దక్షిణ మధ్య రైల్వే ప్రయాణీకుల ప్రయాణ అవసరాలను తీర్చడానికి, పండుగల సీజన్లో ప్రయాణీకుల అదనపు రద్దీని క్లియర్ చేయడానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తుంది. ఈ దిశలో భాగంగాలో దసరా పండుగను దృష్టిలో ఉంచుకుని జోన్ లో అక్టోబరు నెలలో ప్రత్యేక రైలు సర్వీసులను నడిపింది. అలాగే దక్షిణ మధ్య రైల్వే దీపావళి మరియు ఛత్ పూజ కాలంలో ప్రయాణీకుల ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడానికి, అదనపు రద్దీని తీర్చడానికి అదనంగా ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. గత పండుగ సీజన్‌లో జోన్‌లో 626 ప్రత్యేక రైళ్లను నడిపారు. జోన్ ప్రస్తుత సంవత్సరంలో వివిధ గమ్యస్థానాల మధ్య 804 ప్రత్యేక రైలు సేవలను నిర్వహించాలని ప్రణాళిక వేసింది. ఇది మునుపటి సంవత్సరం కంటే 28% అదనం.
ఇతర రాష్ట్రాలకు..
పండుగల సీజన్ దృష్ట్యా పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, జార్ఖండ్, బీహార్ మొదలైన తూర్పు రాష్ట్రాలకు మరియు ఉత్తరప్రదేశ్, హర్యానా, ఢిల్లీ మొదలైన ఉత్తర రాష్ట్రాలకు అధిక డిమాండ్ ఉంటుంది. తదనుగుణంగా ప్రజల డిమాండ్లను తీర్చడానికి ప్రత్యేక రైలు సర్వీసులు దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ప్రధాన స్టేషన్లైన సికింద్రాబాద్ , హైదరాబాద్, కాచిగూడ మొదలైన స్టేషన్ ల నుండి షాలిమార్, రక్సాల్ , జైపూర్, లాల్ఘర్ , హిసార్ , గోరఖ్పూర్, షిర్డీ, దానాపూర్, నిజాముద్దీన్, కటక్, అగర్తల , సంత్రాగచ్చి వంటి ఇతర రాష్ట్రాల్లోని స్టేషన్ల వైపు కూడా ప్రత్యేక రైళ్లు నడపబడుతున్నాయి. మధురై, ఈరోడ్, నాగర్‌కోయిల్, కొల్లాం, బెంగళూరు, పన్వేల్, దాదర్ మొదలైన ఇతర డిమాండ్ గల గమ్యస్థానాలకు కూడా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నారు.
నవంబర్ 30 వరకు..
భారతీయ రైల్వే దీపావళి, ఛత్ పూజల సమయంలో ప్రయాణీకుల కోసం సాఫీగా ప్రయాణించడానికి రైల్వే నెట్‌వర్క్‌లో నవంబర్ 30 వరకు దాదాపు 6556 ప్రత్యేక రైళ్లను నడపడానికి ఏర్పాట్లు చేసింది. ప్రతి సంవత్సరం రైలు ప్రయాణీకుల అవసరాలను తీర్చడానికి క్రమం తప్పకుండా పండుగ సీజన్లలో ముఖ్యమైన సందర్భాలలో ప్రత్యేక రైళ్లను నడుపుతుంది మరియు ఈ సంవత్సరం పెరిగిన ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా రైళ్ల సంఖ్య గణనీయంగా పెంచటం విశేషం.
యాప్ లో టికెట్స్..
ఈ ప్రత్యేక రైళ్లు అన్ని వర్గాల ప్రయాణీకుల అవసరాలను తీర్చడానికి రిజర్వ్డ్ కోచ్ లు మరియు అన్రిజర్వ్డ్ కోచ్లతో నడపడం జరుగుతుంది. ఆన్ రిజర్వ్డ్ కోచ్ల ద్వారా ప్రయాణించేవారి కోసం జనరల్ కౌంటర్ల వద్ద క్యూలో నిలబడకుండా తమ టిక్కెట్లను యూ.టి.ఎస్. మొబైల్ యాప్ ద్వారా కొనుగోలుచేసుకొనే అవకాశం ఏర్పాటు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే సూచించింది.
డిమాండ్ కు తగ్గట్టు..
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ జోన్ ప్రజల డిమాండ్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు, ప్రయాణికుల అవసరాలను తీర్చడానికి వ్యూహాత్మకంగా ప్రత్యేక రైళ్లను నడపడానికి ప్రణాళికా సిద్ధం చేసినట్లు తెలిపారు. జోన్ అందించిన అదనపు ప్రయాణ సౌకర్యాన్ని రైలు వినియోగదారులు ఉపయోగించుకోవాలని, వారి ప్రయాణాన్ని సురక్షితంగా, సౌకర్యవంతంగా, ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.