Friday, October 11, 2024
Homeఓపన్ పేజ్New BJP in new year: కొత్త సంవత్సరంలో సరికొత్త బీజేపీ!

New BJP in new year: కొత్త సంవత్సరంలో సరికొత్త బీజేపీ!

జనవరి నుంచి సంస్థాగతంగా భారీ మార్పులు, చేర్పులు చేపట్టే ఆలోచనలో బీజేపీ ఉంది. దేశ ప్రజల ముందు సరికొత్త బీజేపీని ప్రవేశపెట్టేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయి. గత మేలో జరిగిన లోక్‌ సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 400 స్థానాలు సంపాదించ లేకపోవడంతో పార్టీ అధిష్ఠానంలో ఆత్మ పరిశీలన ప్రారంభమైంది. మొదటగా, పార్టీని మరింత దూకుడుగా, బలంగా ముందుకు నడిపించగలిగిన నాయకుడి అవసరాన్ని పార్టీ గుర్తించింది. ప్రస్తుతం పార్టీకి అధ్యక్షుడుగా ఉన్న జె.పి. నడ్డా పదవీ కాలం గత జూన్‌ నెలలోనే ముగిసింది. అయితే, ఆయన స్థానంలో మరొకరిని కూర్చోబెట్టడం ఇష్టం లేక పార్టీ అధిష్ఠానం ఆయననే ఆ పదవిలో కొనసాగిస్తోంది. ప్రస్తుతం ఆయన కేంద్ర మంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తూనే పార్టీ మధ్యంతర అధ్యక్షుడుగా కూడా కొనసాగుతున్నారు. ప్రస్తుతానికి ‘ఆయన తప్పితే గత్యంతరం లేదు’ అనే పరిస్థితి కొనసాగుతున్నప్పటికీ, పార్టీలో నిర్ణయరాహిత్యం చోటు చేసుకుంటోందనే అభిప్రాయం కార్యకర్తల్లో, పార్టీ అభిమానుల్లో కలగకుండా ఉండడానికి పార్టీ వెంటనే ఈ ఖాళీని భర్తీ చేయాల్సి ఉంటుంది.
నిజానికి ప్రపంచంలో అతి పెద్ద పార్టీ అయిన బీజేపీలో ముఖ్యమంత్రులకు, ఎంపీలకు, ఎమ్యెల్యే లకు కొదువ లేదు. అయితే, ప్రస్తుతం ప్రతిభకు మాత్రం కొరత ఏర్పడింది. చాలా కాలంగా అధి కారంలో ఉన్నందువల్ల పాలనాదక్షుల సంఖ్య పెరుగుతూనే ఉంది. విచిత్రమేమిటంటే, బీజేపీ ప్రతి పక్షంలో ఉన్నంత కాలం పార్టీ అధ్యక్షులకు కొరత కనిపించలేదు. వాజ్‌ పేయీ, అద్వానీలతో సరి తూగగల అధ్యక్ష అభ్యర్థులు కూడా కనిపించారు. వచ్చే ఏడాది జనవరిలో పార్టీకి 12వ అధ్యక్షుడి కోసం ఎన్నికలు జరగబోతున్న సమయంలో ఈ అధ్యక్ష పదవికి కొందరు నాయకుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మొత్తానికి నడ్డాకు ప్రత్యామ్నాయాన్ని కనుగొనడం జరుగుతుంది. ఇప్పటికే పార్టీ వర్గాల్లో వినిపిస్తున్న పేర్లు శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, దేవేంద్ర ఫడ్నవీస్‌, వసుంధరా రాజే సింధియా, ధర్మేంద్ర ప్రధాన్‌, భూపేందర్‌ యాదవ్‌, సునీల్‌ బన్సల్‌.
శివరాజ్‌ కు అవకాశం : మధ్యప్రదేశ్‌ కు చెందిన శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (RSS)కు అంకితమైన ఈ 65 ఏళ్ల నాయకుడికే బీజేపీ కొత్త అధ్యక్షుడు కాగల అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వయసు, కులం, విశ్వసనీయత, అనుభవం, ఆమోదయోగ్యత వంటి అంశాలన్నీ ఆయనకు బాగా అనుకూలంగా ఉన్నాయి. ఆర్‌.ఎస్‌.ఎస్‌ నాయకులకు ఎంతో ఇష్టుడు, ఆమోదయోగ్యుడు అయిన చౌహాన్‌ ప్రతిపక్షాలను కూడా కలుపుకునిపోగలిగిన వ్యక్తి. మధ్యప్రదేశ్‌లో అందరూ ప్రేమగా మామా అని పిలిచే చౌహాన్‌ రాష్ట్రంలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి, ఈ రాష్ట్రంలో బీజేపీ ఒక అజేయ శక్తి అనే పరిస్థితి కల్పించారు. ప్రజలకు సర్వకాల సర్వావస్థలా అందుబాటులో ఉండే వ్యక్తిగా కూడా పేరు తెచ్చుకున్నారు. ఆయన తన పాలనలో హిందుత్వకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. 2005లోనే ఆయన ప్రతిభా పాటవాలను, సమర్థతను వాజ్‌ పేయీ, అద్వానీలు గుర్తించి ఆయనను ముఖ్యమంత్రి పదవికి ఎంపిక చేయడం జరిగింది. అయితే, సొంత ఆలోచనలు, స్వతంత్ర భావాలు ఆయనకు ప్రతికూలంగా పనిచేసే అవకాశం ఉంది.
ఇక సుమారు 35 ఏళ్లుగా ఆర్‌.ఎస్‌.ఎస్‌ తో సన్నిహితంగా వ్యవహరిస్తున్న 54 ఏళ్ల దేవేంద్ర ఫడ్నవీస్‌ మహారాష్ట్రలోని నాగపూర్‌ లో అఖిల భారత విద్యార్థి పరిషత్‌ ద్వారా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 2014లో 44 ఏళ్ల వయసులో ఆయన మొదటిసారిగా మహారాష్ట్రలో అధికారం చేపట్టారు. నరేంద్ర మోదీ, అమిత్‌ షాలకు అత్యంత సన్నిహితుడైన ఫడ్నవీస్‌ అతి చిన్న వయసులో ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన నాయకుడు. ఆయన కోసం బీజేపీ అధిష్ఠానం నితిన్‌ గడ్కరీ, గోపీనాథ్‌ ముండే వంటి సీనియర్‌ నాయకులను కూడా పక్కనపెట్టింది. పార్టీలో ఏ వర్గానికీ సంబంధించిన వ్యక్తి కాకపోవడం, పైగా అధిష్టానానికి సన్నిహితం ఉండడం ఆయనకు సానుకూలంగా పనిచేయవచ్చు. అయితే, ఆయనకు జాతీయ స్థాయి గుర్తింపు లేకపోవడం ప్రతి కూలం కావచ్చు. ఆయన మోదీ, షాలకు సన్నిహితుడు కావడం కూడా ఆశించిన స్థాయిలో ఉపయోగపడకపోవచ్చు.
వసుంధరకు చాన్స్‌ :
కాగా, 71 ఏళ్ల వసుంధరా రాజే సింధియా విషయానికి వస్తే, ఆమె ప్రస్తుతం రాజస్థాన్‌ రాజకీయాల్లో అంత చురుకుగా, క్రియాశీలంగా లేకపోవచ్చు కానీ, రాష్ట్రంలోనూ, పార్టీలోనూ ఆమె ప్రాభవం, ప్రాధాన్యం ఏమాత్రం తగ్గలేదు. వరుసగా మూడు సార్లు ఆమె ముఖ్యమంత్రి పదవికి ప్రయత్నించడం, అధిష్ఠానం తిరస్కరించడం జరిగింది. ప్రస్తుతం ఆమె పార్టీ జాతీయ స్థాయి ఉపాధ్యక్షుల్లో ఒకరు. ఆమె తల్లి విజయ రాజే సింధియా కారణంగా ఆమెకు ఇప్పటికీ ఆర్‌.ఎస్‌.ఎస్‌ నాయకత్వ అభిమానం లభిస్తూనే ఉంది. ఆమె కేంద్రంలోనూ, పార్టీలోనూ, రాష్ట్రంలోనూ అనేక కీలక పదవులు నిర్వహించారు. రెండు పర్యాయాలు రాజస్థాన్‌ ముఖ్యమంత్రిగా కూడా పని చేశారు. మంచి వక్త కూడా అయిన వసుంధరా రాజేను దేశ ప్రజలంతా గుర్తిస్తారు. ఆమె గనుక పార్టీ అధ్యక్షురాలైతే బీజేపీకి మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలవుతారు. ఆమె అనుభవం, పాలనా దక్షత, కార్యశూరత్వం అధ్యక్ష పదవికి సరిగ్గా సరిపోతాయి. అయితే, ఆమె ఇంతవరకూ జాతీయ స్థాయి బాధ్యతలను నిర్వర్తించలేదు. పైగా, మోదీ, షాల ద్వయానికి ఆమె చేరువ కాలేక పోయారు.
అఖిల భారత విద్యార్థి పరిషత్తుకు చెందిన 55 ఏళ్ల ధర్మేంద్ర ప్రధాన్‌ ఒడిశాకు చెందిన సీనియర్‌ నాయకుడు. ఒడిశాలోనే కాక, ఢిల్లీలో కూడా ఆయన అనేక ఆర్‌.ఎస్‌.ఎస్‌ కార్యక్రమాల్లో పాల్గొ న్నారు. సిద్ధాంతాలకు కట్టుబడిన వ్యక్తి. జాతీయ స్థాయిలో రాజకీయాలు నెరపగలిగిన వ్యక్తి. జాతీయ స్థాయి పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆయన ఒడిశాతో పాటు, కర్ణాటక, చత్తీస్‌ గఢ్‌, జార్ఖండ్‌, హర్యానా, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో పార్టీ పటిష్ఠతకు, పార్టీ విజయాలకు విశేషంగా కృషి చేసిన నాయకుడు ఆయన. పార్టీలో వాజ్‌ పేయీ, అద్వానీల శకం ముగిసిన తర్వాత మోదీ, షా ద్వయం ఆయనను జాతీయ స్థాయిలో అనేక కీలక పదవులతో ప్రోత్సహించడం జరుగుతోంది. ముఖ్యంగా మొదటి నుంచి ఆయననే పెట్రోలియం మంత్రిత్వ శాఖకు అధిపతిగా ఎంపిక చేయడం జరుగు తోంది. ఆయన పాలనా వ్యవహారాల్లో చేయి తిరిగిన వ్యక్తే అయినప్పటికీ, ఆయనకు జాతీయ స్థాయి లేదని, అందరికీ ఆమోదయోగ్యుడు కాదని పార్టీలోని ఆయన వ్యతిరేకులు ప్రచారం చేస్తున్నారు.
సమూల ప్రక్షాళన
రాజస్థాన్‌ కు చెందిన 55 ఏళ్ల న్యాయవాది భూపేందర్‌ యాదవ్‌ ఆర్‌.ఎస్‌.ఎస్‌ కు సంబంధించిన జాతీయ స్థాయి న్యాయవాదుల సంఘానికి కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. వాజ్‌ పేయీ, అద్వానీ శకంలో ఆయన జాతీయ స్థాయి నాయకుడిగా ఎదిగారు. కాగా, 2010లో ఆయనను నితిన్‌ గడ్కరీ పార్టీ జాతీయ కార్యదర్శిగా ఎంపిక చేశారు. వివాదాలకు అతీతుడైన యాదవ్‌కు అప్పటి నుంచి పార్టీలో అనేక కీలక బాధ్యతలను అప్పగించడం కొనసాగుతూనే ఉంది. 2014లో అమిత్‌ షా పార్టీ అధ్యక్షుడు అయినప్పుడు యాదవ్‌ ఆయన బృందంలో కీలక వ్యక్తిగా వ్యవహరించారు. రాజస్థాన్‌, గుజరాత్‌, చత్తీస్‌ గఢ్‌ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన యాదవ్‌ మహారాష్ట్రలో ఉద్ధవ్‌ థాకరే ప్రభుత్వాన్ని కూలగొట్టడంలో కూడా క్రియాశీలంగా వ్యవహరించడం జరిగింది. అయితే, ప్రచార ఆర్భాటాలకు దూరంగా ఉండే వ్యక్తి. ప్రస్తుతం కేంద్రంలో పర్యావరణం, అడవుల మంత్రిత్వ శాఖను నిర్వహిస్తున్న యాదవ్‌ జాతీయ స్థాయిలో పార్టీ వ్యవహారాలను నిర్వహించలేదని పార్టీ అగ్రనాయకత్వం అభిప్రాయపడుతోంది.
పూర్తి స్థాయి ఆర్‌.ఎస్‌.ఎస్‌ ప్రచారక్‌ గా పనిచేస్తున్న సునీల్‌ బన్సల్‌ ప్రస్తుతం బీజేపీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. సుమారు 55 ఏళ్ల ఈ నాయకుడికి పార్టీ వ్యవహారాల్లో మంచి పట్టు ఉంది. ఉత్తర ప్రదేశ్‌లో లోక్‌ సభ, శాసనసభ ఎన్నికల్లో పార్టీ ఘన విజయాలు సాధించి అధికారంలో రావడానికి ఆయనే ప్రధాన కారకుడు. ఈసారి ఎన్నికల్లో ఆయనకు ఒడిశా బాధ్యతలను అప్పగించడం జరిగింది. ఒడిశాలో బీజేపీ అధికారంలోకి రావడానికి కూడా ఆయనే కారకుడు. 2010-14 సంవత్సరాలకు మధ్య ఆయన ఆర్‌.ఎస్‌.ఎస్‌ తరఫున అవినీతికి వ్యతిరేకంగా యువత అనే ఉద్యమాన్ని నిర్వహించారు. అయితే, ఆయనకు దేశవ్యాప్త ప్రాబల్యం లేదని పార్టీలో ఒక వర్గం భావిస్తోంది.
అధ్యక్షుడిని ఎన్నుకోవడంలో ఆర్‌.ఎస్‌.ఎస్‌ తో పాటు నరేంద్ర మోదీ పాత్ర కూడా కీలకమైంది. వీటో అధికారమంతా వారి చేతుల్లోనే ఉంది. అవసరమైతే మోదీ సీనియర్‌ కేంద్ర మంత్రులతో రాజీనామా చేయించి పార్టీ బాధ్యతలను అప్పగించగలరు. రాజ్‌ నాథ్‌ సింగ్‌, శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, నితిన్‌ గడ్కరీ వంటి సీనియర్‌ నాయకులను సైతం పార్టీ అధ్యక్ష పదవికి ఎంపిక చేయగలరు. వాజ్‌ పేయీ, అద్వానీ, అమిత్‌ షాలు పార్టీ అధ్యక్షులుగా పార్టీ బలోపేతానికి విశేషంగా కృషి చేశారు. పార్టీపై వారు చెరగని ముద్ర వేశారు. అయితే, ఆర్‌.ఎస్‌.ఎస్‌పై ఆధారపడకుండా పార్టీ విజయాలు సాధించగలదనే వ్యాఖ్యలు చేసి నడ్డా పార్టీని ఇబ్బందులపాలు చేశారు. వచ్చే జనవరిలో కొత్త అధ్యక్షుడు ఎన్నికైన తర్వాత నడ్డా వ్యాఖ్యల్లో నిజమెంత అన్నది తేలిపోతుంది.

  • జి. రాజశుక
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News