కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షి (Deepadas Munshi) పరువు నష్టం దావా కేసు విచారణ వాయిదా పడింది. తెలంగాణ బీజేపీ ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ చేసిన ఆరోపణలు తన పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించేలా ఉన్నాయని దీపాదాస్ మున్షి నాంపల్లి కోర్టుని ఆశ్రయించారు. ఆమె వేసిన పిటిషన్ పై గతంలో విచారణ జరిపిన న్యాయస్థానం… నేడు మరోసారి విచారణ జరిపింది. ఈ నేపథ్యంలో దీపాదాస్ మున్షి, బీజేపీ నేత ప్రభాకర్ లు నాంపల్లి కోర్టు ఎదుట హాజరయ్యారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను డిసెంబర్ 5కి వాయిదా వేసింది.
కాగా, దీపాదాస్ మున్షి (Deepadas Munshi) రాజకీయ నేతల నుంచి ముడుపులు తీసుకున్నారని గతంలో బీజేపీ నేత ప్రభాకర్ పలు ఆరోపణలు చేశారు. లోక్ సభ ఎన్నికల సమయంలో ఓ టీవీ ఛానల్ లో మాట్లాడిన ప్రభాకర్.. దీపాదాస్ మున్షి, కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇప్పించేందుకు పలువురు నేతల నుంచి బహుమతులు పొందారని, బెంజ్ కార్లు తీసుకున్నారని ఆరోపించారు. ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహించిన మున్షి.. నాంపల్లి కోర్టులో ఆయనపై పరువునష్టం దావా కేసు వేశారు. కాంగ్రెస్ మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్, కార్యకర్తలు పార్థభౌమిక్, శుభలక్ష్మి లను పిటిషన్ లో సాక్షులుగా చేర్చారు.
దీపాదాస్ వేసిన ఈ పిటిషన్ పై విచారణకు హాజరవకుండా ప్రభాకర్ పలుమార్లు డుమ్మా కొట్టారు. దీంతో ఆగ్రహించిన న్యాయస్థానం… చేసిన ఆరోపణలకు ఆధారాలతో సహా నేడు కోర్టు ఎదుట హాజరవ్వాలని ప్రభాకర్ కి ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో దీపాదాస్ మున్షి, ప్రభాకర్ కోర్టు ఎదుట హాజరయ్యారు. కాగా, తదుపరి విచారణ వచ్చే నెల ఐదుకి వాయిదా పడింది.
Dadisetti Raja: వైసీపీ కీలక నేత దాడిశెట్టికి హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ