Thursday, November 21, 2024
HomeNewsRohini School Blast in Delhi: ఢిల్లీ పేలుడు వెనక ఖలీస్థాన్ మద్దతుదారుల హస్తం..!

Rohini School Blast in Delhi: ఢిల్లీ పేలుడు వెనక ఖలీస్థాన్ మద్దతుదారుల హస్తం..!

Delhi Blast| దేశ రాజధాని ఢిల్లీలోని రోహిణి ప్రశాంత్‌ విహార్‌ ప్రాంతంలో సీఆర్పీఎఫ్‌(CRPF) పాఠశాల వద్ద భారీ పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ పేలుడు వెనక ఖలిస్థానీ(Khalistani Terrorists) గ్రూపు హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ‘జస్టిస్‌ లీగ్‌ ఇండియా’ అనే ఖలిస్థానీ అనుకూల గ్రూపు ఈ పేలడుకు బాధ్యత తమదే అని తెలిపినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన మెసేజ్‌లు కొన్ని టెలిగ్రామ్‌ గ్రూపుల్లో ప్రత్యక్షమైనట్లు ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు. దీంతో ఈ గ్రూపులకు సంబంధించిన సమాచారం ఇవ్వాలని టెలిగ్రామ్‌కు ఇప్పటికే అధికారులు లేఖలు రాశారట.

- Advertisement -

ఖలిస్థానీ వేర్పాటువాదుల హత్యకు ప్రతీకారంగా దుండగులు ఈ చర్యను చేపట్టినట్లు పోలీసులు భావిస్తున్నారు. ‘‘కొందరు గూండాలతో భారత నిఘా ఏజెన్సీ మా నోళ్లు మూయించాలని చూస్తే.. ప్రపంచంలో వారి కన్నా మూర్ఖులు ఎవరూ లేరు. మేం వారికి ఎంత దగ్గరగా ఉన్నామో ఏమాత్రం ఊహించలేరు. ఏక్షణమైనా దాడి చేయగల సత్తా మా దగ్గర ఉంది. ఖలిస్థాన్‌ జిందాబాద్‌’’ సందేశాన్ని టెలిగ్రామ్ గ్రూపుల్లో పోస్టు చేశారు. కాగా రిమోట్‌ కంట్రోల్‌, టైమర్‌ వంటివి వాడి పేలుడుకు పాల్పడి ఉండొచ్చనే అనుమానాలున్నాయి.

అయితే పేలుడు సంభవించిన ప్రాంతంలో వైట్ పౌడర్‌ను అధికారులు గుర్తించారు. ప్రస్తుతం దీనిపై ఆరా తీస్తున్నారు. తెల్ల టీషర్ట్‌ ధరించిన ఓ అనుమానితుడిని గుర్తించారు. పేలుడు జరగడానికి ముందు రోజు రాత్రి ఆ ప్రాంతంలో సంచరించినట్లు గుర్తించారు. పాలిథిన్ కవర్‌లో బాంబును తెచ్చి పెట్టినట్లు పోలీసులు తెలిపారు. తమ గురించి ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసేందుకే ఈ పేలుడు జరిపినట్లు అనుమానం వ్యక్తంచేస్తున్నారు.

కాగా ఆదివారం ఉదయం 7:50 గంటలకు జరిగిన ఢిల్లీలో జరిగిన ఈ పేలుడులో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఘటనాస్థలిలో ఫోరెన్సిక్‌ బృందాలు, క్రైమ్, బాంబు స్క్వాడ్‌ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. పాఠశాల సమీపంలోని మట్టి, అక్కడ గుర్తించిన వైట్ పౌడర్‌ నమూనాలనూ ల్యాబ్‌కు పంపించారు. మరోవైపు ఈ పేలుడు ఘటన నేపథ్యంలో ఢిల్లీ నగరమంతా హై అలర్ట్‌ ప్రకటించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News