అది పచ్చని అందాలతో ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న పుణ్యక్షేత్రం. అలాంటి చోట అల్లరి మూకలు చేరి సామాన్యుల పై దాడులకు పాల్పడుతున్నాయి. వీటిని అరికట్టాల్సిన పోలీసులు “మాములు”గా తీసుకుంటున్నట్లు సమాచారం. వరుస దాడులు జరుగుతున్నా వాటిని అరికట్టడంలో పోలీసులు పూర్తిగా విపలమైయ్యారని బాధితులు వాపోతున్నారు.
మహనందిలో దొంగతనాలు జరిగినా కేసులు నమోదు కావు. దాడులు జరిగినా కేసులు నమోదు కావు.. ఒకవేళ కేసులు నమోదైనా నేరస్తులను గుర్తించి న్యాయస్థానం ముందుంచడంలో విఫలమవ్వటం ఇక్కడి ఖాకీలకు షరామామూలు వ్యవహారంగా మారిందనే ఆరోపణలు తారాస్థాయికి చేరాయి.
మహాశివరాత్రి పర్వదినం రోజు అల్లరి మూకలు గణేష్ అనే వ్యక్తి పై దాడి చేసి దారుణంగా గాయపరిచారు. దాడిలో గాయపడిన వ్యక్తి అక్కడే సృహకోల్పోయి పడిపోవడంతో చనిపోయాడనుకొని అల్లరి మూకలు వెళ్లిపోయాయి. గాయపడిన వ్యక్తి మహానంది పోలీసు స్టేషన్లో పిర్యాదు చేశాడు. అక్కడ విధుల్లో ఉండే కానిస్టేబుల్ రక్తం ఎక్కువగా వస్తుంది ఆసుపత్రికి వెళ్ళండి అనే సలహా ఇచ్చి చేతులు దులుపుకోవటం విశేషం. దీంతో చేసేది లేక బాధితులు అక్కడ నుండి నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉండే ఔట్ పోస్ట్ కానిస్టేబుల్ ఫిర్యాదు తీసుకున్నాడు. ఇంత జరిగినా ఇప్పటి వరకు మహానంది పోలీసులు మాత్రం కేసు నమోదు చేయలేదు. మరి ఈ పోలీసులకు తమ విధులు నిర్వహించమని చెప్పాల్సింది ఎవరో, ఎవరు చెబితే ఇక్కడి యంత్రాంగంలో కదలిక వస్తుందన్నది స్థానికులకు అంతుచిక్కటం లేదు.