2024 గ్లోబల్ హంగర్ ఇండెక్స్ (జీహెచ్‌ఐ) నివేదిక ప్రకారం, భారతదేశం 127 దేశాలలో 105వ స్థానంలో నిలిచింది. ఈ ర్యాంక్ గత సంవత్సరాలతో పోలిస్తే కొంత మెరుగైంది. ఈ నివేదికను అంతర్జాతీయ హ్యూమానిటేరియన్ సంస్థలు ఆకలి స్థాయిలను కొలవడం, ట్రాక్ చేయడం కోసం రూపొందించాయి.
గ్లోబల్ హంగర్ ఇండెక్స్ (జీహెచ్‌ఐ) అనేది అంతర్జాతీయ మానవతావాద సంస్థలు ఆకలి స్థాయిలను కొలిచేందుకు ఉపయోగించే సాధనం. ఇది 127 దేశాల్లో పోషణ లోపం మరియు పిల్లల మరణం సూచికల ఆధారంగా స్కోర్లు లెక్కిస్తుంది. జీహెచ్‌ఐ దేశాలను 0 నుండి 100 వరకు స్కోర్ చేస్తుంది. ఇందులో తక్కువ స్కోర్లు తక్కువ ఆకలిని సూచిస్తాయి. జనాభాలో పోషకాహార లోపాన్ని నాలుగు ప్రధాన సూచికల ద్వారా లెక్కిస్తుంది. తగిన కాలరీలు పొందలేని శాతం, ఐదేళ్ల లోపు పిల్లల్లో వృద్ధిలో లోపం, తగినంత బరువు లేకపోవడం, చిన్న వయసులో మరణాలు. ఇవి సమాజంలో పోషకాహార లోపం తీవ్రతను స్పష్టంగా చూపిస్తాయి.
జీహెచ్‌ఐ నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 733 మిలియన్ మంది ఆకలితో జీవిస్తున్నారు. 2016 నుంచి ఆకలి తగ్గింపులో పురోగతి నిలిచిపోయిందని, 127 దేశాలలో 42 దేశాలు ఇంకా ‘అలార్మింగ్’ లేదా ‘సీరియస్’ స్థాయిలో ఉన్నాయని నివేదిక తెలియజేసింది. ఈ నివేదికలో పేర్కొన్నట్లుగా, ఆకలి స్థాయిలు వచ్చే దశాబ్దంలో మెరుగుపడకపోవచ్చు, కాబట్టి ఈ సమస్యను పరిష్కరించేందుకు తక్షణ చర్యలు అవసరమని స్పష్టం చేసింది. అంతర్జాతీయ సమాజం సరైన ఆహారం పొందడం మనిషి హక్కు అని పునరుద్ఘాటించినప్పటికీ, నిబంధనల ద్వారా రూపొందించిన ప్రమాణాలు మరియు ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఆహారాన్ని హక్కుగా గుర్తించకపోవడం మధ్య ఉన్న అసమానత ఆందోళన కలిగిస్తుంది అని నివేదికలో పేర్కొంది.
భారతదేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, ఇంకా ‘తీవ్రమైన’ ఆకలి సమస్యలతో బాధపడుతున్న దేశాల జాబితాలో ఉంది. స్వాతంత్య్రం వచ్చి ఎనిమిది దశాబ్దాలు గడిచినా, ఆకలి సమస్యలు ఇంకా తగ్గలేదు. జీహెచ్‌ఐలో 27.3 స్కోర్ సాధించిన భారత్, తీవ్రమైన ఆకలి స్థాయిని కలిగి ఉంది. ఈ కేటగిరీలో పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాలు కూడా ఉన్నాయి, అయితే, భారతదేశం పరిస్థితి పొరుగు దేశాలైన శ్రీలంక, నేపాల్, మయన్మార్, బంగ్లాదేశ్ కంటే దీనంగా ఉంది.
జీహెచ్‌ఐ నివేదిక ప్రకారం, భారతదేశంలో సుమారు 13.7% మంది ప్రజలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారని, ఐదేళ్ల లోపు పిల్లలలో 35.5% మంది ఎదుగుదలలో వ్యాధిగ్రస్తులుగా ఉన్నారని తెలిపింది. వీరిలో 18.7% మంది తక్కువ బరువుతో ఉండగా, 2.9% పిల్లలు ఐదేళ్లకంటే ముందే మరణిస్తున్నారని వెల్లడించింది. ఈ పోషకాహార లోపాలు సమాజంలోని సాంఘిక ఆరోగ్యాన్ని తీవ్రమైన దిశలో ప్రభావితం చేస్తూ, పిల్లల ఎదుగుదల, ఆరోగ్యానికి దీర్ఘకాలిక సంక్షోభానికి దారి తీసే అవకాశముంది.
భారతదేశంలో ఆకలి, పోషకాహార లోపాలను తగ్గించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని నివేదిక స్పష్టంగా సూచిస్తోంది. 2030 నాటికి యునైటెడ్ నేషన్స్ సుస్థిర అభివృద్ధి లక్ష్యం అయిన జీరో హంగర్ సాధించేందుకు సమర్థవంతమైన కృషి అవసరం. ఆకలి సమస్య ఆరోగ్యం, వాతావరణ మార్పు, సామాజిక అసమానతలతో సంబంధం ఉన్నందున, దీన్ని పరిష్కరించడానికి సమగ్ర విధానాలను అనుసరించాల్సిన అవసరం ఉంది. సుస్థిర ఆహార వ్యవస్థలు, మెరుగైన పోషణ, సమర్థవంతమైన ఆరోగ్య సేవలు ప్రజలకు అందించడం ద్వారా ఆర్థిక వృద్ధిని కొనసాగించవచ్చు, ఎందుకంటే ఆరోగ్యకరమైన సమాజం దేశ ఆర్థిక స్థిరత్వానికి కీలకం.
2024 జీహెచ్‌ఐ నివేదిక భారతదేశానికి గట్టి హెచ్చరికను అందించింది, ఆకలి మరియు పోషకాహార లోపాల సమస్యలను పరిష్కరించడానికి జాతీయ విధానాలు మెరుగుపర్చాల్సిన అవసరాన్ని సూచిస్తోంది. సుస్థిర ఆహార వ్యవస్థలు, అంతర్జాతీయ సహకారం, మరియు సమగ్ర చర్యల ద్వారా ఈ సమస్యలను పరిష్కరించడానికి భారీ కృషి అవసరమని నొక్కి చెబుతోంది. ఈ నేపథ్యంలో, భారతదేశం ఆకలి సమస్యలను అధిగమించడానికి తన విధానాలను పునర్విమర్శించుకోవాలి. సుస్థిర ఆహార వ్యవస్థలు, మెరుగైన పోషకాహారం, మరియు అంతర్జాతీయ సహకారం వంటివి ఆయా చర్యలలో కీలకంగా మారాలి. ఆకలి నిరోధానికి ధృడమైన చర్యలు తీసుకోవడం అవసరం. తద్వారా దేశం 2030 నాటికి జీరో హంగర్ లక్ష్యాన్ని చేరుకోగలుగుతుంది.
డాక్టర్ కృష్ణ కుమార్ వేపకొమ్మ
విశ్రాంత ప్రధానాచార్యులు