PhonePe| ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) వాడకం రోజురోజుకు ఎక్కువైపోతోంది. దీని వల్ల ఉద్యోగాలకు కోత పడుతున్నాయి. ఎప్పుడు ఎవరి ఉద్యోగం ఊడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే అనేక కంపెనీలు AI టెక్నాలజీని వినియోగించుకుంటూ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. తాజాగా భారతదేశంలోని ప్రముఖ ఫిన్ టెక్ సంస్థ ఫోన్ పే ఈ జాబితాలోకి చేసింది. AI టెక్నాలెజీతో కస్టమర్ కేర్ సపోర్ట్ ఉద్యోగాలకు గుడ్ బై చెప్పింది. గత ఐదేళ్లలో 1,100మంది(60శాతం) ఉద్యోగాలను ఫోన్ పే(PhonePe) తొలగించింది. AI ఆధారిత చాట్ బోట్ల ద్వారా ఆటోమేటెడ్ కస్టమర్ సర్వీసులతో సమర్ధత పెరిగిందని ఫోన్ పే అక్టోబర్ 21న విడుదల చేసిన తన నివేదికలో పేర్కొంది. సంస్థ సపోర్టింగ్ స్టాఫ్ 1100 మంది ఏజెంట్ల నుంచి 400 మందికి పడిపోయిందని వార్షిక నివేదికలో వెల్లడించింది.
తద్వారా కంపెనీ అభివృద్ధి చర్యల్లో భాగంగా నష్టాలను తగ్గించుకుంటూ ఆదాయం పెంచుకుంటోంది. AI పవర్డ్ సొల్యూషన్స్ దిశగా ముందెళ్తున్న ఫోన్‌పే లావాదేవీలు 2018-19 నుంచి 2023-24 మధ్య 40 రెట్లు పెరిగాయి. 2022- 23ఆర్థిక సంవత్సరంలో రూ.3,085కోట్లుగా ఉన్న ఆదాయం 2023- 24లో రూ.5725కోట్లకు చేరుకుందని నివేదించింది. ఇందులో 10 శాతం డిజిటల్ పేమెంట్ సబ్సిడీ రూపంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదాయం వచ్చిందని వివరించింది. మొత్తానికి కృతిమ మేధ సాంకేతికతను ఉపయోగించుకుంటూ ఉద్యోగులను తొలగించి లాభాలు గడిస్తోంది. ఈ విధానం ఓవైపు కంపెనీలకు లాభాదాయకంగా ఉన్నా.. మరోవైపు సామాన్య ఉద్యోగులకు మాత్రం గుదిబండగా మారింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే త్వరలోనే అన్ని కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు ఇంటిబాట పట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కాగా AI టెక్నాలజీ వల్ల ప్రపంచవ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోనున్నారని కొందరు నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా కస్టమర్ సర్వీస్ విభాగంలోని ఉద్యోగులు తమ ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి అధికంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే ఉద్యోగులు నిరాశ పడకుండా తమ రంగంలో AI టెక్నాలజీ నైపుణ్యాలు మెరుగుపర్చుకోవాలని సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల భవిష్యత్‌కు ఎలాంటి ఢోకా ఉండదని చెబుతున్నారు.