Monday, November 25, 2024
HomeతెలంగాణKTR: మీరా ఆయన పేరు తుడిచేది..? కేసీఆర్ అంటేనే తెలంగాణ చరిత్ర: కేటీఆర్

KTR: మీరా ఆయన పేరు తుడిచేది..? కేసీఆర్ అంటేనే తెలంగాణ చరిత్ర: కేటీఆర్

KTR: ఏడాదిలోపు తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ ఉనికి లేకుండా చేస్తానంటూ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేటీఆర్(KTR) కౌంటర్ ఇచ్చారు. ఈమేరకు ఎక్స్ వేదిగా ఓ పోస్టు చేశారు. “మీరు చెప్పులు మోసిన నాడు కేసీఆర్ ఉద్యమానికి ఊపిరి పోసాడు. మీరు పదవుల కోసం పరితపిస్తున్న నాడు, ఆయన ఉన్న పదవిని తృణప్రాయంగా వదిలేసాడు. మీరు ఉద్యమకారుల మీద గన్ను ఎక్కుపెట్టిన నాడు, ఆయన ఉద్యమానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. మీరు సాధించుకున్న తెలంగాణను చంపేందుకు బ్యాగులు మోస్తున్ననాడు, ఆయన తెలంగాణ భవిష్యత్‌కు ఊపిరి పోసాడు. చిట్టినాయుడు. మీరా కేసీఆర్ పేరును తుడిచేది. తెలంగాణ చరిత్ర కేసీఆర్” అని తెలిపారు.

- Advertisement -

కాగా మాజీ సీఎం కేసీఆర్(KCR) కుటుంబం రాజకీయ జీవితం గురించి సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. ఏడాది లోపు రాష్ట్ర రాజకీయాల్లో కేసీఆర్ పేరు లేకుండా చేయడమే తన టార్గెట్ అని తెలిపారు. ఇప్పటికే కేటీఆర్‌తోనే కేసీఆర్‌ను ప్రజలు మర్చిపోయేలా చేశామన్నారు. ఇక ఇప్పుడు బావ హరీష్‌రావు(HarishRao)ను వాడి రాజకీయాల్లో బామ్మర్ది కేటీఆర్‌ ఉనికి లేకుండా చేస్తామని పేర్కొన్నారు. మీడియాతో చిట్ చాట్ సందర్భంగా మాట్లాడిన రేవంత్.. పైవిధంగా హాట్ కామెంట్స్ చేశారు. బావబామ్మర్దులను ఎలా డీల్ చేయాలో తనకు బాగా తెలుసన్నారు. అవసరమైతే పోలీసులను పెట్టి నిర్బంధించొచ్చు కానీ అది తన విధానం కాదన్నారు. వారిద్దరిని డీల్ చేసేందుకు ఎలా ప్లాన్ చేయాలో అలా చేస్తామన్నారు.

గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయం విధితమే. అప్పటి నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరుకాకుండా ఫాంహౌస్‌కే పరిమితమవుతున్నారు. ఈ ఏడాది మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు ప్రజల్లోకి వచ్చారు. నెల రోజుల పాటు రాష్ట్రమంతా తిరిగి బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

అయితే ఆ ఎన్నిల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక్క ఎంపీ సీటు కూడా గెలుచుకోకుండా ఘోరంగా ఓడిపోయింది. దీంతో ఫలితాలు వచ్చిన జూన్ నెల నుంచి ఇప్పటివరకు కేసీఆర్ ఫాంహౌస్ నుంచి బయటకు రాలేదు. రాష్ట్రంలో ఏ సమస్యపైనా ఆయన స్పందించడం లేదు. కేటీఆర్, హరీష్ రావు మాత్రమే ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారు. దీంతో కేసీఆర్ రాజకీయాల నుంచి తప్పుకున్నారా అనే వార్తలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ పేరు తెలంగాణ రాజకీయాల్లో వినపడకుండా చేస్తానని చెప్పడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News