Friday, September 20, 2024
HomeNewsExams: ఈ టిప్స్ తో పదో తరగతి విద్యార్థులు హ్యాపీగా ఎగ్జామ్స్ రాయచ్చు

Exams: ఈ టిప్స్ తో పదో తరగతి విద్యార్థులు హ్యాపీగా ఎగ్జామ్స్ రాయచ్చు


పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు పరీక్షల భయం పట్టుకుంది. తల్లిదండ్రులు, విద్యార్థులకు మానసిక ధైర్యాన్ని ఇచ్చి ఈ భయాన్ని వారిలో పోగొట్టాలని నిపుణులు చెబుతున్నారు. ప్రణాళికాబద్ధంగా చదువుకోవాలని, క్రమశిక్షణతో పరీక్షలు రాసి రావాలని మాత్రమే విద్యార్థులకు చెప్పాలంతే కానీ పరీక్షలు పిల్లలు ఎలా రాస్తారో అని తాము టెన్షన్ పడుతున్నట్టు తల్లిదండ్రులు చెప్పరాదంటున్నారు. ఇలా చేస్తే పిల్లల్లో మానసిక ఒత్తిడి మరింత పెరుగుతుందంటున్నారు.

- Advertisement -

ఒత్తిడికి దూరంగా..
ఒకవేళ విద్యార్థులు భయానికి గురైతే పరీక్ష రాసేటప్పుడు చదివినదంతా మరిచిపోయే ప్రమాదం ఉంది. ఈ భయం కారణంగా విద్యార్థులు గందరగోళంతో కూడిన జవాబులు రాసే అవకాశాలే అధికం. కాబట్టి భయానికి చెక్ పెట్టాలంటే ముందు తల్లిదండ్రులు విద్యార్థులకు కావాల్సిన ధైర్యాన్ని నూరిపోయాలి. వారి మీద ఎక్కువ ఒత్తిడి పెట్టకూడదు. విద్యార్థులు ఒత్తిడికి గురైతే దాని ప్రభావం వారి ఆరోగ్యంపైనా కనిపిస్తుంది. పరీక్షల సమయంలో జ్వరం ,వాంతులు వంటి అనారోగ్యం కలిగితే విద్యార్థులు పరీక్షల్లో బాగా రాయలేకపోతారు. కాబట్టి పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులను ఒత్తిడికి దూరంగా ఉంచాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీదే ఉంది.
ప్రణాళిక ప్రకారమే అంతా..
అటు విద్యార్థులు సైతం తమకు తాము ధైర్యం చెప్పుకొని పరీక్షలు బాగా రాస్తామనే నమ్మకంతో ప్రిపేర్ అవ్వాలి. విద్యార్థుల ఒత్తిడిని తగ్గించడానికి రోజూ పది నిమిషాలు ధ్యానం చేయడం మంచిది. కొందరు విద్యార్థులు రాత్రింబవళ్లు నిద్రపోకుండా చదువుతారు. గంటల తరబడి చదవడం, ప్రణాళిక లేకపోవడం వంటివి తీరా పరీక్ష రాసే సమయంలో విద్యార్థుల జ్ఞాపకశక్తికి పరీక్ష పెడతాయి. సరైన విశ్రాంతి లేకపోతే చదివినవి కూడా మర్చి పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదువుకోవాలి. అలాగే ప్రతి గంటకూ కాస్త విశ్రాంతి ఇవ్వాలి. ఎంత చదివామన్నది ముఖ్యం కాదు, ఎలా చదివామన్నదే ముఖ్యం. పరీక్షల సమయంలో మేడపై చదవడం, ప్రెండ్స్ దగ్గరికి నోట్స్‌కని, బుక్స్‌కని వెళ్ళి ఎండలో తిరగడం చేయకూడదు. కొత్త విషయాలు నేర్చుకునే ప్రయత్నం చేయరాదు. కేవలం ఇప్పుడు రివిజన్ మాత్రమే చేయాలి.

టైం సెన్స్ ఉండాల్సిందే ..ప్రిన్సిపల్ లక్ష్మణరావు
ఇది వరకు చదవని ప్రశ్నలు నేర్చుకునే ప్రయత్నం చేయవద్దు. సెల్‌ఫోన్ వాడటం మానేయాలి. ప్రెండ్స్‌తో చర్చ వద్దు. పరీక్షల గురించి, నేర్చుకున్న ప్రశ్నల గురించి మాట్లాడవద్దు. ప్రతి రోజు ఒక పద్దతి ప్రకారం చదవటం, చదువు మీద ఇష్టాన్ని పెంపొందించుకోవటం, చదివే పాఠాలన్ని ఇష్ట పడటం చేస్తే తప్పక ఏకాగ్రత కుదురుతుంది. అప్పుడు చదివిన సబ్జెక్టు తప్పక గుర్తుంటుంది. ఒక పక్కా ప్లాన్ ప్రకారం పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు సమయాన్ని బట్టి సన్నద్దమవ్వాలి. ప్రత్యేక ప్రణాళికతో వ్యవహరించాలి. ఎలా ఎదుర్కొవాలి, ఎలా రాయాలి, మార్కులు ఉలా సంపాదించాలనే అంశాలపై దృష్టి సారించాలి. తెలుగు, హిందీ, ఆంగ్లం, గణితం, సాంఘిక, సామాన్యశాస్త్రం, ఇలా అన్ని సబ్జెక్ట్‌లకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఒక టైం టేబుల్ అంటూ లేకుండా సమయాన్ని చక్కగా వినియోగించుకోవటం ఏ విద్యార్థికి అయినా కష్టమైన పనే.

ప్రిన్సిపల్, లక్మణ రావు

పోష్టికాహారం ఇవ్వండి.. గోపాల్ రెడ్డి, గణిత శాస్త్ర ఉపాధ్యాయులు
ముందుగా ఎన్నింటికి లేవాలో ఖచ్చితంగా నిర్ణయించుకోవాలి. రాత్రి 10 గంటల కల్లా నిద్ర పోయి, తెల్లవారు జామున చదువుకోవటం ఉత్తమం. రోజంతా తాజాగా ఉండాలంటే రాత్రి వేళ గాఢ నిద్ర అత్యంత అవసరం. ఆహారంలో ఆయిల్ ఫుడ్ లేకుండా జాగ్రత్తలు తీసుకోవటం వల్ల అలసిపోయే అవకాశం ఉండదు.
పరీక్షల సమయంలో చాలా మంది విద్యార్థులు సరైన ఆహారం తీసుకోరు. కొంత మంది అసలు ఆహారమే తీసుకోరు. ఇది ప్రమాదకరం. తల్లిదండ్రులు విద్యార్థుల ఆహారం విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపించాలి. మంచినీరు ఎక్కువగా తాగాలి. రోజూ కొబ్బరిబోండాం నీరు తాగించడం మంచిది. కాఫీ, టీలు తగ్గించి మజ్జిగ, పళ్ళరసాలు, బలమైన ఆహారం ఇవ్వాలి. శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడే మెదడు కూడా ఆరోగ్యంగా పనిచేస్తుంది. సరైన నిద్ర, పౌష్టికాహారం, ప్రణాళికా బద్ధమైన రివిజన్ విద్యార్థులు చేసేలా తల్లిదండ్రులు చూసుకోవాలి.

మ్యాథ్స్ టీచర్, గోపాల్ రెడ్డి

అరగంట ముందే సెంటర్ దగ్గర.. మండల విద్యాధికారి బండి కృష్ణ
ఇక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు పరీక్షల రోజుల్లో అరగంట ముందు పరీక్ష కేంద్రానికి చేరుకోవడం ఉత్తమం. తెలంగాణా రాష్ట్రంలో గతంలో ఉన్న ఒక్క నిముషం నిబంధన సడలించి 5 నిముషాల వరకు అవకాశం ఇచ్చారు కాబట్టి లేట్ కాకుండా అరగంట ముందే పరీక్షా కేంద్రానికి వెళ్ళటం మంచిది. పరీక్ష హాల్‌కు దూరంగా ఉన్న వారు గంట ముందుగా బయలుదేరడం శ్రేయస్కరం.పరీక్షా కేంద్రానికి వాటర్ బాటిల్ ఇచ్చి పంపించటం తల్లిదండ్రులు మర్చిపోకూడదు. ఇన్విజిలేటర్‌తో తప్ప పరీక్ష హాల్‌లో విద్యార్థులు ఎవరితోనూ మాట్లాడవద్దు. ఒకటికి రెండు సార్లు హాల్‌టిక్కెట్ నెంబర్ సరిచూసుకోవాలి. తలపక్కకి తిప్పకుండా సమాధానాలు రాయడం మంచిది. ఎవరెన్ని అడిషనల్ షీట్లు రాస్తున్నారు అని గమనించి ఆందోళన చెందవద్దు. వీలైనంత వరకు ఏ ప్రశ్నలు బాగా రాయగలరో వాటినే ముందుగా రాయడానికి ప్రయత్నించాలి. దిద్దుబాటులు లేకుండా టైం అయ్యే వరకు పరీక్ష హాల్ నుంచి బయటకి రాకపోవడం మంచిది.

బండి కృష్ణ MEO

జాగ్రత్తగా, నీట్ గా రాయాలి..మానయ్య, తెలుగు భాషా ఉపాధ్యాయులు
అవసరమైన పెన్నులు, పెన్సిళ్ళు మర్చిపోకుండా పరీక్షలకు వెంట తీసుకెళ్లాలి. పరీక్ష రాసే విద్యార్థులు పరీక్ష హాల్లో ప్రశ్నాపత్రాలను జాగ్రత్తగా చదివి సమాధానాలు రాయాలి. సమాధానాలు రాసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అక్షరాలను గుండ్రంగా రాయాలి. అక్షర దోషాలు ఉండకూడదు. ఎక్కడా కొట్టి వేతలు, దిద్దు బాట్లు ఉండకూడదు. ఒక క్రమ పద్దతిలో సమాధానాలు రాయాలి.సమాధాన పత్రాలు కరెక్షన్ చేసే అధ్యాపకులకి ఏ ప్రశ్నకి ఏ సమాధానం రాశారో అర్ధమయ్యేలా నీటుగా పొందుపర్చాలి. పెన్నులతో పాటు, స్కెచ్ పెన్నులు ఉపయోగించడం ద్వారా సమాధాన పత్రాలు ఆకర్షణీయంగా కనబడుతాయి.

మానయ్య సర్, ఎన్సీసీ కమాండర్
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News