Ben Stokes| ఇంగ్లండ్ టెస్టు టీమ్ కెప్టెన్ బెన్ స్టోక్స్(Ben Stokes) ఇంట్లో దోపిడీ జరిగింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ స్టోక్స్ ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టాడు. పాకిస్తాన్ పర్యటనలో ఉన్నప్పుడు అక్టోబర్ 17న ఇంగ్లండ్‌లోని కాస్టల్ ఈడెన్ ఏరియాలో ఉన్న తన ఇంట్లో కొంతమంది దుండగులు చొరబడి కొన్ని విలువైన వస్తువులు చోరీ చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. చోరీకి గురైన కొన్ని వస్తువుల ఫొటోలను షేర్ చేశాడు. అందులో నగలు ఉన్నాయి. డిజైనర్ బ్యాగ్, క్రికెట్‌కు అందించిన సేవలకు గౌరవార్థంగా ఇచ్చిన మెడల్ తస్కరణకు గురైనట్లు పేర్కొన్నాడు.
స్టోక్స్ తన పోస్టులో ఏం రాసుకొచ్చాడంటే..
‘‘అక్టోబర్ 17న సాయంత్రం కొందరు వ్యక్తులు మాస్క్‌లు ధరించి ఇంట్లోకి ప్రవేశించారు. నగలు, విలువైన వస్తువులను చోరీ చేశారు. నాకు, నా కుటుంబానికి ఆ వస్తువులతో ఎంతో అనుబంధం ఉంది. వాటిని రిప్లేస్ చేయడం కష్టం. చాలా వస్తువులను కోల్పోయా. వాటికి విలువ కట్టలేను. దయచేసి ఎవరైతే ఈ చోరీ చేశారో.. వారికి విన్నవిస్తున్నాను. దయచేసి ఆ వస్తువులను తీసుకొచ్చి ఇవ్వాల్సిందిగా కోరుతున్నా. ఈ ఘటన సమయంలో నా భార్య, పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. అయితే అదృష్టవశాత్తూ వారికి ఎలాంటి హానీ జరగలేదు. శారీరకంగా ఇబ్బందిలేకపోయినా మానసికంగా మాత్రం వారిని కలవరపరిచింది. దీంతో అప్పటి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు’’ అని తెలిపాడు.
ఈ చోరీ రెండు వారాల క్రితం జరిగగా.. తాజాగా స్టోక్స్ తనకు సాయం చేయాలని కోరుతూ పోస్టు పెట్డడం గమనార్హం. కాగా 2019 వన్డే ప్రపంచకప్ ట్రోఫీని ఇంగ్లండ్ జట్టు నెగ్గడంలో బెన్‌స్టోక్స్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా స్టోక్స్ ఇంగ్లండ్ ప్రభుత్వం క్రికెట్‌కు అందించిన సేవలకు గానూ అత్యుత్తమ పురస్కారం అందించింది.