KBR Park| హైదరాబాద్ బంజారా హిల్స్‌లో కేబీఆర్ పార్క్ వద్ద లగ్జరీ పోర్షే కార్ బీభత్సం సృష్టించింది. శుక్రవారం ఉదయం కేబీఆర్ పార్క్ వద్ద అతి వేగంగా దూసుకొచ్చిన కారు.. ఫుట్‌పాత్ పైకి ఎక్కి పార్క్ ప్రహరీ గ్రిల్స్‌ను ఢీకొట్టి ధ్వంసం చేసింది. అయినా కానీ కారు వేగం ఆగక.. పక్కనే ఉన్న చెట్టును సైతం ఢీకొట్టింది. ఈ ప్రమాదం(Accident) సమయంలో వాకింగ్ చేస్తున్న వారితో పాటు క్యాన్సర్ రోగుల సహాయకులు, నిరాశ్రయులు, అటుగా వెళ్తున్న ప్రజలు భయంతో పరుగులు పెట్టారు. కారు చెట్టును ఢీకొట్టన వెంటనే కారులోని ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో కారులోని ప్రయాణికులకు ప్రమాదం తప్పింది. అయితే ప్రమాదం జరగగానే కారును అక్కడే వదిలేసి పారిపోయారు.
కారుకు నంబర్ ప్లేట్ లేకపోవడంతో ఈ ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదం జరిగిన తర్వాత నంబర్ ప్లేట్ తొలగించిన పారిపోయారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మద్యం మత్తులో ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఈ కారు ఓనర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా ఈ పోర్షే అల్ట్రా లగ్జరీ కార్ విలువ రూ.2 కోట్లకు పైగానే ఉంటుందని చెబుతున్నారు. ప్రమాదానికి గురైన కారు రూ.2కోట్లు విలువ చేసే లగ్జరీ కారు కావడంతో.. కారులోని నిందితులు బడా బాబులకు చెందిన వారై ఉంటారని తెలుస్తోంది.