Saturday, October 26, 2024
Homeఆంధ్రప్రదేశ్YS Sharmila: కన్నీళ్లు పెట్టుకున్న షర్మిల.. దేవుడి మీద ప్రమాణం చేయాలని జగన్‌కు సవాల్

YS Sharmila: కన్నీళ్లు పెట్టుకున్న షర్మిల.. దేవుడి మీద ప్రమాణం చేయాలని జగన్‌కు సవాల్

YS Sharmila| కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కన్నీళ్లు పెట్టుకున్నారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్(Jagan) వైఖరితో పాటు వైసీపీ నేతల తీరుతో తీవ్ర మనస్థాపానికి గురయ్యానని ఆవేదన వ్యక్తంచేశారు. ఆస్తి వివాదాల నేపథ్యంలో వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు ఆమె కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. తనపై చేస్తున్న ఆరోపణలు నిజమైతే.. టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి(YV Subbareddy), జగన్ దేవుడి మీద ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

“వైవీ సుబ్బారెడ్డి గారు నాగురించి ఎందుకు మాట్లాడుతున్నారు ? ఆయన ఎవరు ? సుబ్బారెడ్డి జగన్ మోచేతి నీళ్ళు తాగేవారు. జగన్ పదవులు ఇస్తే ఇప్పుడు ఆర్థికంగా అనుభవిస్తున్నారు. రేపు సాయిరెడ్డి గారు కూడా మాట్లాడుతారు. సాయిరెడ్డి గారు కూడా జగన్ చేతిలోనే ఉన్నారు. జగన్ పక్షాన ఉన్నారని తెలిసి కూడా వాళ్ల పేర్లు లేఖలో రాశాను. వాళ్ల దగ్గర ఇంకా నిజాయితీ ఏమైనా ఉందా చూద్దాం అనుకున్నాను. కానీ ఇంచెంత నిజాయితీ కూడా లేదని అర్థమైంది. వీళ్లకి వైఎస్‌ఆర్ తెలుసు.. ఆయన మనోభావాలు కూడా తెలుసు. వైఎస్ఆర్ బతికి ఉన్నప్పుడు భారతి, సాక్షి సిమెంట్స్‌లో నలుగురు చిన్న బిడ్డలకు సమాన వాటా ఉండాలన్నారు. జగన్ నాన్నకు మాట ఇచ్చారు. ఈ లోకంలో నీ తరువాత పాప మేలుకోరేది నేనే అని జగన్ చెప్పారు. డోంట్ వర్రీ డాడీ అన్నారు. ఇది నిజం అని నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తా. సుబ్బారెడ్డి కూడా తన బిడ్డల మీద ప్రమాణం చేయాలి. లేదా జగన్ం ప్రమాణం చేసి చెప్పాలి” అని కన్నీటిపర్యంతమయ్యారు.

“సుబ్బారెడ్డి అంటున్నరు సాక్షి, భారతి సిమెంట్స్ కంపెనీలకు వాళ్ల పేర్లు పెట్టుకున్నారట. అందుకే ఆ ఆస్తులు వాళ్లవేనట. అందులో నాకు హక్కు లేదట. జగన్ సొంతంగా సంపాదించాడట. ఆరోజు వాళ్ల పేర్లు పెట్టుకుంటే నేను అభ్యంతరం ఏం చెప్పలేదు. పేర్లతో ఏముందిలే అనుకున్నాను. అన్న ముచ్చటపడ్డాడు అనుకున్నాను. వాళ్ల పేర్లతో ఆస్తులు ఉంటే నిజంగా వాళ్లవి అవుతాయా..? నా పేరు మీద ఆస్తులు ఉంటే నేను ఎందుకు జైలుకు వెళ్లలేదు అంటున్నారు. ఏ అన్న అయినా…చెల్లెలకు గిఫ్ట్ అంటే…ఏ బంగారమో… చీరనో… గిఫ్ట్ ఇస్తారు. అంతేకాని ఆస్తుల్లో 40 శాతం వాట ఇస్తారా ? ఇవ్వాలని అనుకున్నది గిఫ్ట్ కాదు… నా హక్కు. నా హక్కు కాబట్టే నాకు ఇస్తామని అన్నారు. ఇవ్వాల్సిన భాధ్యత వాళ్లకు ఉంది కాబట్టి MOU రాశారు. MOU రాయమని నేను అడగలేదు. సరస్వతి సిమెంట్స్ ED అటాచ్‌లో లేదు. అందుకే సరస్వతి సిమెంట్స్ వెంటనే ట్రాన్స్ ఫర్ చేస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ ఎందుకు నిలబెట్టుకోలేదు. ప్రతి ఇంట్లో ఉండే కహాని అని జగన్ సులువుగా చెబుతున్నారు. ఇంత సునాయాసం ఎలా మాట్లాడుతున్నారు. మీకు సెంటిమెంట్ లేదా ? ఎమోషన్ లేదా ? ఈ మాటలు ఎవరో అంటే పట్టించుకొనే దాన్ని కాదు. నా సొంత చిన్నాన్న అంటే నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. చిన్నాన్న…నా బిడ్డలు నీ ముందు పెరగలేదా ? నా బిడ్డలను మీరు తాకలేదా ? దేవుడు అంతా చూస్తున్నాడు. అంతా గమనిస్తున్నాడు” అని గుర్తుపెట్టుకోవాలి.

“వైసీపీ కార్యకర్తలకు నేను ఒక మాట చెప్పాలని అనుకుంటున్నానున. 2019లో వైసీపీ 151 స్థానాలు గెలిచి ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఇది అప్పుడు అఖండ విజయం. ఇది అప్పుడు ఎలా సాధ్యం అయింది
ఎంతో మంది వైఎస్ఆర్ అభిమానులు అనుకుంటే వచ్చింది. ఎంతో కష్టం పడితే…త్యాగాలు చేస్తే ఈ విజయం సాధ్యం అయింది. నేనే కాదు…అమ్మే కాదు..ఎంతో మంది త్యాగాలు చేశారు. నేను, అమ్మ ఇద్దరం మా శక్తికి మించి పనిచేశాం. అమ్మకు మోకాళ్ళ నొప్పులు ఉండేవి. బాధలు భరించి ఏడ్చుకుంటూ పార్టీ కోసం కష్టం చేసింది. నేను కూడా 3200 KM పాదయాత్ర చేశా. నన్ను పాదయాత్ర చేయమని అడిగితే చేశా. నన్ను ఆరోజుల్లో సూర్యుడు వరకు వెళ్ళమని అన్నా కూడా వెళ్ళే దాన్ని. ప్రాణాలను సైతం నేను లెక్క చేయలేదు. నాకు జగన్ అన్న అంటే ప్రాణం. వైసీపీ నాయకులు, కార్యకర్తలను అడుగుతున్న ..నేను మీకు ఏం అన్యాయం చేశాను” అని ప్రశ్నించారు.

“ఒక్క కారణం చెప్పండి. మీకు ఏం అవసరం వస్తే అవసరానికి మించి తిరిగా. సమైక్యాంధ్ర ఉద్యమం చేయమని అడిగితే చేశా. ఓదార్పు యాత్ర చేశా. బై బై బాబు అంటూ చేసిన క్యాంపెయిన్ దేశంలో పెద్దది. మీకు ఇన్ని చేస్తే… మీరు నాకు ఏం చేశారు ? మీరు నాకు,నా బిడ్డలకు అన్యాయం చేస్తున్నారు. ఇది అమ్మకు తెలుసు ..అందరికీ తెలుసు. 5 ఏళ్లు మీరు రాసి ఇచ్చిన MOU నా చేతుల్లో ఉంది. నాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా… నాకు అవసరం వచ్చినా… నేను బయట పెట్టలేదు. MOU బయటకు పోతే వైఎస్ఆర్ గురించి నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుతారు. నాన్న పేరు చెడగొట్టడం నాకు ఇష్టం లేదు. నాకు వేరే స్వార్థం ఉంటే నేను ఏదో ఒక మీడియా హౌస్‌కి ఇచ్చేదాన్ని కదా. ఇవ్వాళ అందరి చేతుల్లో MOU ఉంది.దీనికి కారణం నువ్వు కాదా ? సొంత కొడుకు తల్లిని కోర్టుకి ఈడ్చాడు. ఇది చూడటానికా నేను ఇంకా బ్రతికి ఉన్నానా అని విజయమ్మ ఏడుస్తుంది. బెయిల్ రద్దు చేసేందుకు…నేను ఈ కుట్ర పన్నాను అంటున్నారు. అందుకే కోర్టుకి తల్లిని ఈడ్చారట. నీ లబ్ధి కోసం తల్లిని వాడుకుంటావా..? వైఎస్ఆర్ చనిపోయాక…CBI ఛార్జ్ షీట్ లో పేరు పెట్టించింది ఈ జగన్ కాదా ? ఛార్జ్ షీట్ లో పేరు పెట్టకపోతే… బెయిల్ రాదని ఆయన పేరు చేర్చిన మాట నిజం కాదా ? నీ లబ్ధికి అమ్మా నాన్నల పేర్లను వాడుకుంటారా?ఇక YCP కార్యకర్తలు మీరే ఆలోచన చేసుకోవాల” అని షర్మిల వాపోయారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News