దుర్గాపూజ , దీపావళి మరియు ఛత్ పూజల సందర్భంగా 6556 ప్రత్యేక రైళ్లను నడుపనున్న భారతీయ రైల్వేలు
• పండుగ సీజన్‌లో 771 ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే
భారతీయ రైల్వేలు అక్టోబర్ 6 , 2024 నాటికి దుర్గాపూజ , దీపావళి మరియు ఛత్ పూజల సమయంలో ప్రయాణీకుల సౌకర్యం కోసం ఈ ఏడాది అక్టోబర్ 1 నుండి నవంబర్ 30 వరకు 6556 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించినది. ప్రతి సంవత్సరం పండుగల సమయంలో ప్రత్యేక రైళ్లు నడుపుతారు మరియు ఈ సంవత్సరం ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా రైళ్ల సంఖ్యను గణనీయంగా పెంచడమైనది.
దుర్గాపూజ , దీపావళి, ఛత్ పండుగల సందర్భంగా దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగించడం గమనార్హం. ఈ సంధర్భంగా భారతీయ రైల్వే ప్రయాణికులకు అనుకూలమైన మరియు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడానికి, ఈ సంవత్సరం మళ్లీ ప్రత్యేక రైళ్లను నడపడానికి సిద్ధం చేసింది. రాబోయే రెండు నెలల్లో, ఈ ప్రత్యేక రైళ్లు ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు సజావుగా చేరుకునేలా ఏర్పాటులు చేస్తాయి. భారతీయ రైల్వేలు గత సంవత్సరం మొత్తం 4429 పండుగ ప్రత్యేక రైళ్లను సమర్ధవంతగా నడిపి మిలియన్ల మంది ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కలుగజేసింది.
దక్షిణ మధ్య రైల్వే అదేవిధంగా ఈ పండుగ సీజన్‌లో ప్రయాణికుల అదనపు రద్దీని సులభతరం చేయడానికి కూడా విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. 771 ప్రత్యేక రైళ్లను నడపడానికి ప్రణాళిక చేయబడింది మరియు డిమాండ్‌కు అనుగుణంగా సీజన్‌లో మరిన్ని రిజర్వ్‌డ్ మరియు అన్‌రిజర్వ్‌డ్ ( జనసాధరన్ ) ప్రత్యేక రైళ్లను నడపడానికి ఏర్పాట్లు చేస్తోంది. దక్షిణ మధ్య రైల్వే కాకినాడ, తిరుపతి , విశాఖపట్నం, నాగర్‌సోల్ , మాల్దా టౌన్, గోరఖ్‌పూర్, దానాపూర్ , రక్సాల్ , నిజాముద్దీన్ , బెర్హంపూర్, హౌరా మొదలైన ప్రసిద్ధ మార్గాలలో ప్రత్యేక రైళ్లను నడుపుతోంది .
దుర్గాపూజ , దీపావళి, ఛత్ పూజ కోసం దేశం నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రయాణిస్తారు . ఈ పండుగలు దేశంలోని ప్రజలకు మతపరమైన ప్రాముఖ్యతతో పాటు వారి కుటుంబాలతో తిరిగి కలిసే ముఖ్యమైన అవకాశాన్ని కూడా అందిస్తాయి. పండుగల సీజన్‌లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండడంతో చాలా రైళ్లలో తమ టిక్కెట్లు రెండు మూడు నెలల ముందుగానే వెయిటింగ్ లిస్ట్‌లోకి వెళ్లిపోతున్నాయి. భారతీయ రైల్వే దీనిని పరిష్కరించడానికి, ఈ సంవత్సరం పండుగ సీజన్‌లో మరోసారి ప్రత్యేక రైళ్లను నడుపుతోంది.