తాజా లెక్కల ప్రకారం చూసుకుంటే భారతదేశ జనాభా.. 145 కోట్ల పైచిలుకు. చైనా జనాభా మాత్రం 142 కోట్లే! అంటే ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ జనాభా ఉన్న దేశం మనదే అయిపోయింది. అధికారికంగా ఈ లెక్కను ఇంకా ప్రకటించలేదు గానీ, వాస్తవం ఇదే. అయినా కొంతమంది నాయకులు మాత్రం మన జనాభా ఇంకా పెరగాలని ఆశిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ లాంటి వాళ్లు తమ తమ రాష్ట్రాల్లో జనాభా ఎంత పెరిగితే అంత మంచిదని అంటున్నారు. దేశంలో వృద్ధుల జనాభా పెరిగిపోతోందని, యువత రానురాను తగ్గిపోవడంతో రాబోయే కాలంలో ఉత్పాదకత మీద దాని ప్రభావం చాలా బలంగా పడుతుందని అంటూ.. అందుకోసం ప్రస్తుత యువత పిల్లలను విరివిగా కనాలని దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో కొందరు కోరుతున్నారు. అయితే.. దీని వెనక మరో పరమార్థం లేకపోలేదు. లోక్‌సభ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ 2029 ఎన్నికలకు ముందే జరగాల్సి ఉంది. అదే ఇప్పుడు అసలైన అగ్గిని రాజేస్తోంది. ఎన్ఎఫ్హెచ్ఎస్5 (జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే) ప్రకారం సంతానోత్పత్తి జాతీయ సగటు రేటు 2.0 కాగా, తెలంగాణలో 1.8 గాను, ఆంధ్రప్రదేశ్‌లో 1.7గాను ఉంది. అంటే సగటున ఒక్కో మహిళ ఎంతమంది పిల్లలను కంటున్నారనే లెక్క మాట.
లోక్‌సభ నియోజకవర్గాలకు, జనాభాకు సంబంధం ఏంటని చూస్తున్నారా..?
పునర్వ్యవస్థీకరణ తర్వాత ప్రస్తుతమున్న 543 లోక్ సభ నియోజకవర్గాల సంఖ్య 753కు పెరుగుతుంది. అత్యధిక జనాభా గల రాష్ట్రం యూపీలో 80 నుంచి 126కు సీట్లు పెరగొచ్చు. దక్షిణాదిలో కర్ణాటకలో మాత్రమే చెప్పుకోదగ్గ స్థాయిలో అంటే 28 నుంచి 36 సీట్లకు పెరిగే అవకాశం కనిపిస్తోంది. తమిళనాడులో 39 నుంచి 41కి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో మూడేసి సీట్లు పెరిగే అవకాశం ఉండొచ్చు. అంటే ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న 25 సీట్ల నుంచి 28కి, తెలంగాణలో ఇప్పుడున్న 19 నుంచి 22కు మాత్రమే పెరిగేందుకు అవకాశం ఉంటుంది. ఇక జనాభా నియంత్రణను అత్యంత సమర్థంగా చేపట్టిన కేరళలో ప్రస్తుతం ఉన్న 20 లోక్‌సభ స్థానాల్లో ఒకటి తగ్గినా తగ్గొచ్చు. బీజేపీకి అనుకూలంగా ఉండే ఉత్తరాదిలో ఎంపీ స్థానాల సంఖ్య పెరగడం, జనాభా నియంత్రణను మెరుగ్గా పాటించిన రాష్ట్రాలలో ఆశించిన స్థాయిలో పెరగకపోవడంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జనాభా కట్టడి పాటించని రాష్ట్రాలకు ఎంపీ సీట్ల రూపంలో రివార్డ్ ఇవ్వడం ఏ మేరకు సమంజసం అనే ప్రశ్నలు వేస్తున్నాయి. మరో లెక్క ప్రకారం అయితే.. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న 25 స్థానాలు పెరగకపోగా, 20కి తగ్గే ప్రమాదం కూడా లేకపోలేదు.
అలాగే తెలంగాణలో 19 నుంచి 15కు తగ్గొచ్చని కూడా అంటున్నారు. తమిళనాడులో 39 నుంచి 30, కేరళలో 28 నుంచి 26కి, కర్ణాటకలో 20 నుంచి 14కి తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇదే జరిగితే పార్లమెంటులో మన గొంతు వినిపించే అవకాశం దక్షిణాది రాష్ట్రాలకు ఇప్పటికే అంతంతమాత్రంగా ఉండగా.. ఇక మీదట అస్సలు వినిపించదు. సంఖ్యాబలం ఆధారంగానే పార్టీలకు మాట్లాడే అవకాశం కల్పిస్తారు. దానికితోడు.. ఉత్తరాది రాష్ట్రాల్లో ఏ పార్టీ బలంగా ఉంటే ఆ పార్టీయే కేంద్రంలో అధికారంలోకి వస్తుంది. ఉదాహరణకు తాజా సార్వత్రిక ఎన్నికలనే చూసుకుంటే.. బీజేపీకి ఉత్తరాదిలో కొంత బలం తగ్గింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడం, దానితో పొత్తు పెట్టుకున్న సందర్భంగా బీజేపీకి కూడా కొంత ప్రయోజనం కలగడం మనం చూశాం. ఇక్కడ చంద్రబాబు, బీహార్‌లో నీతీష్‌కుమార్ ఇద్దరూ అండదండలు అందించడం వల్లే కేంద్రంలో ఎన్డీయే వరుసగా మూడోసారి అధికారపగ్గాలు చేపట్టగలిగింది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కానీ, ఇక మీదట ఇలాంటి పరిస్థితి ఉండే అవకాశం ఏమాత్రం కనిపించడం లేదు. కేంద్రంలో ఎన్డీయే వచ్చినా, యూపీఏ వచ్చినా, లేదా మరేదైనా కూటమి వచ్చినా… వాళ్లంతా కేవలం ఉత్తరాదిలో గెలుచుకునే స్థానాల ఆధారంగానే అధికారం చేపడతారు. వారికి దక్షిణాది బలం దాదాపుగా అవసరం ఉండకపోవచ్చు. అందువల్ల దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాల గురించి కొట్లాడే అవకాశం కూడా ఆయా ప్రభుత్వాలకు దొరకదు.
పార్లమెంటులో ప్రాతినిధ్యం ఒక్కటే కాదు..
దక్షిణాదిలో జనాభా పెరుగుదల ఆగిపోవడం వల్ల పార్లమెంటులో ప్రాతినిధ్యం తగ్గుతుందనే ఆందోళనలున్నాయి. కేంద్ర ఆరోగ్యకుటుంబ సంక్షేమశాఖకు చెందిన 2020 నివేదిక ప్రకారం, 2011తో పోలిస్తే 2036 నాటికి దేశ జనాభా 31.1 కోట్లు పెరుగుతుంది. ఇందులో సుమారు 17 కోట్ల జనాభా బిహార్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్‌లలోనే ఉంటుంది. ఇది మొత్తం పెరిగిన జనాభాలో సుమారు 54 శాతం. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటకల్లో పెరిగే జనాభా 2.9 కోట్లు. అంటే ఇది మొత్తం పెరిగిన జనాభాలో కేవలం 9శాతం. జనాభా సంఖ్యను బట్టే అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్య ఉంటుంది. ఆ సంఖ్య తగ్గితే రాజకీయ బలం తగ్గిపోతుంది. ఎక్కువ సీట్లు ఉన్న రాష్ట్రాలు తమ డిమాండ్లు సాధించుకోవడంలో ముందుంటాయి. పార్లమెంటులో ప్రాతినిధ్యం మాత్రమే కాదు కేంద్రం పంచే నిధులకు సంబంధించి కూడా ఆందోళనలున్నాయి. ఈ ఏడాది ఫ్రిబవరిలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ దిల్లీలో నిరసన కూడా చేపట్టారు. పన్నుల రూపంలో తాము కేంద్రానికి కట్టేదానికి, కేంద్రం నుంచి తమకు దక్కేదానికి పొంతనే లేదన్నది వారి ప్రధాన అభ్యంతరం. కేంద్రం న్యాయబద్ధంగా పన్నుల్లో వాటా ఇవ్వకపోతే దక్షిణాది ప్రజలు ప్రత్యేక దేశం కోసం గళమెత్తుతారని కర్ణాటకు చెందిన కాంగ్రెస్ ఎంపీ డీకే సురేష్ అనడం కొంత వివాదానికి కారణమైంది. 15వ ఫైనాన్స్ కమిషన్ ప్రకారం 2020–21లో కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు 10శాతం కంటే తక్కువ నిధులు వస్తుంటే అదే ఉత్తరప్రదేశ్‌కు 15శాతానికి పైగా వస్తున్నాయి. బీహార్ విషయంలో అది 30శాతం పైగా ఉంది. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ విషయంలో 10శాతం కంటే తక్కువగా ఉంది.
సీఎంలు ఏమంటున్నారు?
దాంతోపాటు.. వృద్ధుల జనాభా పెరిగిపోతే ప్రభుత్వాలు సంక్షేమ కార్యక్రమాల మీద పెద్ద మొత్తంలో ఖర్చుపెట్టాల్సి ఉంటుంది. అమరావతిలో ప్రజలు వృద్ధులు అవుతున్నారని, రాష్ట్రానికి అదొక సమస్యగా మారనుందని చంద్రబాబు అక్టోబర్ 19న వ్యాఖ్యానించారు. ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలను కనాలని మరొకసారి పిలుపునిచ్చారు. ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలను కనకుంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి ‘అనర్హులుగా’ చేస్తూ చట్టం కూడా తీసుకొస్తామన్నారు. జపాన్, చైనా లాంటి దేశాలు ఈ వృద్ధుల జనాభా సమస్యతో ఎలా పోరాడాల్సి వస్తోందో కూడా ఆయన ప్రస్తావించారు. 2014 నుంచే ఆయన దీని మీద మాట్లాడుతూ వస్తున్నారు. జనాభా పెరిగితేనే మానవ వనరులు వృద్ధి చెంది సంపద పెరుగుతుందని చెబుతూ వచ్చారు. రాష్ట్రాభివృద్ధి కోసం రూపొందిస్తున్న విజన్2047లో జనాభా మీద ‘ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది’ అని ఆయన చెప్పారు. ఆ మర్నాడే.. అంటే అక్టోబర్ 20న తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పార్లమెంటులో సీట్ల ప్రాతినిధ్యం మీద జనాభా నియంత్రణ చూపి ంచే ప్రభావాన్ని ప్రస్తావించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన సామూహిక వివాహ వేడుకకు హాజరైన ఆయన, ‘పార్లమెంటు స్థానాలు తగ్గిపోతున్న తరుణంలో 16 మంది పిల్లలను ఎందుకు కనకూడదు?’ అని ప్రశ్నించారు. నవ దంపతులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, ‘మన సాంప్రదాయంలో నవ దంపతులు 16 రకాల సంపదలు పొందాలని కుటుంబపెద్దలు ఆశీర్వదించేవారు. 16 రకాల సంపదలు పొంది సుసంపన్న జీవితాన్ని అనుభవించాలని చెప్పేవారు. 16 మంది పిల్లలను కనాలని చెప్పడం వారి ఉద్దేశం కాదు. కానీ, నిజంగానే వాళ్లు 16 మంది పిల్లలను కనడం మంచిదేమో అనే పరిస్థితులు తలెత్తాయి. చిన్న కుటుంబమో, సుసంపన్న కుటుంబాన్నో కోరుకోకపోవడం బెటర్ అనే ఆలోచనలు వస్తున్నాయి’ అని వివరించారు. జనాభా నియంత్రణ మీద ఆ ఇద్దరు ముఖ్యమంత్రులు ఆందోళన వ్యక్తం చేయడం ఇదే తొలిసారి కాదు. ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే జనాభా నియంత్రణలో ముందున్న దక్షిణాది రాష్ట్రాలు డీలిమిటేషన్ వల్ల నష్టపోతాయనే ఆందోళన ఎప్పటి నుంచో ఉంది. కేంద్రం జనాభా ఆధారంగా రాష్ట్రాలకు నిధులను పంచడం మీద ఎంతో కాలంగా దక్షిణాది రాష్ట్రాలు, ముఖ్యమంత్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
2001లో ఆంధ్రప్రదేశ్‌లో వృద్ధుల జనాభా 12.6 శాతం. కొంత కాలంగా అది పెరుగుతూ వస్తోందని డేటా చెబుతోంది. భారత రిజిస్ట్రార్ జనరల్ గణాంకాల ప్రకారం ఈ జనాభా 2011లో 15.4 శాతంగా ఉండగా 2021లో 18.5 శాతం, 2031 నాటికి 24.7 శాతానికి పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. వృద్ధుల జనాభా పెరుగుతోంది అంటే పని చేసే జనాభా తగ్గుతోందని అర్థం. ఇది ప్రధానంగా మానవ వనరుల కొరతకు దారి తీస్తుంది. సౌత్ కొరియా, చైనా, జపాన్ వంటి దేశాలు ఇప్పటికే ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి. పెళ్లి చేసుకున్న వారికి ఆర్థిక ప్రోత్సాహకాలను దక్షిణ కొరియా ప్రకటించింది. జపాన్ అయితే మ్యారేజ్ బడ్జెట్ కేటాయించింది. అక్కడ 1972 నుంచే చైల్డ్ బెనిఫిట్ యాక్ట్ అమలులో ఉంది. అప్పట్లో జననాల రేటు పెంచేందుకు జపాన్ చేసిన ఆలోచన ఇది. తర్వాత ఈ నజరానాను కొద్దికొద్దిగా పెంచుతూ వచ్చింది కూడా. బిడ్డ పుట్టగానే గతంలో 2.52 లక్షల రూపాయలు ఇస్తుండగా, దాన్ని ఇప్పుడు 3 లక్షలకు పెంచింది. జపాన్ లాగే జర్మనీ , రష్యా , తైవాన్, యూరోపియన్ దేశాల్లోనూ జననాల రేటు తగ్గుతోంది. దీంతో కొన్ని దేశాలు జనాభా పెంచేందుకు కుటుంబాలకు ఆర్థిక సాయాన్ని ఆయుధంగా మార్చుకుంటున్నాయి. ఈ దేశాలన్నీ బేబీ బోనస్ స్కీమ్ అమలు చేస్తున్నాయి. కొవిడ్ కారణంగా సింగపూర్‌లోని చాలా జంటలు పిల్లల్ని వద్దనుకోవడంతో వారికి ఆర్థిక సాయం అందిస్తామని పిల్లల్ని కనాలంటూ ప్రోత్సహిస్తోంది అక్కడి ప్రభుత్వం. మొదటి బిడ్డకు రూ.4.80 లక్షలు, రెండో బిడ్డకు రూ.6 లక్షలను అందజేస్తోంది. తల్లిదండ్రులకు కూడా చైల్డ్ డెవలప్మెంట్ బోనస్ కింద రూ.3.40 లక్షలు ఇస్తోంది.
ఎందుకీ తగ్గుదల?
చాలామంది ఆర్థిక స్తోమత సరిపోదన్న భావనతో, పిల్లల్ని పోషించడం కష్టమవుతుందనే ఉద్దేశంతో పిల్లల్ని కనడం మానేస్తున్నారు. జనాభా నియంత్రణ కారణంగా రాబోయే రోజుల్లో అనేక పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పలువురు ఆందోళన చెందుతున్నారు. ఇటీవలి సంవత్సరాలలో చాలా మంది కాబోయే తల్లిదండ్రులు తమ ఆర్థిక స్థితిపై పిల్లల పెంపకంతో కలిగే ప్రభావం గురించి ఆందోళన చెందుతున్నారని అనేక సర్వేలు చెబుతున్నాయి. ప్యూ రీసెర్చ్ సెంటర్ సర్వేలలో అమెరికన్లలో 50 ఏళ్ల లోపు వయసు ఉండి.. అస్సలు పిల్లలు లేనివారు 2018లో 37శాతం మాత్రమే ఉండగా.. అది 2023లో 47శాతానికి పెరిగింది. తమకు పిల్లల్ని పెంచే స్తోమత లేకపోవడం వల్లే కనలేదని వారిలో 36 శాతం మంది చెప్పారు.
పెరిగితే వచ్చే నష్టాలు..
జనాభా ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోవడం వల్ల ప్రభుత్వాల మీద సంక్షేమ పథకాల భారం పెరుగుతుంది. మన దేశంలో దాదాపు ప్రతి రాష్ట్రంలోనూ పిల్లలకు ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా చదువు చెప్పడం, పాఠ్య పుస్తకాలు ఉచితంగా ఇవ్వడం, మధ్యాహ్న భోజన పథకాలు పెట్టడం లాంటివి ఉంటున్నాయి. కొందరు ఉద్యోగాలు రానివాళ్లకు నిరుద్యోగ భృతి కూడా ఇస్తామంటున్నారు. ఇలాంటి అన్నింటిమీదా పెట్టే ఖర్చు జనాభాతోపాటే పెరుగుతుంది. పెరిగిన జనాభాకు తగినంతగా మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఇళ్లు, రోడ్లు, డ్రైనేజి, తాగునీరు, వైద్య సదుపాయాలు.. అన్నింటినీ పెంచాల్సి ఉంటుంది. పెరిగిన జనాభాకు తగినంతగా ఆహార పదార్థాల ఉత్పత్తి ఉండాలి. కానీ అది స్థిరంగా ఉండడంతో కొరత పెరుగుతుంది. అప్పుడు ధరలు కూడా ఆకాశాన్నంటుతాయి. ఇలా జనాభా పెరుగుదల వల్ల వచ్చే నష్టాలు కూడా చాలానే ఉన్నాయి.
ఏం చేయాలి?
జననాల రేటు మరీ జపాన్ స్థాయిలో తగ్గిపోయినా ఉత్పాదకతకు ప్రమాదమే ఉంటుంది. వృద్ధుల జనాభా పెరిగిపోయి, పనిచేసేవాళ్ల సంఖ్య తగ్గుతుంది. అలాగని మరీ పెరిగిపోయినా పైన చెప్పుకొన్న సమస్యలు చాలా తలెత్తుతాయి. అందువల్ల మరీ అతివృష్టి, మరీ అనావృష్టి కాకుండా మధ్యేమార్గంగా వ్యవహరించడం సమంజసం. ఒక్కొక్క జంట 16 మందిని కనాలంటే.. మహిళల ఆరోగ్యం మీద ఎంతటి ప్రభావం పడుతుందో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న స్టాలిన్ కనీసం ఆలోచించారో లేదో అన్న అనుమానం వస్తుంది. అభివృద్ధి చెందిన అమెరికా లాంటి అగ్రరాజ్యాల్లోనే కొందరు మహా అయితే ముగ్గురిని కంటున్నారు. అక్కడ విస్తీర్ణం ఎక్కువ, జనాభా తక్కువ. అయినా అంత పరిమితి పాటిస్తున్నారు. అలాంటప్పుడు మనకున్న వసతులు, సదుపాయాలను దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకోవాలే గానీ.. ఇష్టారాజ్యంగా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం నోటికి వచ్చినట్లు చెప్పేస్తే ఆ తర్వాత యావద్దేశంలో ఆర్థిక పరిస్థితులు అతలాకుతలం అయిపోతాయి.
సమయమంత్రి చంద్రశేఖర శర్మ