Deputy CM Pawan Kalyan| మాజీ సీఎం జగన్ ప్యాలెస్‌లు కట్టుకోవడం తప్ప.. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టలేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శించారు. విజయనగరం జిల్లా గుర్ల మండల పరిధిలో ఆయన పర్యటించారు. అక్కడ తాగునీటి పథకాన్ని పరిశీలించడంతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న డయేరియా బాధితులను పరామర్శించారు. అనంతరం గ్రామస్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, డయేరియా వ్యాప్తి కారణాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. చంపావతి నది పరివాహక ప్రాంతాలలో చెత్తా చెదారం పడేస్తున్నారని.. గుర్ల గ్రామంలో బహిరంగ మలవిసర్జన ఎక్కువగా ఉందని పవన్ తెలిపారు.
ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రూ.500 కోట్ల ప్రజాధనంతో రుషికొండలో విలాసవంతమైన భవనాలు కట్టారని.. మారుమూల గ్రామాల్లో మంచినీటి సరఫరాను ఏ మాత్రం పట్టించుకోలేదని మండిపడ్డారు. ముఖ్యంగా 15వ ఆర్థిక సంఘం నిధులను దుర్వినియోగం చేశారని ధ్వజమెత్తారు. గత అయిదేళ్లలో కనీసం ఫిల్టర్స్ కూడా మార్చలేకపోయారన్నారు. గ్రామ పంచాయతీలకు నిధులను విడుదల చేయలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను ఒక్కొక్కటిగా సరిదిద్దుతున్నాయని స్పష్టంచేశారు.
డయేరియా వ్యాధికి గత కారణాలపై విచారణకు సీనియర్ ఐఏఎస్ విజయానంద్‌ను నియమించామని.. విచారణ తర్వాత ప్రభుత్వం తరఫున బాధితులకు పరిహారం ప్రకటిస్తామన్నారు. ఈలోపు మృతుల కుటుంబాలకు వ్యక్తిగతంగా రూ.లక్ష ప్రకటిస్తున్నానని పేర్కొన్నారు. అలాగే పెదపెంకిలో కూడా శానిటేషన్ సమస్య ఉందన్నారు. అక్కడ ఫైలేరియా బాగా పెరిగిందన్నారు. నదుల నీరు కలుషితం కాకుండా చూడాలని.. అది మన బాధ్యత అంటూ పవన్ పేర్కొన్నారు. కాగా గుర్లలో డయేరియా ప్రబలి పలువురు మృతి చెందగా.. 100 మందికి పైగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.