Saturday, November 23, 2024
Homeఓపన్ పేజ్Human existence: ప్రమాదంలో మానవ మనుగడ

Human existence: ప్రమాదంలో మానవ మనుగడ

జీవ పరిణామ పరివర్తన సిద్దాంతం ఆధారంగా కొన్ని వేల లక్షల సంవత్సరాల క్రితం ప్రకృతిలో ఉన్న పంచభూతాల మధ్య జరిగిన సంఘర్షణలో భాగంగా.. భూ గ్రహంపై ఎన్నో వేల లక్షల జాతుల జీవాలు పురుడు పోసుకున్నాయి. అయితే నేడు మానవుడు సాధించిన నాగరికత ప్రగతిలో భాగంగా ఒక భూ గ్రహం మాత్రమే వివిధ జీవరాశులకి మనుగడ సాగించడానికి అనుకూలపైన ప్రాంతం కాగా, భూగ్రహం పై ఉన్న వేలాది లక్షలాది జీవాల్లో బుద్ధిగల జీవి మానవ జాతి మాత్రమేనని జగమెరిగిన సత్యం. అయితే ఆనాటి ప్రాచీన కాలంనుండి నేటి ఆధునిక సమాజం వరకు అన్ని జీవరాశుల మనుగడలో భాగంగా మానవుడు కూడా మనుగడ సాగించడానికి పోరాటం చేస్తూనే ఉన్నాడు. నాటి ప్రాచీన కాలంలో మానవుడు మేధస్సు మెరుగుపడక ఒకరిని ఒకరిని చంపుకొని క్రూరమైన జీవరాశులతో పాటు తేడా లేకుండా జీవిస్తే, నేడు ఇంత ఆధునిక సమాజంలో ఉండి కూడా క్రూరమైన జంతువుల వలె మానవుడు ప్రవర్తిస్తూ జీవిస్తున్నాడని లోతుగా ఆలోచిస్తే నిరూపణ కాబడుతుంది. అన్ని జీవరాశుల వలె మానవుడు తోటి మానవుడిని చంపుకోకుండా తన ఉనికిని కాపాడుకోవడం కోసం తోటి మానవుడితో రక్త సంబంధాలు, బంధుత్వాలు పెట్టుకొని నేటి వరకు మానవుడు మనుగడలో ఉండగలుగుతున్నాడు. ఇక రోజురోజుకీ మానవుడు సాధించిన ప్రగతి నాగరికతలో భాగంగా మెరుగైన జీవన విధానాన్ని సాగించడం కోసం మానవ సాంస్కృతిక విప్లవంలో భాగంగా మానవుడు వర్ణం,మతం,కులం, ప్రాంతీయ,భాషా పర తారతమ్యాలని పెంచి పోషించుకుంటున్నాడు. వీటిలో భాగంగానే మానవుడు మరింత గొప్పగా జీవించడానికి భయభ్రాంతులతో కూడిన మెరుగైన జీవన విధానం ఉండటం కోసం దైవత్వాన్ని సృష్టించుకుని తనకు తానుగా స్వీయ క్రమశిక్షణ విధానాన్ని పాటించుకొని మానవుడు చేసే తప్పు ఒప్పుల్లో భాగంగా దైవత్వాన్ని సృష్టించుకున్నాడు. ప్రాచీన కాలంలో మానవ మనుగడని కాపాడడం కోసమే దైవత్వాన్ని సృష్టించుకున్న మానవుడు నేడు అదే దైవత్వం పేరుతో సాటి మానవుడి పైనే స్వేచ్ఛ సమానత్వ సోదరభావ నైతిక మానవ విలువలు లేకుండా తోటి మానవుడిని బుద్ధిలేని జీవి వలె క్రూరంగా చంపుతూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నాడు. ప్రాచీన కాలం నుండి నేటి ఆధునిక సమాజం వరకు మానవుడు తోటి మానవుడితో సంబంధాలు పెట్టుకొని వర్ణం జాతి మతం కులం భాష వివిధ భేదాలతో వివిధ దేశాలుగా ఏర్పాటు చేసుకొని తమ తమ దేశాలను కాపాడుకోవడం కోసం ఎంతో అత్యాధునికమైన రక్షణ ఆయుధాలని మానవుడు తయారు చేసుకున్నాడు. ప్రాచీన కాలంలో దేవుడే మానవుడిని కాపాడుతాడని దైవత్వాన్ని సృష్టించుకుని నేడు అదే మానవ మనుగడని ఉనికిలో ఉంచడం కోసం కాకుండా వివిధ మతాల దైవత్వాన్ని ఉనికిలో ఉంచడం కోసం సాటి మానవుడిపైనే శతృత్వాన్ని పెంచుకొని ప్రతి దినము సాటి మానవుడిని చూసి భయంతో బిక్కు బిక్కున జీవిస్తున్నాడు. ప్రకృతి ధర్మంలో భాగంగా ఒక జీవి బ్రతకాలంటే మరొక జీవిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడక తప్పదు, అందులో భాగంగానే అవసరానికి మించి ఒక జీవిని చంపి మరొక జీవి జీవించాల్సిన పరిస్థితి సహజంగా ఉండినప్పటికీ, నేడు ఆ సహజ సూత్రాలను మానవుడు తన స్వార్ధ ప్రయోజనల కోసం తోటి మానవుడిని చంపే అనాగరికంలోకి నెట్టివేయబడ్డాడు. ఇది ఆనాటి నుండి నేటి వరకు మానవుడు సాధించిన అత్యంత గొప్పదైన అభివృద్ధి అని చెప్పుకోవడానికి మానవ సమాజానికే సిగ్గుచేటు. ఎందుకంటే బుద్ధిలేని జీవరాసులే బలమైన జీవిని చూసి బలహీనమైన జీవులు ఎంతో జాగ్రత పడుతూ సజాతి జంతువులన్నీ ఐక్యంగా జీవిస్తున్నాయి. కానీ నేడు మానవుడు ఏర్పాటు చేసుకున్న కుల మత వర్ణం ప్రాంతం భాష వివిధ తారతమ్యాల్లో భాగంగా సాటి మనిషిని చంపే పరిస్థితిలోకి మానవుడి ఉనికి నెట్టి వేయబడింది. అంటే ఆధునిక సమాజంలో జీవిస్తూ కూడా తెలియకుండానే ప్రాకృతిక వ్యవస్థని అమలు పరుస్తున్నాం. ప్రాకృతిక వ్యవస్థ అంటే ఎంతోమంది రాజనీతిజ్ఞుల అభిప్రాయం ప్రకారం రాజ్యం రాజకీయ జీవితం ఏర్పడక ముందు మానవుడు కొనసాగించిన జీవన విధానమే ‘ప్రాకృతిక వ్యవస్థ’. ఈ ప్రాకృతిక వ్యవస్థలో మనిషి మనిషికి మధ్య స్వేచ్ఛ సమానత్వ సోదరభావ వివిధ మానవత విలువలు లేవు. నేడు మానవుడు సాధించిన ప్రగతిలో భాగంగా మా దేశమే గొప్పగా అభివృద్ధి చెందాలని, మా దేశీయులు మాత్రమే అత్యంత ఉన్నత స్థానంలో ఉండాలని, మా మత దేవుడు మాత్రమే ప్రథమ స్థానంలో ఉండాలనే నెపంతో వివిధ దేశాల మధ్య ప్రత్యక్షంగా పరోక్షంగా నేడు యుద్దాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రపంచంలో లోని వివిధ దేశాల మధ్య పరోక్షంగా ’కోల్డ్‌ వార్‌” జరుగుతూనే ఉన్నది.
ప్రాచీన కాలంలో మానవుడు వివిధ క్రూరమైన జంతువుల నుండి తనను తాను కాపాడుకోవడం కోసం రక్షణ కోసం వివిధ మూలకాలతో ఆయుధాలని తయారు చేసుకుంటే నేడు అదే మానవుడు తోటి మానవుడి నుండి రక్షణ పొందడం కోసం ఎంతో ప్రమాదకరమైన మరణాయుధాలను తయారు చేసుకొని నేటి ఆధునిక మానవులుగా గొప్ప నాగరికతని ప్రగతిని సాధించామని చెప్పుకోవాలో సాటి మనిషిని చూసి ఎలాంటి వివక్షతలు చూపకుండా సాటి మనిషిగా చూడలేకపోతున్నందుకు సిగ్గుపడే పరిస్థితులకు మానవ సమాజం నెట్టి వేయబడినందుకు బుద్ధి జీవులుగా నేడు మనం ఆలోచించాల్సిన సందర్భం నెలకొన్నది.
మానవ నాగరికతలో భాగంగా మా దేశం, మా మతం, మా ప్రాంతం మాత్రమే గొప్పగా విరిజిల్ల్లాలని రక్షణ ఆయుధాలని తాయారు చేసుకొని మానవ జాతి భవిష్యత్‌ లో అన్ని జీవరాశులతో పాటు సమానంగా ఉనికి ఉంటదా..? అనే పరిస్థితి ఎంతో లోతుగా ఆలోచిస్తే కానీ అర్థం కాని పరిస్థితి..! ఎందుకంటే సాటి మనిషిని చూసి స్వేచ్ఛ, సమానత్వ సోదరభావ మానవ నైతిక విలువలతో గొప్పగా జీవించకుండా కారణాలు ఏవైనప్పటికీ మానవుడు సృష్టించుకున్న కులం మతం ప్రాంతం వర్ణం భాష దైవత్వం వివిధ తారతమ్యాలు మూలంగా ఒక విధంగా మానవ మనుగడనే ప్రమాదంలోకి నెట్టివేయబడిందని స్పష్టంగా నిరూపణ కాబడుతున్నది. ఒకనాడు ప్రాచీన కాలంలో వివిధ క్రూర జంతు సమూహాల నుండి మానవ ఉనికిని కాపాడుకోవడం కోసం వివిధ మూలకాలతో రక్షణ ఆయుధాలను తయారు చేసుకున్న మానవుడే నేడు అదే మానవ సమాజం మనిషి మనిషికి మధ్య స్వేచ్ఛ సమానత్వ సోదరభావ మానవ విలువలు పాటిస్తూ జీవించకుండా..?మానవ మనుగడకే ముప్పు తెస్తున్న మారణహోమం చేస్తున్న దుర్భేద్యమైన ఆయుధాలు లేని మానవ సమాజాన్ని చూడగలమా అనే ప్రశ్న వేసుకుంటే సాధ్యమయ్యే పనేనా అని మరో ప్రశ్న రాక మానదు…? మొదటి ప్రపంచ యుద్ధ తదనంతరం ఏర్పడిన నానాజాతి విఫలం అవ్వడం మూలంగానే రెండవ ప్రపంచ యుద్ధం జరిగి ఐక్యరాజ్య సమితి ఏర్పాటు అయ్యింది. దాదాపుగా ఏడాది పైగా రష్యా ఉక్రెయిన్‌ మధ్య జరుగుతున్న భీకర యుద్ధం మరియు నేడు తాజాగా ముస్లిం క్రిస్టియన్‌ దేశాల మధ్య జరుగుతున్న బాంబుల యుద్ధం మూలంగా ఐక్యరాజ్య సమితి విఫలం అయ్యి మూడవ ప్రపంచ యుద్ధమే, జరిగితే నేడు ప్రపంచ దేశాలకు ఉన్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం మూలంగా అణు బాంబుల తో యుద్దాలు జరిగితే ఈ భూమి పై ఒక్క మానవ మనుగడకే కాదు సమస్త జీవరాశులకే మానవుడు ముప్పు తెచ్చినవాడు అవుతాడు. అంటే ఒక విధంగా మానవుడు ప్రాచీన కాలం నుండి నేటి ఆధునిక కాలం వరకు సాధించిన ప్రగతిలో భాగంగా నేడు మారణహోమం చేసే రక్షణ ఆయుధలకే ప్రాముఖ్యతనిస్తున్నాడు కానీ సాటి మనిషితో మారణహోమం చేసే అనుబాంబులు, వివిధ ఆయుధాలు లేకుండా మానవతా విలువలతో గొప్పగా జీవించగలుగుతామనే పరిస్థితులు లేవని స్పష్టమవుతున్నది. కానీ ఒక మానవ సమాజం తప్ప మిగతా జీవరాశులన్నీ కూడా వాటికి ఎలాంటి రక్షణ ఆయుధాలు లేకుండా అయా జీవరాసులు బతకడం కోసమే మరో జీవిపై ఆధారపడుతూ సజాతి గల జీవరాశులన్నీ కూడా బుద్ధిలేని జీవరాశులు అయినప్పటికి ఐకమత్యంగా జీవించగలుగుతున్నాయి కానీ ఈ అనంత విశ్వంలో ఒక్క మానవ సమాజం మాత్రమే బుద్ధిగల జీవజాతి అయినప్పటికీ మానవులుగా తమకు తాము సృష్టించుకున్న మతం కులం వర్ణం ప్రాంతం భాష దైవత్వం మరియు మరెన్నో తారతమ్యాల మూలంగా మానవ సమాజమంతా సజాతీయంగా ఐకమత్యంగా జీవించలేక పోతున్నాం. అంటే బుద్ధిలేని ఇతర జీవరాశులను చూసి బుద్ధిజీవి అయినా మానవుడే నేడు సిగ్గు శరం బుద్ధి జ్ఞానం తెచ్చుకోవలసిన పరిస్థితిలోకి మానవ సమాజం నెట్టివేయబడింది.అంతిమంగా వేల లక్షల కోట్ల సంవత్సరాల పాటు మానవ సమాజం మనుగడ కొనసాగించాలంటే వివిధ జీవరాశులలో ఎలాగైతే బ్రతకడం కోసమే మనుగడ కొనసాగిస్తున్నయో మానవుడు కూడా అత్యాశని స్వార్థ బుద్ధిని పక్కకు పెట్టి మానవులుగా మనం సృష్టించుకున్న కుల మత వర్గ ప్రాంత దైవత్వం భాష వివిధ భేదాభిప్రాయాలను పాటించకుండా మానవ సమాజమంతా ఒక్కటేనని బ్రతకడానికి ఇలాంటి తారతమ్యాలు అవసరం లేదు..? అందులో భాగంగానే క్రూరమైన రక్షణ ఆయుధాలు అవసరం కూడా ఉండదు. ఇదంతా నేడు ఆధునిక సమాజంలో సాధ్యమా అని ఆలోచిస్తే అసాధ్యంగా అనిపించినప్పటికీ, ఒక్కసారి మానవ పరిణామ క్రమాన్ని, గత చరిత్రను క్షుణ్ణంగా పరిశీలిస్తే ప్రాచీన కాలంలో మానవులుగా సృష్టించుకున్న కులం మతం దైవత్వం వివిధ విలువలు లేకపోయినప్పటికీ మానవుడికి ఆనాడు ఉనికి ఉన్నదని చరిత్ర నిరూపిస్తున్నది. కానీ నేడు ప్రాచీన కాలం వలె ఆధునిక సమాజంలో మరీ అనాగరికంగా జీవించాల్సిన పరిస్థితుల్లో కాకుండా మానవులుగా మనం తయారు చేసుకొనిన విలువలు, ధర్మాలు మానవుని ఉనికికి ప్రయోజనకరంగా ఉండాలి తప్ప, భవిష్యత్తు కాలంలో మానవ మనుగడకే ప్రమాదకంగా మారే మానవ విలువలని విస్మరించి మానవుని ఉనికి ఎల్లకాలం సస్యశ్యామలంగా ఉండే విలువలని సంస్కృతిని ఏర్పాటు చేసుకొని భవిష్యత్‌ తరాలకి గొప్ప ఆదర్శవంతమైన మార్గాన్ని చూపించాల్సిన సహజమైన బాధ్యత, విధి నేటి ప్రపంచ మానవులందరిపై ఉన్నదనే విషయాన్ని విస్మరించకుండా ఎంతో బాధ్యత యుతంగా జీవించాల్సిన ధర్మం మనందరిపై ఉన్నది.

- Advertisement -

_ పుల్లెంల గణేష్‌ (ధర్మ సమాజ్‌ పార్టీ, స్టడీ & రీసెర్చ్‌ టీం రాష్ట్ర ఇంచార్జ్‌)
9553041549

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News