AP DGP| పోలీసులపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan kalyan) చేసిన వ్యాఖ్యలపై డీజీపీ ద్వారకా తిరుమలరావు(Dwaraka Tirumalarao) స్పందించారు. గత వైసీపీ ప్రభుత్వంలో కొన్ని తప్పులు జరిగాయని అంగీకరించారు. గత ప్రభుత్వంలో పోలీసులు కూడా సరిగా విధులు నిర్వహించలేదన్నారు. ఓ పార్టీ కార్యాలయంపై దాడి జరిగినా బాధ్యతగా వ్యవహరించలేదని గుర్తుచేశారు. భావప్రకటనా స్వేచ్ఛ వల్ల దాడి జరిగిందని అప్పటి పోలీసులు కేసును నీరుగార్చారని పేర్కొన్నారు. ఆ కేసులో ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదని చెప్పుకొచ్చారు.
తప్పు జరిగితే 30 ఏళ్ల తర్వాతైనా చర్యలు తీసుకోవచ్చని స్పష్టంచేశారు. రాజ్యాంగానికి కట్టుబడి పోలీసులు పనిచేస్తారని.. రాజకీయ ఒత్తిళ్లతో పనిచేయమన్నారు. వాస్తవ పరిస్థితుల ఆధారంగానే ఏ కేసునైనా విచారిస్తామని వెల్లడించారు. మానవ హక్కులు, మహిళలు, చిన్నారుల రక్షణకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. ప్రజలకు బాధ్యతాయుతంగా ఉండేలా పోలీసు వ్యవస్థలో చర్యలు చేపట్టామన్నారు. దుష్ట శిక్షణ.. శిష్ట రక్షణే తమ విధానమని తెలిపారు. బాధితులకు న్యాయం చేసేందుకే చట్టాలు, కోర్టులు ఉన్నాయని డీజీపీ వెల్లడించారు.
కాగా ఇంట్లో ఆడవారిపై విమర్శలు చేసే వారిని ఇలాగే వదిలేస్తే తాను హోంమంత్రిగా బాధ్యతలు తీసుకుంటాననని పవన్ కళ్యాణ్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ చాలా కీలకమని.. ఇది పోలీసులు మర్చిపోవద్దని సూచించారు. గత ప్రభుత్వంలో మాదిరి అలసత్వం వహించకుండా డీజీపీ బాధ్యతలు తీసుకోవాలని కోరారు. 30వేల మంది ఆడపిల్లలు మిస్ అయితే గత ప్రభుత్వంలో సీఎం నోరు మెదపలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యాచారాలు చేసే నీచులు, దుర్మార్గులను గత ప్రభుత్వం వదిలేసిందని మండిపడ్డారు. ఆ వారసత్వమే ఇప్పుడు కూడా కొనసాగుతోందని చెప్పుకొచ్చారు. రేప్ చేయాలంటే భయపడేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని సూచించారు.