బిజూ పట్నాయక్ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన నవీన్ పట్నాయక్ చాలా కాలం పాటు ఒడిశా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఒక్క చివరి విడతలో తప్ప ఆయన పరిపాలన విషయంలో ఒక్క మచ్చ కూడా పడలేదు. జాతీయ క్రీడ అయిన హాకీని పూర్తిస్థాయిలో ప్రోత్సహించిన ఏకైక ముఖ్యమంత్రిగా నవీన్ పట్నాయక్ మంచి మార్కులే సంపాదించారు. అత్యంత సామాన్యంగా కనిపిస్తూ రాష్ట్రాన్ని కొంతమేర అభివృద్ధిలోకి తీసుకొచ్చారని చెబుతారు. అయితే కొంతమంది ఉన్నతాధికారులు, మంత్రుల నడవడిక కారణంగా ఈసారి జరిగిన ఎన్నికల్లో ఆయన అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది. అక్కడ బీజేపీ అధికారపగ్గాలు చేపట్టింది.
ఊమెన్ చాందీ వారసుడిగా చాందీ ఊమెన్
కేరళలోనూ వారసత్వాలకు కొదవేమీ లేదు. ఏకబిగిన వరుసగా 11 సార్లు పుత్తుపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నికైన ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ మరణానంతరం ఆయన కుమారుడు చాందీ ఊమెన్ ఉప ఎన్నికల్లో అక్కడ గెలిచారు. సీనియర్ నాయకుడు కె.కరుణాకరన్ కుమారుడు కె. మురళీధరన్, మాజీ ముఖ్యమంత్రి సీహెచ్ మహ్మద్ కోయా కుమారుడు ఎంకే మునీర్, కేరళ కాంగ్రెస్ (బి) పార్టీ నాయకుడు ఆర్. బాలకృష్ణ పిళ్లై కుమారుడు కేబీ గణేశ్ కుమార్ లాంటివాళ్లు ఎందరో అక్కడ రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకోవడానికి ఎన్నికల బరిలోకి దిగారు.
మన దేశంలో రాజకీయాలంటే డబ్బుతో ముడిపడి ఉన్న విషయమని అందరికీ తెలుసు. వారసులు ప్రధానంగా రాజకీయాల్లోకి రావడానికి, ఇక్కడ విజయాలు సాధించడానికి కూడా ఈ డబ్బు ఎంతో ఉపయోగపడుతోంది. అయితే, సొంతంగా సరుకు ఉంటే తప్ప రాజకీయాల్లో రాణించడం మాత్రం అంత సులభం కాదు. చెట్టుపేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే రకాలు ఎంతోకాలం మనుగడ సాధించలేవు. ఒకటి లేదా రెండు సార్లు మాత్రం తల్లిదండ్రులకు ఉండే మంచిపేరు దృష్ట్యా ఎలాగోలా నెగ్గుకొచ్చినా.. ఆ తర్వాత మాత్రం బొక్కబోర్లా పడక తప్పదన్నది చాలామంది విషయంలో ఇప్పటికే రుజువైంది. మొదట అడుగు పెట్టడానికి వారసత్వం అనేదాన్ని ఉపయోగించుకున్నా, ఆ తర్వాత ప్రజారంజక విధానాలు పాటించడం, ప్రజలందరితో మమేకం కావడం, మాస్ లీడర్ అనే ముద్ర సంపాదించడం, అందరికీ అందుబాటులో ఉండడం, ఆయనకు ఒక్క ఫోన్ చేసినా మెసేజ్ పెట్టినా పని అయిపోతుంది అనే నమ్మకాన్ని ప్రజల్లో కల్పించడం.. ఇలాంటివాటి ద్వారా మాత్రమే నాయకత్వ స్థానాన్ని నిలబెట్టుకోగలరు.
సమయం కాలం-సమయమంత్రి చంద్రశేఖర శర్మ