ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను హోం మంత్రిని అయితే పరిస్థితులు వేరేలా ఉంటాయన్నారు. విమర్శలు చేసే వారిని ఇలాగే వదిలేస్తే హోం మంత్రిగా నేను బాధ్యతలు తీసుకుంటాను అని తమ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సోమవారం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించారు. గొల్లప్రోలు, పిఠాపురం, కొత్తపల్లి లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. గొల్లప్రోలు లోని జడ్పీ ఉన్నత పాఠశాలలో సైన్స్ ల్యాబ్ ను ప్రారంభించారు. పదవ తరగతి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. దివ్యాంగులకు బ్యాటరీ సైకిల్స్ పంపిణీ చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో పవన్ మాట్లాడారు.
పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు తాను రుణపడి ఉంటానని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. పిఠాపురాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. నియోజకవర్గ అభివృద్ధి పై మాస్టర్ ప్లాన్ తయారవుతోందని తెలిపారు. కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఆడపిల్లలపై జరుగుతున్న దాడులపై స్పందించిన పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఐదేళ్లలో ప్రభుత్వం పని చేయలేదు. అందుకే ఆ పరిణామాలన్నీ ఇప్పుడు చూస్తున్నామన్నారు. ఇళ్లలోకి వెళ్లి మహిళలపై అత్యాచారం చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని పవన్ నిలదీశారు. రేప్ కేసుల్లో కులం ప్రస్తావన తీసుకురావడం సరికాదన్నారు. రేప్ కేసులు ఎందుకు పెరుగుతున్నాయో హోం మంత్రి అనిత రివ్యూ చెయ్యాలని సూచించారు. తాను హోంమత్రిగా ఉంటే పరిస్థితులు వేరేలా ఉంటాయన్నారు.
రాజకీయంగా విమర్శలు చేయవచ్చు, కానీ ఇంట్లో ఆడవారిపై విమర్శలు చేసే వారిని ఇలాగే వదిలేస్తే హోం మంత్రిగా నేను బాధ్యతలు తీసుకుంటాను అని హెచ్చరించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ చాలా కీలకమన్నారు, ఇది పోలీసులు మర్చిపోవద్దని సూచించారు. మా బంధువు అంటే మడతపెట్టి కొట్టండి అన్నారు. గత ప్రభుత్వంలో మాదిరి అలసత్వం వహించకుండా డీజీపీ బాధ్యతలు తీసుకోవాలని కోరారు. పదవి ఉండొచ్చు లేకపోవచ్చు ఐ డోంట్ కేర్ అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. 30 వేల మంది ఆడపిల్లలు మిస్ అయితే గత ప్రభుత్వంలో సీఎం నోరు మెదపలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యాచారాలు చేసే నీచులు, దుర్మార్గులను గత ప్రభుత్వం వదిలేసిందని మండిపడ్డారు. ఆ వారసత్వమే ఇప్పుడు కూడా కొనసాగుతోందని చెప్పుకొచ్చారు. బయటకు వెళ్తే మమ్మల్ని ప్రశ్నిస్తున్నారని పవన్ తెలిపారు. రేప్ చేయాలంటే భయపడేలా పోలీసులు, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు పవన్ కళ్యాణ్.