Friday, October 25, 2024
Homeఓపన్ పేజ్Living Planet report 2024: అంతరించిపోతున్న అరుదైన ప్రాణులు

Living Planet report 2024: అంతరించిపోతున్న అరుదైన ప్రాణులు

ఏం జరుగుతోంది?

మనుషుల తప్ప భూమి మీద ఉన్న ప్రాణులన్నీ క్రమంగా అంతరించిపోతున్నట్టు గత వారం విడుదలైన వరల్డ్‌ వైల్డ్‌ లైఫ్‌ ఫౌండేషన్‌ (డబ్ల్యూ. డబ్ల్యూ.ఎఫ్‌) ద్వైవార్షిక ‘లివింగ్‌ ప్లానెట్‌’ నివేదిక తెలియజేసింది. ఇది నిజంగా తీవ్రంగా ఆందోళన కలిగించే విషయం. ప్రపంచవ్యాప్తంగా వేలాది ప్రాణుల సంఖ్య, స్థితిగతులను అధ్యయనం చేసి రూపొందించే లివింగ్‌ ప్లానెట్‌ సూచి ప్రకారం 1970-2020 మధ్య వేలాది రకాల ప్రాణులు, జీవులు 73 శాతం వరకూ అంతరించిపోయాయి. ఒక్క వన్య ప్రాణులే కాక, అన్ని రకాల జీవులు తీవ్రస్థాయి ముప్పును ఎదుర్కొంటున్నాయి. ఇందులో అత్యధిక శాతం జీవులు అంతరించిపోవడంలో చివరి దశలో ఉన్నాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల వన్యప్రాణులు అంతరించిపోతుండడానికి ప్రధాన కారణాలు అవి నివాసాలను కోల్పోవడం, అడవులను విచక్షణారహితంగా నరికివేయడం, ఆహార ధాన్యాలు పండించే పంట పొలాల విస్తీర్ణం నానాటికి పెరుగుతుండడం అని ఆ నివేదిక తెలియజేసింది. జనాభా పెరుగుతున్న కారణంగా ఆహార ధాన్యాల అవసరం బాగా పెరుగుతుండడంతో అడవులను నరికి, పొలాల విస్తీర్ణాన్ని పెంచడం జరుగుతోంది. ఇక వాతావరణ సంక్షోభం, అనారోగ్యాలు, వాయు, జల కాలుష్యాలు కూడా ప్రాణులు అంతరించిపోవడానికి కారణమవుతున్నాయి.
ఆసియా, పసిఫిక్‌ దేశాల్లో వాయు, జల కాలుష్యాలు విపరీతంగా పెరుగుతుండడంతో దాదాపు 60 శాతం జీవులు అంతరించిపోయినట్టు కూడా లివింగ్‌ ప్లానెట్‌ నివేదిక తెలియజేసింది. జల కాలుష్యం వల్ల 85 శాతం, భూ కాలుష్యం వల్ల 69 శాతం, వాయు కాలుష్యం వల్ల 56 శాతం ప్రాణులు ఇప్పటివరకూ అంతరించిపోయాయని, మొత్తం మీద పది లక్షల రకాలకు పైగా జీవులు ఇప్పటికే అవసాన దశలో ఉన్నాయని ఆ నివేదిక తెలిపింది. సహజ సిద్ధమైన పర్యావరణం మీద రోజు రోజుకూ ఒత్తిడి పెరుగుతోంది. నిజానికి ప్రాణికోటి అంతరించిపోతుండడాన్ని రెండేళ్ల అధ్య యనంతో అంచనా వేయడం కష్టం. అనేక దేశాల్లో పర్యావరణ పరిస్థితి అధ్వానంగా మారిపోయి, అనేక ప్రాణులు ఇప్పటికే చెదురుమదురుగా కనిపిస్తున్నాయి. పర్యావరణ వ్యవస్థలన్నీ క్రమంగా కుప్పకూలుతున్నాయి. హిమాలయాల్లో అనేక జలపాతాలు ఇప్పటికే మటుమాయం అయి పోయాయి. అంటార్కిటిక్‌ హిమనదులు గడ్డకట్టడం ఆగిపోయి, ఎప్పుడూ జల రూపంలోనే ఉంటున్నాయి. అమెజాన్‌ వర్షాధార అడవులు ఎదగడం, విస్తరించడమనేది దశాబ్దాల కిందటే నిలిచి పోయింది. అనేక దేశాల్లో మైళ్ల కొద్దీ విస్తరించి ఉన్న పగడపు దిబ్బలు దుర్వినియోగం అవుతున్నాయి. ఇవన్నీ ప్రాణికోటి మీద తమ దుష్ప్రభావాన్ని చూపిస్తున్నాయి.
జీవ వైవిధ్యం మీదే పర్యావరణ వ్యవస్థల ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. భూమి మీద జీవం కొనసాగాలన్న పక్షంలో అందుకు పర్యావరణ సంరక్షణే ప్రధాన ఆధారం. భూమి మీద ప్రతి ప్రాణీ ఒక దాని మీద మరొకటి ఆధారపడి ఉంటుంది. సృష్టిలోని వివిధ ప్రాణులు, జీవుల మధ్య కలయికలు, సంపర్కాలు జరుగుతున్నంత కాలం మానవ మనుగడ కూడా సవ్యంగా సాగిపోతుంది. ఇందుకు పరిశుభ్రమైన, స్వచ్ఛమైన నీరు, గాలి లభించడంతో పాటు పుప్పొడి వ్యాపించడం, వాతావరణం, రుతువులు సజావుగా సాగిపోతుండడం వంటివి కూడా జరగాల్సి ఉంటుంది. మనిషి ఆరోగ్యం, మనుగడ కూడా వీటి మీదే ఆధారపడి ఉంటాయి. ఆవాసాలను కోల్పోవడం వల్ల, అడవులను నేలమట్టం చేయడం వల్ల, పర్యావరణ వ్యవస్థలు, జీవ వైవిధ్యం దెబ్బ తినడం వల్ల వాతావరణంలో వేగంగా మార్పులు చోటు చేసుకుంటాయి. మానవాళి తమ తాత్కాలిక ప్రయోజనాలను, అవసరాలను పక్కనపెట్టి దీర్ఘకాలిక అగత్యాల మీద దృష్టి పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది.
కొలంబియాలో ఐక్యరాజ్య సమితి జీవ వైవిధ్య సదస్సు జరగడానికి రెండు వారాల ముందు ఈ నివేదిక విడుదల కావడం యాదృచ్ఛికమే కావచ్చు. ఈ అంతర్జాతీయ సదస్సులో వివిధ దేశాలకు చెందిన పర్యావరణ నిపుణులు, పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ ప్రతినిధులు, వాణిజ్యవేత్తలు, శాస్త్రవేత్తలు పాల్గొంటారు. వన్యప్రాణుల ఆవాసాలు క్షీణించిపోవడం, ప్రాణికోటి అంతరించిపోవడం వంటి అంశాల మీద ఇక్కడ చర్చలు జరుగుతాయి. జీవ వైవిధ్యం దెబ్బతినకుండా ఉండేందుకు అనేక అంతర్జాతీయ సదస్సుల్లో లక్ష్యాలను నిర్దేశించడం జరిగింది కానీ, అవి అమలు జరగడం మాత్రం అతి తక్కువ స్థాయిలో ఉంది. ఇక 2022లో జరిగిన కున్మింగ్‌-మాంట్రియల్‌ గ్లోబల్‌ బయో డైవర్సిటీ ఫ్రేమ్‌ వర్క్‌ సదస్సులో తీసుకున్న నిర్ణయాలు ఆచరణలోకి రావాల్సి ఉంది. ప్రపంచ దేశాలు భవిష్యత్తులో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి లివింగ్‌ ప్లానెట్‌ నివేదిక స్పష్టంగా తెలియజేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News