భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీం కోర్టు (Supreme Court) ధర్మాసనం ప్రైవేట్ ఆస్తుల స్వాధీనంపై కీలక తీర్పు వెల్లడించింది. ప్రైవేట్ ఆస్తులన్నిటిని ప్రభుత్వం తీసుకోడానికి వీల్లేదంటూ 9 మంది న్యాయమూర్తుల ధర్మాసనం మంగళవారం తేల్చి చెప్పింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 39(బి) ప్రకారం పౌరుల ప్రైవేట్ యాజమాన్యంలోని ప్రతి ఆస్తిని ప్రభుత్వం సామాన్య ప్రయోజనాలకు సేవ చేయడం కోసం స్వాధీనం చేసుకోరాదని తీర్పు చెప్పింది. అయితే, కొన్ని కేసులలో ప్రైవేట్ ఆస్తులపై రాష్ట్రాలు దావా వేయవచ్చని పేర్కొంది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 39(బి) ప్రకారం ప్రైవేట్ యాజమాన్యంలోని అన్ని ఆస్తులను ఉమ్మడి ప్రయోజనం కోసం రాష్ట్రం స్వాధీనం చేసుకోవచ్చని జస్టిస్ కృష్ణయ్యర్ గతంలో ఇచ్చిన తీర్పును సీజేఐ వెలువరించిన మెజారిటీ తీర్పు (8:1) తోసిపుచ్చింది. ప్రైవేట్ వ్యక్తుల ఆస్తులను సమాజ వనరుగా పరిగణించొచ్చా అనే అంశంపై నేడు మరోసారి చర్చించిన ధర్మాసనం ఈ మేరకు తీర్పును వెల్లడించింది.
Also Read : రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటన.. కేటీఆర్, హరీష్‌రావు ప్రశ్నల వర్షం
రాజ్యాంగంలోని ఆర్టికల్ 39 (బి) ప్రకారం ప్రైవేట్ ఆస్తులన్నీ సమాజ ముఖ్య వనరులుగా పరిగణించవచ్చా? ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చా? అనే న్యాయపరమైన ప్రశ్నలపై సుప్రీం ధర్మాసనం తీర్పు చెప్పింది. ప్రైవేట్ యాజమాన్యంలోని అన్ని వనరులను రాష్ట్రం స్వాధీనం చేసుకునే హక్కు లేదని తేల్చి చెప్పింది. కేవలం భౌతిక అవసరాలు అర్హతగా ఒక వ్యక్తికి చెందిన అన్ని ప్రైవేటు వనరులను కమ్యూనిటీ మెటీరియల్ రిసోర్స్ గా పరిగణించకూడదు అని భావిస్తున్నామని సీజేఐ చంద్రచూడ్ వెల్లడించారు.
వనరుల స్వభావం, లక్షణాలు సమాజానికి ఎంతవరకు ఉపయోగకరం? వనరుల కొరత, వనరుల పరిణామాలు వంటి అంశాలు పరిగణలోకి తీసుకోవాలని సుప్రీం ధర్మాసనం సూచించింది. నిర్బంధ స్వాధీనాలు, హడావిడి నిర్ణయాలు, న్యాయబద్ధంగా లేని పరిహారాల కారణంగా పౌరులు నష్టపోవడానికి చట్టం అనుమతించబోదని సుప్రీం (Supreme Court) ధర్మాసనం స్పష్టం చేసింది. అలాగే ఆస్తి స్వాధీనం విషయాలను ముందుగా తెలియచేయాలని సూచించింది. తగిన సమయం ఇవ్వడం, అభ్యంతరాలు స్వీకరించడం, వాటిని పరిష్కరించడం, పునరావాసం కల్పించడం, ప్రజా ప్రయోజనం కోసమేనని వివరించడం వంటివన్నీ ప్రభుత్వాలు చేయాల్సి ఉంటుంది అని తెలిపింది.
కాగా, సీజేఐ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు హృషికేష్ రాయ్, జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రా, రాజేష్ బిందాల్, ఎస్సీ శర్మ, అగస్టిన్ జార్జ్ మసీహ్ మెజారిటీ తీర్పు ఇచ్చారు. జస్టిస్ బివి నాగరత్న సిజెఐ రాసిన మెజారిటీ తీర్పుతో పాక్షికంగా విభేదించగా, జస్టిస్ సుధాన్షు ధులియా అన్ని అంశాలపై విభేదించారు.